నగరపాలక కమిషనర్ ఎంఎం నాయుడు
విశాలాంధ్ర – విజయనగరం టౌన్ : నగరంలో సెప్టెంబర్ నుండి సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధానికి నిర్ణయించడం అయినదని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం ఎం నాయుడు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్లాస్టిక్ విక్రయదారులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ప్లాస్టిక్ డిస్ట్రిబ్యూటర్స్,హోల్సేల్ మరియు రిటైల్ వర్తకులతో సమావేశమై నగరంలో తక్షణం సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధానికి నిర్ణయించడమైనదని తెలిపారు. అయితే ఇప్పటికే తమ వద్ద ఉన్న ప్లాస్టిక్ సరుకులు అమ్ముడు అయ్యేంతవరకు కొంత సమయం కావాలని వర్తకులు కోరారు. ఇందుకోసం 15 రోజులు గడువు విధిస్తున్నట్లు కమిషనర్ వెల్లడించారు. అనంతరం సెప్టెంబర్ 5 నుండి నగరంలో నిషేదిత ప్లాస్టిక్ విక్రయాలు, వినియోగాలు జరగకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ విక్రయాలు సాగించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వర్తకులను ఉద్దేశించి కమిషనర్ ఎం ఎం నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 2722, జి 2627 చూపిన విధంగా 120 మైక్రాన్ల మందం కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ వినియోగం మరియు సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిస్తున్నట్లుగా ప్రకటించడమైనదని అన్నారు. ఇందు నిమిత్తం ప్లాస్టిక్ విక్రయదారులందరూ మద్దతు తెలియజేస్తూ ప్లాస్టిక్ నిషేధానికి సహకారం అందించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని అందువల్ల ప్లాస్టిక్ నిషేధం అనే మహా యజ్ఞంలో ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు సహాయ సహకారాలు అందివ్వాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అపరాధ రుసుమును వసూలు చేయుట, షాపులను జప్తు చేయుట వంటి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.