Homeసాహిత్యంఅభ్యుదయ సాహిత్యోద్యమ సారథి ప్రేమ్చంద్

అభ్యుదయ సాహిత్యోద్యమ సారథి ప్రేమ్చంద్

- Advertisement -

డా. వెన్నా వల్లభరావు
చరవాణి : 94903 37978

ఆధునిక భారతీయ సాహిత్యంలోని అగ్రశ్రేణి రచయితలలో ప్రేమ్చంద్ ఒకరు. హిందీ సాహిత్యంలో ఆయన ధ్రువతార వంటివాడు. కేవలం హిందీ సాహిత్యంలోనే కాక సమస్త భారతీయ సాహిత్యంలో ఆయన ప్రసిద్ధ రచయిత. విశ్వ సాహిత్యంలో భారతీయ సాహిత్యానికి గౌరవాన్ని పెంచిన మేటి నవలాకారుడు, కథారచయిత. హిందీలో ‘నవలా సమ్రాట్’ గా కీర్తించిన శ్రేష్ఠ రచయిత. ప్రేమ్చంద్ రచనలు 20వ శతాబ్దపు ప్రారంభంలో భారతీయ సాహిత్యాన్ని గణనీయంగా ప్రభావితం చేశాయి.
ప్రేమ్చంద్ అసలు పేరు ధనపతరాయ్. ఆయన 1880, జూలై 31వ తేదీన ఉత్తర్ ప్రదేశ్‌లో కాశీకి నాలుగు మైళ్ల దూరంలో ఉన్న లామహీ అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి మున్షీ అజాయబ్ లాల్. ఆయన పోస్టాఫీస్‌లో గుమాస్తా. ఆర్థిక ఇబ్బందుల్లో వారి కుటుంబం సతమతం అవుతూ ఉండేది. ప్రేమ్చంద్‌కి ఎనిమిదేళ్ల వయసప్పుడే తల్లి ఆనంది మరణించింది. సవతి తల్లి పెంపకంలో అనేక ఇబ్బందులు పడ్డాడు. మాతృప్రేమకు నోచుకోలేదన్న బాధ ఆయన్ని జీవితాంతం వెంటాడింది. విద్యార్థిగా ఉన్నప్పుడే కుటుంబానికి ఆర్థికంగా సాయపడటానికి 4 మైళ్లు నడిచి వెళ్లి ఒక విద్యార్థికి పాఠాలు చెప్పేవాడు. ప్రేమ్చంద్ 15వ ఏట అయన ప్రమేయం లేకుండానే కుమారుని వివాహం జరిపించాడు తండ్రి. భార్యతో ఆయనకు సఖ్యత కుదరలేదు. దానితో ఆమె శాశ్వతంగా పుట్టింటిలోనే ఉండిపోయింది. బి.ఏ. చదివి వకీల్ అవుదామనుకున్న ప్రేమ్చంద్, ఆర్థిక ఇబ్బందుల కారణంగా మెట్రిక్‌ పాసవ్వగానే 1898లో ఉపాధ్యాయునిగా ఉద్యోగం ప్రారంభించాడు. పిదప పాఠశాలల డిప్యూటి ఇన్‌స్పెక్టర్ అయ్యి జీవనయానం సాగించాడు. 1906 లో శివరాణీ దేవి అనే బాల వితంతువును ద్వితీయ వివాహం చేసుకుని ఆదర్శాన్ని ఆచరణలో చూపాడు. సాహిత్య సేద్యంలోను, కుటుంబ నిర్వహణలోను ఆమె భర్తకు ఎంతో అనుకూలవతిగా, ప్రోత్సహకారిగా ఉండేది.
స్వతహాగా ప్రేమ్చంద్‌కు పఠనాసక్తి, సాహిత్యాభిలాష ఎక్కువ. చిన్నప్పుడు నాయనమ్మ చెప్పిన కథలు ఆయనకు కథలంటే అమిత ఆసక్తిని కలిగించాయి. తరువాత రవీంద్రనాథ్ టాగూర్ కథల ప్రభావం ప్రేమ్చంద్ పై గాఢంగా పడింది. వాటిని ఉర్దూలోకి అనువదించి ‘జమానా’ అనే పత్రికలో ప్రచురించాడు. దేశ, విదేశాల రచనల్ని, ప్రఖ్యాత రచయితల నవలల అనువాదాల్ని విస్తృతంగా చదివి, స్వీయ రచనా వ్యాసంగాన్ని ఆరంభించాడు. 1901లో ప్రేమ్చంద్ ‘అస్ రారేమ అబిద్’(దేవస్థాన రహస్యం) అనే తొలి నవలను ఉర్దూలో రాశాడు.
ప్రేమ్చంద్ తొలితొలుత ‘నవాబ్ రాయ్’ పేరుతో ఉర్దూలో రచనలు ఆరంభించాడు. అయన రాసిన మొట్టమొదటి కథ “దునియాకా సబ్ సే అన్మోల్ రతన్”-అంటే ప్రపంచంలోకెల్లా విలువైన రత్నం. ఆ రత్నం దేశం కోసం ప్రాణాలర్పించే వీరుని నెత్తుటి బొట్టు అని తీర్మానిస్తాడు రచయిత. ఈ కథ1907 లో కాన్పూర్ నుంచి వెలువడిన ‘జమానా’ అనే పత్రికలో ప్రచురితమైంది. 5 కథల్ని 1909లో ‘సోజేవతన్’ అనే పేరుతో సంపుటిగా వెలువరించాడు. ఈ కథల్లో దేశభక్తి భావాలు మెండుగా ఉండటంతో ఆంగ్లేయ ప్రభుత్వం ఆ పుస్తక ప్రతుల్ని కాల్చివేసి, ఆ సంపుటిని నిషేధించింది. ఈ నవాబ్రాయ్ ఎవరు అని ప్రభుత్వం ఆరా తియ్యసాగింది. అప్పటికే ఉర్దూలో మంచి పేరు సంపాదించిన ఆయన ఉర్దూని వీడి, ఇకపై ‘ప్రేమ్చంద్’ అనే పేరుతో హిందీలో సాహిత్య వ్యాసంగం సాగించాలని నిర్ణయించుకున్నాడు.
