హైదరాబాద్ నగర పరిధిలో చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని నిర్మాణాల కూల్చివేతలపై హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం కీలక సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో వివిధ అంశాలపై చర్చించేందుకు హైడ్రా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమావేశమయ్యారు. కూల్చివేతలపై న్యాయపరమైన సమస్యలు రాకుండా ఏం చేయాలో చర్చించారు. ఈ సమావేశంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. తమ భవనాలను కూల్చుతారనే ఆందోళనతో పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌లపై విచారణ జరిపిన న్యాయస్థానం, నిబంధనల మేరకు ముందుకు వెళ్లాలని హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ రోజు భేటీ నిర్వహించారు.