పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈసందర్బంగా మంత్రి కేటీఆర్ జిల్లాలోని మహేశ్వరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, నగర శివారు ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఇవాళ ఒక్కరోజు రూ.400కోట్ల పనులకు శ్రీకారం చుట్టామన్నారు. మీర్ పేట్ మున్సిపాలిటీలో నిర్మించే సమీకృత శాఖాహార, మాంసాహార మార్కెట్, మంచినీటి సరఫరా కోసం చేపట్టే పనులు, బాక్స్ డ్రైన్స్ నిర్మాణం మరియు రోడ్డు విస్తరణ పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. త్వరలోనే ఎయిర్ పోర్టుకు ప్రత్యామ్నాయ రోడ్డు ఏర్పాటు చేస్తున్నామన్నారు. శివారు మున్సిపాలిటీల్లోనూ బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, ఎగ్గే మల్లేశం తదితరులు పాల్గొన్నారు.