విశాలాంధ్ర – విజయనగరం టౌన్ : ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానానికి చెందిన నూతన ప్రచార రథాన్ని మంగళవారం అమ్మవారి ఆలయం వద్ద విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు ప్రారంభించారు. ముందుగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గజపతి రాజు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ విశిష్టత ను తెలుపుతూ ప్రచారం చేసేందుకు నూతన రధాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు.ఉత్తరాంధ్ర జిల్లాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు హాజరయ్యే పైడితల్లి అమ్మవారి పండుగను 2017లో తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించినట్లు చెప్పారు.అదేవిధంగా విజయనగరం ఉత్సవాలను కూడా ప్రభుత్వం నిర్వహించుటకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.అనంతరం అమ్మవారి ఆలయం అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.