విశాలాంధ్ర- తాడేపల్లిగూడెం రూరల్ : అల్పపీడనం ప్రభావంతో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మాధవరం వద్ద సోమవారం ఎర్రకాలువ ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో మాధవరం, కంసాలి పాలెం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి భారీ వర్షాలతోపాటు కొంగువారి గూడెం ప్రాజెక్టు నుండి అదనపు నీరు విడుదల చేయడం వలన, పులివాగు, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం కొండ ప్రాంతాల నుంచి వస్తున్న వాగులు ఎర్రకాలువలో కలవడంతో నీటి ఉదృతి పెరిగింది. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది గత జూలై నెలలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో నందమూరు, మారంపల్లి, మాధవరం, వెంకట్రావుపాలెం, జగన్నాధపురం, అరుళ్ళ తదితర గ్రామాల్లో వేలాది ఎకరాలు నీటమునిగి వరిపంట పూర్తిగా నష్టపోయింది. అనంతరం రైతులు వేలాది రూపాయలు వెచ్చించి జిల్లాలోని నలుమూలల నుంచి వరి నారును సేకరించి మరలా నాట్లు వేశారు. రైతులు కోలుకొంటన్న సమయంలో ఎర్రకాలువ ఉదృతి పెరగడంతో ప్రమాదం పొంచివుందని రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రైతులు సుమారు ఎకరాకు 15 వేల రూపాయల వెచ్చింది సాగుచేశార. మరలా ఎర్రకాలువ ఉధృతి పెరిగి వరినాట్లు ముంపునకు గురైతే తామంతా రోడ్డున పడక తప్పదని నందమూరు, మారంపల్లి, జగన్నాధపురం, మాధవరం, అప్పారావుపేట తదితర గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మండల తహశీల్దార్ సునీల్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటికే నందమూరు అక్విడేట్ వద్ద ఎర్రకాలువ ఉధృతి పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశామన్నారు. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.