రైతులను మోసం చేసిన ఏ ప్రభుత్వమూ బాగుపడలేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతు పోరాటంతో కేంద్రం దిగిరావాల్సిందేనని అన్నారు. ధాన్యం సేకరణపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఒకటి చెబుతుంటే రాష్ట్ర బీజేపీ నేతలు మరొకటి చెబుతున్నారని, ఇది దివాలాకోరు రాజకీయమని అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన నిరసన విజయవంతం చేసినందుకు తెలంగాణ రైతులకు ధన్యవాదాలు తెలిపారు. మూడు నల్ల చట్టాలతో రైతుల మెడపై కత్తి వేలాడుతున్నదని, రైతులను బాధపెట్టే ప్రభుత్వాలకు ఉసురు తగులుతుందని అన్నారు. రైతుల కోసం వేల కోట్లు ఖర్చు చేసే శక్తి కేంద్ర ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. సామాన్యుల డబ్బులను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారని అన్నారు. తిరుపతిలో జరిగే అమిత్ షా సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎవరో ఒక ప్రతినిధి హాజరవుతారన్నారు. అక్కడకు వెళ్లి నిలదీయడానికి ఆయన వ్యవసాయ మంత్రి కాదని పేర్కొన్నారు.