కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ జలాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా కొమురవెల్లి మల్లన్నకు కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ, ఇది మల్లన్న సాగర్ కాదు జల హృదయ సాగర్ అని అన్నారు. మల్లన్న సాగర్ కోసం నిర్వాసితులు చేసిన త్యాగం వెలకట్టలేనిదన్నారు.కొందరు నేతలు ఇక్కడికొచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.. కానీ వాటన్నింటిని ఎదురించి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు. కాళేశ్వరంతో అద్భుత జలదృశ్యం ఆవిష్కృతమైందన్నారు. మత్స్య,పాడి పరిశ్రమ అభివృద్ది చెందుతుందన్నారు. ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు త్వరలో పూర్తవుతుందన్నారు. మల్లన్న సాగర్ ద్వారా 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు పూర్తిస్ధాయి న్యాయం చేస్తామన్నారు.ప్రాజెక్టులపై కనీస పరిజ్ఞానం లేని పార్టీలు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.