విశాలాంధ్ర-హైదరాబాద్: వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి రిలయన్స్ ఫౌండేషన్ రూ.20 కోట్లు విరాళం అందజేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్, బోర్డు సభ్యులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రిలయన్స్ గ్రూప్ మెంటాం పీవీఎల్ మాధవ రావు శుక్రవారం జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయనను కలిసి చెక్కు అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ప్రఖ్యాత హెచ్‌పీఎల్ టెక్నాలజీస్ చైర్‌పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ భేటీలో టెక్నాలజీ అభివృద్ధి, తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ప్రపంచ అవసరాలను తీర్చగలిగే స్థాయిలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ప్రభుత్వ ప్రణాళికలు, పెట్టుబడుల విస్తరణపై రోష్ని నాడార్ ఆసక్తి కనబరిచారు.
స్వర్ణ పతకాల విజేతలకు సత్కారం
ఇటీవల బుడాపెస్ట్ లో జరిగిన ఒలింపియాడ్‌లో భారత్ తరపున మొదటిసారి స్వర్ణ పథకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారులు హరిక ధ్రోనవల్లి, అర్జున్ లను శుక్రవారం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సత్కరించి ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున ప్రోత్సాహాన్ని ప్రకటించారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, క్రీడాకారుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు.