Thursday, December 12, 2024
Homeఅదానీ ముడుపులపై దద్దిరిల్లిన పార్లమెంటు

అదానీ ముడుపులపై దద్దిరిల్లిన పార్లమెంటు

చర్చకు మోదీ సర్కారు వెనుకంజ

. వాయిదా తీర్మానాల తిరస్కరణ
. ప్రతిపక్ష ఎంపీల నినాదాల హోరు
. నిమిషాల వ్యవధిలోనే ఉభయసభల వాయిదా

న్యూదిల్లీ : ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీపై అమెరికాలో నమోదైన కేసు, మణిపూర్‌లో మరోసారి చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై చర్చించేందుకు మోదీ సర్కారు భయపడుతోంది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల తొలిరోజునే అది స్పష్టమైంది. రెండు సభల్లోనూ ఈ అంశాలపై ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చకు సభాపతులు అనుమతించలేదు. ఇండియా ఐక్యసంఘటన ఎంపీల నినాదాల నడుమ బుధవారానికి ఉభయ సభలు వాయిదాపడ్డాయి. సోమవారం ఉదయం లోక్‌సభ, రాజ్యసభల్లో కార్యక్రమాలు మొదలయ్యాయి. ఊహించినట్లుగానే అదానీ అంశం, మణిపూర్‌ హింస ఉభయసభలను కుదిపేశాయి. ఉభయ సభలు ప్రారంభమవగానే ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నినాదాలు మొదలుపెట్టారు. దీంతో నిమిషాల వ్యవధిలోనే మధ్యాహ్నం 12 గంటలకు సభలు వాయిదా పడ్డాయి. లోక్‌సభలో తొలుత ఇటీవల కాలంలో మృతి చెందిన సభ్యులకు సంతాపం తెలిపారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ ఎంపీలు కేసీ వేణుగోపాల్‌, మనీశ్‌ తివారీ, మాణిక్కం ఠాగూర్‌- అదానీ గ్రూప్‌ అక్రమాలకు పాల్పడ్డారనే అంశంపై చర్చించాలని, దీనిపై జేపీసీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ వాయిదా తీర్మానం ఇచ్చారు. చర్చకు ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టగా… స్పీకర్‌ ఓం బిర్లా వాటిని తిరస్కరిస్తూ… సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా నినాదాలు కొనసాగడంతో ఒక రోజంతా వాయిపడ్డాయి. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అదానీపై అమెరికా చేసిన ఆరోపణలపై చర్చకు ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టారు. దీంతో సభ తొలుత 15 నిమిషాలు వాయిదా పడిరది. మళ్లీ ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రతిపక్ష సభ్యుల నిరసన నడుమ బుధవారానికి వాయిదా పడిరది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళవారం లోక్‌సభ, రాజ్యసభ నిర్వహించకపోవడంతో తిరిగి బుధవారం ఉభయసభలు సమావేశం కానున్నాయి. తొలుత పార్లమెంటులో ఏయే అంశాలు చర్చించాలన్నదానిపై కాంగ్రెస్‌ పార్టీ తన ఎంపీలకు సూచనలు చేసింది. ఉదయం పదిన్నర గంటలకు పార్లమెంటరీ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్‌ ఎంపీలందరూ సమావేశమయ్యారు. లోక్‌సభ ఎంపీలు కేసీ వేణుగోపాల్‌, మనీశ్‌ తివారీ, మాణిక్కం ఠాగూర్‌లు అదానీ గ్రూప్‌ అక్రమాల అంశంపై చర్చించాలని, జేపీసీతో విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. భారత వ్యాపార రంగంపై అదానీ ప్రభావం, ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ ప్రక్రియల పటిష్టతపై చర్చ జరగాలని డిమాండ్‌ చేశారు. మోదీ ప్రభుత్వ మౌనం వల్ల దేశ సమగ్రత, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందనీ, జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో పార్లమెంట్‌ ముందుకు మొత్తం 16 బిల్లులు రానున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు