పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి వచ్చిన అందరికీ అభినందనలు తెలిపారు. . హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహ స్థలంలో ఆయన నేడు లాంచనంగా భూమి పూజ చేశారుౌ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ తల్లి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని నిర్ణయించుకున్నామని, అయితే దసరా వరకు ముహూర్తాలు లేవని, ప్రసిద్ధ పండితుల సూచన మేరకు నేడు భూమిపూజ చేసినట్లు చెప్పారు.
- పదేళ్లు ఏం చేశారు
పదేళ్ల పరిపాలనలో గత పాలకులు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు నిర్మించలేదని రేవంత్ ప్రశ్నించారు. . పదేళ్లు అధికారంలో ఉన్న వారు ఎన్నో కట్టడాలు నిర్మించారని గొప్పలు చెప్పుకుంటారని, మరి తెలంగాణ తల్లిని మరిచారన్నారని నిలదీశారుౌ తెలంగాణకు మేమే సర్వం.. నేనే తెలంగాణ అనేలా గతపాలకులు వ్యవహరించారన్నారని మండిపడ్డారు.
గడీలు బద్దలు కొట్టాం..
కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అలాంటి విధానాలకు విరుద్ధమన్నారు. ప్రగతి భవన్ పేరిట గడీ నిర్మించుకొని, భారీ కంచెలు ఏర్పాటు చేసుకొని వందలాది మంది పోలీసు పహారా పెట్టుకొని తెలంగాణ ప్రజలను అందులోకి రాకుండా నిషేధించారని, తాము అధికారంలో వచ్చాక ప్రగతి భవన్ పేరును ప్రజా భవన్‌గా మార్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. గడీగా మారిన ప్రగతి భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చి దేశానికి ఆదర్శంగా నిలిచామని, ఇప్పుడు ఎవరైనా ప్రజా భవన్‌లో స్వేచ్ఛగా వెళ్లవచ్చని ముఖ్యమంత్రి అన్నారు.
కోటి రూపాయిలు ఖర్చు చేయలేదు
తెలంగాణ పరిపాలనకు సచివాలయం గుండెకాయ అని సీఎం అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరడంతోపాటు తెలంగాణ అభివృద్ధికి సచివాలయం నుంచే విధాన పరమైన నిర్ణయాలు జరుగుతాయన్నారు. మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. గత పాలకులు ఎవరూ ప్రజలకు అందుబాటులో లేకపోవడం బాధకరమన్నారు. దాదాపు ఇరవై రెండున్నర లక్షల కోట్లను అప్పటి ప్రభుత్వం ఖర్చు పెట్టిందని, తెలంగాణ విగ్రహ ఏర్పాటుకు రూ.కోటి ఖర్చు కూడా చేయలేకపోయిందన్నారు..
60ఏళ్ల కలను నేరవేర్చింది సోనియానే..
సంకల్పం, పట్టుదల ఉంటే సాధ్యం కానిది లేదని తెలంగాణ ఉద్యమకారులు నిరూపించారని రేవంత్ అన్నారు. కరీంనగర్‌లో ఇచ్చిన మాట మేరకు సోనియా గాంధీ 60 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చారని ముఖ్యమంత్రి కొనియాడారు. 2014లో తెలంగాణ ఏర్పాటు కావడం సువర్ణాక్షరాలతో లిఖించదగిన అంశమన్నారు.
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని 2009, డిసెంబరు 9న మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ప్రకటించిందని, అదే రోజు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ జన్మదినం కావడంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిసెంబర్ 9న ఆవిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజలకు డిసెంబర్ 9 ఒక పండగ రోజు అని ముఖ్యమంత్రి అన్నారు. విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇది అరుదైన అవకాశం.. ఇటువంటి అరుదైన అవకాశం అందరికీ రాదని, ఈ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం తనకు దక్కిందని ముఖ్యమంత్రి అన్నారు.
కాగా, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరుకాలేకపోయారన్నారు. ప్రస్తుతం విక్రమార్క కేరళలో పర్యటనలో ఉన్నారన్నారు. అలాగే కొంతమంది మంత్రులు కూడా ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన రాజీవ్ గాంధీ విగ్రహం లేక పోవడం లోటుగా భావించమని, మేధావుల సూచనల మేరకు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి నిర్ణయించుకున్నామన్నారు. కొంతమంది తమ కోసం సెక్రటేరియట్ ముందు స్థలం ఏర్పాటు పెట్టుకున్నారని విమర్శించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేకే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు