విశాలాంధ్ర – హైదరాబాద్ : అమెరికాలోని నేవడ-అరిజోన రాష్ట్రాల సరిహద్దులోని కొలరాడో నదిపై ఎనిమిది దశాబ్దాల క్రితం నిర్మించిన అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టు హూవర్ డ్యామ్ ఎంతో ఆదర్శవంతమైందని, ఇక్కడి నీటి వినియోగం, అమలవుతున్న రక్షణ చర్యలు ఆచరించదగినవని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అమెరికాలో అధికారిక పర్యటనలో భాగంగా గురువారం ఆయన రాష్ట్ర ప్రతినిధి బృందంలో గల ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితర అధికారులతో కలిసి హూవర్ డ్యామ్ ను సందర్శించారు. ఫెడరల్ గవర్నమెంట్ అధికారులు ప్రాజెక్టు వివరాలను వీరికి వివరించారు. తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్న కాలంలో 1931-36 మధ్య నిర్మించిన ఈ ఆర్క్ గ్రావిటీ నిర్మాణం ఒక ఇంజినీరింగ్ అద్భుతమని, 17 జనరేటర్ల ద్వారా 2080 మెగావాట్ల జల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని, తద్వారా మూడు రాష్ట్రాల విద్యుత్ అవసరాలను తీరుస్తుందని చెప్పారు. మూడు ప్రధాన పట్టణాల్లో ఉన్న 80 లక్షల మందికి తాగు, సాగునీటి అవసరాలు తీరుస్తుందని ఫెడరల్ అధికారులు వివరించారు. 726 అడుగుల ఎత్తు, 1,244 అడుగుల పొడవు ఉన్న ఈ డ్యామ్ వెనుక ఒక పెద్ద కృత్రిమ సరస్సు ఏర్పడిరదని, పూర్తి నీటి నిలువ సామర్థ్యం ఉన్నప్పుడు 185 కిలోమీటర్ల పొడవున నీటితో విస్తరించి ఉంటుందని వివరించారు. ఏటా సుమారు 80 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తారని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి… అక్కడ జరుగుతున్న జల విద్యుత్తు ఉత్పాదకత, యంత్రాల సామర్థ్యం, నీటి లభ్యత, అడుగడుగునా ఏర్పాటు చేసిన రక్షణ చర్యలు, ఇతర సమాచారాన్ని అడిగి తెలుసుకు న్నారు. తెలంగాణలో ఉన్న జల విద్యుత్తు ప్రాజెక్టుల సమాచారంతో బేరీజు వేస్తూ హూవర్ డ్యామ్ జలవిద్యుత్తు ఉత్పాదకతను స్ఫూర్తిగా తీసుకొని మన ప్రాజెక్టుల సామర్థ్యం పెంపుదలకు, రక్షణ మెరుగుదలకు గల అవకాశాలను పరిశీలిం చాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా డ్యామ్ నిర్మాణ దృశ్యాలను, ఫొటోలను డ్యామ్ అధికారులు ప్రదర్శించారు.
వర్చువల్ రియాలిటీ సాయంతో బొగ్గు ఉత్పత్తి అద్భుతం
మైనెక్స్-2024 అంతర్జాతీయ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ ప్రఖ్యాత కంపెనీల స్టాల్స్‌ను ఉపముఖ్యమంత్రి భట్టి… రాష్ట్ర ప్రతినిధి బృందంతో సందర్శించారు. శాండ్విక్ కంపెనీ స్టాల్‌లో అత్యాధునిక కంటిన్యూయస్ మైనర్ యంత్రాన్ని, అదే స్టాల్లో ఏర్పాటు చేసిన వర్చువల్ రియాలిటీ మైనింగ్ టెక్నాలజీని స్వయంగా పరిశీలించారు. వర్చువల్ రియాలిటీ ద్వారా గని లోపల పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నందు వల్ల యంత్రాలను నడిపే ఆపరేటర్లు దీంతో మెరుగైన శిక్షణ పొందేందుకు అవకాశం ఏర్పడుతుందని నిర్వాహకులు వివరించారు. పని ప్రదేశానికి యంత్రాన్ని పంపించి అక్కడి పరిస్థితులను వెలుపలు నుంచే అంచనా వేస్తూ బొగ్గును తవ్వొచ్చని, ఇది అత్యాధునిక మైనింగ్ పద్ధతిగా నిలుస్తుందని చెప్పారు. ఈ సాంకేతికత వల్ల కలిగే ప్రయోజనాలు అద్బుతం అని, ఈ ఆధునిక సాంకేతికత వల్ల కార్మికులకు చిన్న ప్రమాదం జరగకుండా ఉత్పత్తిలో పాల్గొనే అవకాశం ఉంటుందని భట్టి పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల రక్షణను దృష్టిలో పెట్టుకొని ఈ తరహా సాంకేతికతను గనుల్లో ఏర్పాటు చేయడానిక ఉన్న అవకాశాలను పరిశీలించాలని సింగరేణి సీిఎండీ ఎన్.బలరామ్‌ను కోరారు.