రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. తెలంగాణాలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ో రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి తీరు, కట్టడి చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సిఎస్ సోమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బి అర్ కే భవన్ లో జరిగిన ఈ కాన్ఫరెన్స్‌లో ఆయా జిల్లాల్లో వైరస్ వ్యాప్తి తీరు, కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్ తదితర అంశాల గురించి చర్చించారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ, ఫీవర్ సర్వేతో జ్వర లక్షణాలు ఉన్నవారిని గుర్తించి మెడికల్ కిట్లను పంపిణీ చేస్తామని హరీశ్‌రావు చెప్పారు. పకడ్బందీగా సర్వే చేపట్టి కొవిడ్‌ను కట్టడి చేద్దామని అధికార యంత్రాంగానికి పిలుపునిచ్చారు. ఫీవర్ సర్వేలో వ్యాధి లక్షణాలను గుర్తిస్తే అక్కడికక్కడే హోం ఐసోలేషన్‌లో కిట్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. థర్డ్‌వేవ్‌లో కరోనా సోకినా కొంతమందిలో వ్యాధి లక్షణాలు కనిపించడం లేదన్నారు. మరికొంతమంది పరీక్షలకు ముందుకు రావడం లేదన్నారు. అందుకే ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సర్వే చేపడుతుందన్నారు.