విశాలాంధ్ర- ఏలూరు: పేద ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న దెందులూరు తాసిల్దారుపై వెంటనే చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు విమర్శించారు. శనివారం స్థానిక అన్నే భవనంలో పత్రిక విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దోసపాడు గ్రామంలో 144 145 సెక్షన్ పెట్టి పేదలను దళితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. జాయింట్ కలెక్టర్ కోర్టులో ఉన్న 72 ఎకరాలు మినహాయించి మిగిలి ఉన్న అసైన్డ్, సీలింగ్ 150 ఎకరాల భూమిని వెంటనే పేదలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పట్టాదారుల పేర్లు, వారి వారసుల పేర్లు ఇచ్చిన ఇవ్వలేదని మరలా ఇవ్వాలని దెందులూరు తాసిల్దార్ మాట మార్చడం సిగ్గుచేటన్నారు. తాసిల్దార్, ఎస్ ఐ, సీఐ పేదల పక్షాన లేక భూస్వాముల పక్షాన ఉంటారో తేల్చుకోవాలని కోరారు. చట్టాలను అమలు చేసే అధికారులనే దెందులూరు మండలానికి కేటాయించాలని జిల్లా ఉన్నత అధికారులకు విజ్ఞప్తి చేశారు. అసైన్డ్ యాక్ట్ ప్రకారం వ్యవసాయ భూముల్లో చెపలు, రొయ్యలు చెరువులు తవ్వకూడదని ఉన్న, అసైన్డ్ సెక్షన్ 24 ప్రకారం చట్ట విరుద్ధంగా వ్యవహరించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దోసపాడులో మాటిమాటికి ఎందుకు 144, 145 సెక్షన్లు విధించి పేదలను దళితులను భయభ్రాంతులకు గురిచేసి ఎందుకు బెదిరిస్తున్నారు. సెక్షన్ 145 ప్రకారం భూముల్లో ఉన్న పంటను నేటికీ ఎందుకు స్వాధీనం చేసుకోలేదని, సెక్షన్ 20 ని ఎందుకు అమలు చేయడం లేదన్నారు. ఈ సెక్షన్ ప్రకారం ఎలాంటి అనుమతులు లేకుండా చెపలు, రొయ్యల చెరువులు తవ్వకూడదు, కానీ తవ్విన వారిపై చట్ట ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదుని ఏద్దేవా చేశారు. ప్రభుత్వ విధులను దుర్వినియోగం చేస్తున్న దెందులూరు తాసిల్దార్, ఎస్ ఐ, సిఐ ల పై ఉన్నత స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక భూస్వాములు ఉషా బాలకృష్ణారావు, గుడిపాటి సురేష్ కాళ్లకు మడుగులు ఒత్తుతూ పేదలకు దళితులకు తాసిల్దార్, ఎస్సై అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. వీరు స్థానిక భూస్వాముల మాటలు విని పేదల పట్ల వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు, పేదలపై ఎందుకు ఇంత వివక్షత, దళితులపై పోలీసులను ఎందుకు ఉసుకోలుపుతున్నారని మండిపడ్డారు. దెందులూరు ఎస్సై ఆటో రవాణా కార్మికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దెందులూరు తాసిల్దార్ ఎస్ ఐ సీఐలు ఇలాగే వ్యవహరిస్తే రాబోయే కాలంలో దోసపాడులో జరిగే పరిణామాలకు వీళ్ళే బాయత వహించాల్సి వస్తుందని దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అనంతరం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడుతూ దోసపాడు గ్రామంలో 144,145 సెక్షన్ పెట్టి పోలీసు బలగాలు పెట్టడం వల్ల ఏంటి ప్రయోజనం అని ప్రశ్నించారు. చేపల చెరువుల వద్ద ఉన్న భూస్వాముల ఏజెంట్లను, బినామీలను వెంటనే అక్కడి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. భూస్వాములకు అనుకూలంగా, అండగా తాసిల్దారు ఎస్ఐ అనుసరిస్తున్నారని మండిపడ్డారు. పేదల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ భూస్వాములు ఇచ్చే లంచాల మింగి దళితులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి అధికారులపై జిల్లా ఉన్నత స్థాయి అధికారులు పర్యవేక్షణ చేసి కఠినమైయినా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు సిహెచ్ భూషణం, జి.తేరేజమ్మ, సిహెచ్ ఏసుమణి, సిహెచ్ దేవ కృప, లలిత తదితరులు పాల్గొన్నారు.