. ‘కాళేశ్వరం’ తప్పునకు బాధ్యులెవరు…
. పోస్టింగులపై కాదు… పనిమీద శ్రద్ధ పెట్టండి
. ఏఈఈ నియామక పత్రాల అందజేతలో రేవంత్ రెడ్డి
విశాలాంధ్ర-హైదరాబాద్ : నీళ్లు, నియామకాల ఆకాంక్షల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిరదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జలసౌధ ప్రాంగణంలో ఏఈఈలకు ఉద్యోగ నియామక పత్రాలు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… నీళ్లు మన సంస్కృతిలో భాగస్వామ్యం అన్నారు. తెలంగాణ ఏర్పడిన దశాబ్దం తరువాత నియామకాల ప్రక్రియ వేగంగా జరుగుతోందన్నారు. తెలంగాణ ప్రజల భావోద్వేగం నీళ్లతో ముడిపడి ఉందని, భావోద్వేగాలకు అనుగుణంగా నీళ్లను ఒడిసిపట్టి అందించాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. ఏ వృత్తిలోనైనా క్షేత్ర స్థాయిలో అనుభవం ఉన్నవాళ్లే రాణిస్తారని చెప్పారు. రాజకీయాల్లోనూ అదే కొనసాగుతుందన్నారు. పీవీ నరసింహారావు, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, నీలం సంజీవ రెడ్డి వంటి వారు సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రులు, ప్రధానులుగా ఎదిగారని గుర్తు చేశారు. తాను కూడా జిల్లా పరిషత్ మెంబర్ స్థాయి నుంచే సీఎం స్థాయికి వచ్చానని చెప్పారు. గతంలో ఇంజినీర్లు ఉదయం ఐదు గంటలకే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లి రిపోర్టులు రాసే వారని, కానీ ఈ మధ్య అలాంటివాళ్లు తగ్గిపోయారని అన్నారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులకు లక్ష కోట్లు ఖర్చు చేస్తే కట్టడం కూలడం రెండూ జరిగాయని, దీనికి ఎవరిని బాధ్యులను చేయాలో మీరే చెప్పాలన్నారు. అధికారులనా లేదా రాజకీయ నాయకులనా అని నిలదీశారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కాళేశ్వరం విషయంలో అందరిపై చర్యలు తీసుకుంటే ఆ విభాగమే ఉండదన్నారు. చర్యలు తీసుకోకపోతే ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈఈ చెప్పారని ఒకరు, ఎస్‌ఈ చెప్పారని ఇంకొకరు, ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని కానీ రాజకీయ నాయకులు తీసుకునే తప్పుడు నిర్ణయాలను అమలు చేయకుండా ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అయ్యేవి కాదన్నారు. రెండు లక్షల కోట్లు ఖర్చు చేసినా తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి కాలేదని, భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కాకూడదని సూచించారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో నీళ్లు అత్యంత కీలకమని చెప్పారు. పని మీద శ్రద్ధ పెట్టండి… పోస్టింగ్‌ల మీద కాదన్నారు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తే తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలబడుతుందన్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ పాల్గొన్నారు.