హైదరాబాద్: అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (ఏఐఎంఎస్‌ఆర్) ఆధ్వర్యంలో ‘వైట్ కోట్’ వేడుక నగరంలోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్న రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో 2026 బ్యాచ్‌కు చెందిన 152 మంది ప్రథమ సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులకు వైట్ కోట్స్ అందజేశారు. రోగుల సంరక్షణ, వైద్య నైతికతకు కట్టుబడి ఉంటామని విద్యార్థులతో హిప్పోక్రటిక్ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన అపోలో హాస్పిటల్స్ తెలంగాణ రీజియన్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ కే సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైట్ కోట్ వేడుక అనేది సైన్స్, మానవత్వం కలిసే ఒక ఉన్నతమైన వృత్తికి నాంది పలుకుతుందన్నారు. వైద్య రంగం కేవలం పరిజ్ఞానం, క్లినికల్ నైపుణ్యాన్ని మాత్రమే కాకుండా కరుణ, సానుభూతి, వినమ్రత, జవాబుదారీతనాన్ని కూడా కోరుకుంటుందన్నారు. వైద్య వృత్తిలో సుదీర్ఘ పని వేళలు, కుటుంబ వేడుకలను వదులుకోవడం వంటి ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుందన్నారు.


