విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : విశ్వభాషలందు వెలుగు తెలుగు అని తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ పేర్కొన్నారు. అమ్మఒడే తొలి బడిగా భావించాలని, మాతృమూర్తిని ,మాతృభాషను గౌరవించడం ప్రతిఒక్కరి బాధ్యత అని అన్నారు. తెలుగువారమనే ముద్ర భాష కారణంగానే వస్తుందని, ప్రపంచంలో తెలుగు ప్రతిభకు జై కొట్టని దేశం లేదని, తెలుగువారు రాణించని రంగమే లేదని అన్నారు. ఈ నెల 29న తెలుగుభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు తెలుగుభాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురజాడ విద్యాసంస్థలయందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ గజల్స్ గాయకుడు వినోద్ చే తెలుగు భాష పరిరక్షణకు సంబంధించిన గజల్స్ పాడించారు. మాతృభాష గొప్పతనంతో పాటు మాతృమూర్తి గొప్పతనంపై గజల్స్ వినోద్ తన గానం ద్వారా విద్యార్ధులలో స్ఫూర్తిని నింపారు. ఈ సందర్భంగా విద్యార్ధులు సైతం వినోద్‌తో తమ గళం కలిపారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శేఖర్‌తో కలిసి గజల్స్ వినోద్‌ను గురుప్రసాద్ సత్కరించారు.