గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పిలుపు
కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి వీలుగా ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజినల్ ఔట్‌రీచ్ బ్యూరో (ఆర్‌ఓబీ) కొవిడ్ జాగ్రత్తలు, వ్యాక్సినేషన్‌పై ఏర్పాటుచేసిన డిజిటల్ మొబైల్ వీడియో పబ్లిసిటీ వాహనాలను శనివారం తమిళసై రాజభవన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, ప్రజల్లో కొవిడ్ టీకాపై ఉన్న సంశయం క్రమంగా తొలగిపోయిందన్నారు. ప్రతి ఒక్కరూ టీకా తీసుకుని కరోనా వైరస్ పట్ల బాహుబలిగా మారాలన్న ప్రధానమంత్రి పిలుపును ఈ సందర్భంగా ప్రస్తావించిన గవర్నర్.. టీకాపై సంశయాలు ఉన్న గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు ప్రధాని మోడీ పిలుపుని చేరవేయాలని గవర్నర్ తమిళ సై చెప్పారు. కొవిడ్ టీకా ఆవశ్యకతపై ప్రధాని తరచుగా ఇస్తున్న సందేశాలు, 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ ఉచిత టీకాలు అందించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలందరికీ చేరవేయాలని ఆమె అన్నారు.