విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : సత్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (సీతం) మరియు ఎం.ఎస్.హెచ్ అకాడమీ ఇన్ రీసెర్చ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి. రామమూర్తి మాట్లాడుతూ, సీతం కళాశాలలో అధ్యాపకుల కోసం సదస్సు నిర్వహించడం, సదస్సు అమలు చెయ్యడానికి అవసరమైన బాధ్యతలను వివరించడం, అధ్యాపకుల కోసం ఆధునిక సాంకేతికతలపై దృష్టి సారించేలా బోధన అవలంభించడం ఈ అవగాహన ఒప్పందం యొక్క ప్రధాన లక్ష్యం అని తెలియచేశారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశి భూషణ రావు మాట్లాడుతూ అవగాహన ఒప్పందం ద్వారా అధ్యాపకుల పరిశోధన నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని, తద్వారా విద్యార్థులు పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలలో కూడా పాలుపంచుకోవచ్చని తెలియచేశారు. డైరెక్టర్ డాక్టర్ ఎం.శశి భూషణ రావు సమక్షంలో సీతం ప్రిన్సిపాల్ మరియు ఎం.ఎస్.హెచ్ అకాడమీ ఇన్ రీసెర్చ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ టి.రాజ సంతోష్ కుమార్ అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో సీతం కళాశాల వైస్ ప్రిన్సిపాల్ (అడ్మిన్ ) డాక్టర్ టి.డి.వి.ఎ నాయుడు, ఆర్.అండ్.డి డీన్ డాక్టర్ వై. నరేంద్ర మరియు అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు.