తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా గతేడాది ఇంటర్ పరీక్షలు జరగని విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఫస్టియర్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4,59,228 మంది విద్యార్థులు ఉండగా..,769 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. పరీక్షా కేంద్రానికి వచ్చిన ప్రతి విద్యార్థికి థర్మల్ స్క్రీనింగ్, హాండ్ శానిటైజేషన్ చేసిన తర్వాతే పరీక్ష కేంద్రం లోపలికి అనుమతించారు. కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థులు భౌతికదూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇవాళ్టి నుంచి నవంబర్ మూడవ తేదీ వరకు జరగనున్న పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ ప్రకటించారు.