తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ నేతలు సహకరించాలని అన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు విభజన చట్టంలో ఉందన్నారు. కోచ్ ఫ్యాక్టరీకి గతంలోనే భూసేకరణ, నిధులు ఇచ్చామని గుర్తుచేశారు. భూ సేకరణ జరిగినా కేంద్రం నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని అన్నారు. బీజేపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారన్నారు. బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన కోరారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేబినెట్ భేటీలో నిర్ణయించాలని డిమాండు చేశారు. లేదంటే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగిస్తామన్నారు. ఏ రాష్ట్రం నుంచి రైల్వే మంత్రులు వస్తే వారికే ప్రాజెక్టులు తరలిపోతున్నాయని ఆయన ఆరోపించారు. గుజరాత్, బీహార్, యూపీ లాంటి రాష్ట్రాలకు రాష్ట్ర భాగస్వామ్యం లేకుండానే రైల్వే ట్రాక్‌లు, ప్రాజెక్ట్‌లు మంజూరు చేస్తున్నారన్నారు.