. మీ విలాసాలకు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు
. ఇళ్లకు అనుమతులిచ్చిన వారిపై చర్యలు: కేటీఆర్ డిమాండ్
విశాలాంధ్ర-హైదరాబాద్:రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రాజెక్ట్ పేరుతో దేశంలోనే అతి పెద్ద కుంభకోణానికి తెరలేపారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాబోయే ఎన్నికల కోసం ఈ ప్రాజెక్ట్ ను కాంగ్రెస్ రిజర్వ్ బ్యాంక్‌లా వాడుకోవాలని చూస్తోందని అన్నారు. నమామీ గంగే ప్రాజెక్టే రూ.40 వేలు కోట్లు అయితే మూసీ ప్రాజెక్ట్ కోసం లక్షా 50 వేల కోట్లు అవసరమా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసలు ఈ ప్రాజెక్టులో కుంభకోణం కాక మరేమిటీ అని నిలదీశారు. మీ విలాసాలకు లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేయడం అవసరమా అని నిలదీశారు. ప్రజల సొమ్ము మీ జాగీర్ లా ఖర్చు చేయడం ఏంటన్నారు. మూసీ బాధితుల అక్రందనలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు వినబడటం లేదా అని ప్రశ్నించారు. ప్రజలకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని, న్యాయం కోసం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని భరోసా ఇచ్చారు. పేదల ఇళ్లు కూల్చమని ఇందిరమ్మ చెప్పిందా… సోనియమ్మ చెప్పిందా అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నడుస్తున్న బుల్డోజర్ అరాచకాలను పరిగణలోకి తీసుకొని చట్టపకారం వెళ్లామని సూచించిన గౌరవ హైకోర్టుకి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. ఆక్రమణలకు సంబంధించి నేరం చేసిందెవరు… శిక్ష వేసేదెవరికి అని నిలదీశారు. 1994లో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వాళ్లు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారన్నారు. మరి ఆనాడు రిజిస్ట్రేషన్లు, కరెంట్, వాటర్ బిల్లులు తీసుకున్నప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకని ప్రశ్నించారు. 2016 లో బఫర్ జోన్, ఎఫ్ టీఎల్, చెరువు మ్యాప్ లను సిద్దం చేసిందే బీఆర్‌ఎస్ ప్రభుత్వమని, అప్పటి వరకు ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆక్రమణదారులు అనడం ఎంతవరకు సమంజసం అని అడిగారు. పర్మిషన్లు ఇచ్చిన వాళ్లు, వాటిని ప్రోత్సహించిన వాళ్లపై చర్యలు తీసుకోవాలన్నారు. లక్షలాది మంది జీవితాలను అంధకారం చేస్తామంటే ఊరుకోమని స్పష్టం చేశారు. నిజంగా కూల్చాల్సి వస్తే ముందు హైడ్రా, జీహెచ్‌ఎంసీ బిల్డింగ్ లను కూలగొట్టాలని అవి నాలాల మీద ఉన్నాయన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే భావనతో సచివాలయాన్ని కూడా కూలగొట్టిన ఆశ్చర్యం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో దేశంలోనే వరి ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్ అయింది… నీళ్ల కరవు లేకుండా పోయిందన్నారు.
ముఖం చాటేసిన రేవంత్
రేవంత్ రెడ్డి మీడియాకు ముఖం చాటేసి, అధికారులను ముందు పెట్టారని కేటీఆర్ అన్నారు. ప్రజలు తిడుతుంటే ఆయనకు మాట్లాడే పరిస్థితి లేదన్నారు. మంత్రులు కాకుండా అధికారులను ముందు పెట్టి రాజకీయాలు చేస్తున్నారని, మీ మం త్రులు మూసీతో ఉండే ప్రయోజనాన్ని ఎందుకు చెప్పటం లేదని నిలదీశారు. వాస్తవాలను దాచి అధికారుల వెనుక దాక్కుంటే కుదరదు రేవంత్ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు. సావాస దోషంతో శ్రీధర్ బాబు కూడా ముఖ్యమంత్రి మాదిరిగా చెడిపోయిం డని వ్యాఖ్యానించారు. చిన్న పిల్లల ఆవేదన హైకోర్టుకు అర్థమైంది మీకు కావటం లేదా అంటూ నిలదీశారు.