విశాలాంధ్ర – విజయనగరం అర్బన్ : విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, పర్మినెంట్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, లేని ఎడల ఈ నెల 10 తేది నుండి సమ్మె లోకి వెళ్తామని ఏఐటీయూసీ నేతలు ఎస్. రంగరాజు, జలగడుగుల కామేశ్ లు హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం నాడు విజయనగరం నగర పాలక సంస్థ ఆరోగ్యశాఖ అధికారి కొండపల్లి సాంబమూర్తికి రంగరాజు, కామేశ్ ల ఆధ్వర్యంలో సమ్మె నోటీసులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పర్మినెంట్ కార్మికులకు మూడు సంవత్సరాల సరెండర్ లీవ్ సొమ్మును తక్షణమే విడుదల చేయాలని, బెట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్‌లో ఉన్న 2 హెల్త్ అలవెన్స్ లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే చనిపోయిన కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల స్థానంలో వారి పిల్లలకు ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని, పారిశుద్ధ్య కార్మికులు పదవీ విరమణ పొందితే రూ.75 వేలు, చనిపోయిన వారికి రూ.2 లక్షలు ఎక్స్ గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించినందున ఆయా కార్మికులకు వెంటనే అందే విధంగా చూడాలని కోరారు. విజయనగరం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న 11 మంది నూపర్వైజర్లకు జీవో అమలు చేసినప్పటి నుండి వారికి రూ.18,500 జీతాన్ని మంజూరు చేస్తూ ఏరియర్ కూడా ఇవ్వాలని కోరారు. ప్రతి సచివాలయంలో 15 మంది కార్మికులు పనిచేసే విధంగా ఉండాలని, అయితే నాలుగు నుండి ఆరుగురు కార్మికుల వరకే ఉన్నారని, కార్మికులపై చాలా పని భారం పెరుగుతున్నందున కార్మికుల సంఖ్యను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాము ఈ డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసును నేడు ఎంహెచ్ఓకు అందజేశామని. ఈనెల 10 తేదీలోగా ఈ డిమాండ్లన్నింటిని పరిష్కరించాలని, లేని ఎడల సమ్మెలోకి వెళ్తామని, తరువాత జరిగే పరిణామాలకు అధికారులే బాధ్యత వహించాలని రంగరాజు, కామేశ్ లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కె. శ్రీను, టి. శ్రీను, డి. రాజులతో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు