ముడా కేసులో సీఎం సిద్దరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతి
దానిని నిరసిస్తూ యడియూరప్ప ఇంటి ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు
అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు
మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ అనుమతివ్వడం రాజకీయంగా దుమారం రేపుతోంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తాజాగా కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. షిమోగా జిల్లాలోని షికారిపురాలో ఉన్న యడ్డీ ఇంటికి భారీ సంఖ్యలో చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు యడియూరప్ప, ఆయన కుమారుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజేయంద్రకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఇంటి ముట్టడికి యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు యడియూరప్ప ఇంటికి దారితీసే రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని అడ్డుకున్నారు. ఆపై అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వదిలిపెట్టారు. కేపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ నాగేంద్రగౌడ మాట్లాడుతూ గవర్నర్ నిర్ణయాన్ని ఖండించారు. యడియూరప్ప అంత పెద్ద ఎత్తున ఆస్తులు ఎలా సంపాదించారో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆయన కనుక షికారిపుర వస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనను ఘెరావ్ చేస్తారని హెచ్చరించారు.