ప్రేమ్చంద్ ఉర్దూను విడిచిపెట్టి హిందీలో రాయటానికి పూనుకోవటంలో ఆయనకున్న ఆత్మవిశ్వాసం, దూరదృష్టి తేటతెల్లమౌతాయి. హిందీయే భవిష్యత్తులో దేశవ్యాప్తమైన భాష అవుతుందని, ఆ భాషలో రాస్తేనే తన రచనలు ఎక్కువమంది పాఠకుల్ని చేరతాయని గ్రహించి అందుకు నడుం కట్టాడు.
ప్రేమ్చంద్ హిందీ సాహిత్యంలో అడుగుపెట్టే సమయానికి గారడీ, ఇంద్రజాల మహేంద్రజాల విద్యలతోను, భూతప్రేతాలు, మాంత్రికులు, అందమైన రాజకుమారి, ఆమెను దక్కించుకోవడానికి దుష్టులు పన్నే పన్నాగాలు, వాళ్లని ఎదుర్కొని, రాజకుమారిని పెళ్లాడేందుకు ఒక సాహసికుడైన రాజకుమారుడు- వెరసి నవలా సాహిత్యం అంతా కల్పనా జనితమైన ప్రపంచం చుట్టూనే తిరిగేది. కథలు కూడా అపరాధ పరిశోధన, చవకబారు శృంగార సన్నివేశాలతో నిండి ఉండేవి. వాస్తవ సమాజాన్ని పాఠకుల ముందుంచే ప్రయత్నం అప్పటికి హిందీ నవల, కథాసాహిత్యంలో జరగలేదు. ఈ ధోరణికి ప్రేమ్చంద్ అడ్డుకట్ట వేశాడు. సమాజాన్ని ప్రతిబింబింప జెయ్యాలనే కట్టుబాటును తన నవలలు, కథల ద్వారా తీసుకువచ్చాడు.
ప్రేమ్చంద్ ఆగమనం ఆధునిక హిందీ సాహిత్యంలో నవ శకానికి నాంది పలికింది. మధ్యతరగతి, వెనుకబడిన ప్రజల దుర్భర జీవన స్థితిగతులను, వారి సమస్యలను వాస్తవిక దృక్పథంతో చిత్రించిన ఘనత ప్రేమ్చంద్‌కు దక్కుతుంది. కార్మిక, కర్షక వర్గాల ఆర్థిక దుస్థితిని చూసి కలత చెందిన ప్రేమ్చంద్ తన రచనల్లో ఆర్థిక అసమానతల్ని రుపుమాపాల్సిన అవసరాన్ని చాటిచెప్పాడు. ఆయన కలం సమాజాన్ని అద్దంలో పట్టి చూపింది. ప్రజల మనసులో నైతిక చైతన్యాన్ని తట్టిలేపింది. మట్టి వాసనలను గుబాళింపజేసింది. మహిళల హక్కులు, సాధికారత కోసం గొంతెత్తటంలో ప్రేమ్చంద్ తన కాలం కంటే ఎంతో ముందున్నాడు. ప్రేమ్చంద్ పై గాంధీజీతో పాటు టాల్ స్టాయ్ ప్రభావం తారసపడుతుంది. గాంధీజీ పిలుపు మేరకు ప్రేమ్చంద్ 1921లో ప్రభుత్వోద్యోగానికి రాజీనామా చేసి రచనలనే జీవనాధారంగా చేసుకున్నాడు.
ప్రేమ్చంద్ హిందీలో యథారœవాద సాహిత్యానికి ఆద్యుడు. అయన చూపిన వాస్తవికతలో సామాజిక చింతన, తాత్విక మైన లోతు, మనిషి గుండె తడి ఉన్నాయి. అయన 13 నవలలు రాశాడు. దాదాపు 300కథలు రాశాడు. అనేక నాటకాలు, వ్యాసాలు, సంపాదకీయాలు రాశాడు. పెక్‌కు అనువాదాలు కూడా చేశాడు. ‘నవలా సమ్రాట్’ ప్రేమ్చంద్ సేవాసదన్, ప్రేమాశ్రం, రంగ భూమి, నిర్మలా, కాయాకల్Î, ప్రతిజ్ఞా, గబన్, కర్మ భూమి, మనోరమా, గోదాన్ మొదలైననవలలు రచించాడు. చివరినవల మంగల్సూత్ర్ అసంపూర్ణ నవల.
ప్రేమ్చంద్ నవలలు భారతీయ గ్రామీణ జీవనానికి దర్పణంగా నిలిచాయి. సంఘంలో పాతుకుపోయిన వేశ్యావృత్తిని నిరసిస్తూ, ‘సేవాసదన్’ నవల రాశాడు. కర్షక, కార్మిక వర్గాలపై జరుగుతున్న దోపిడీని వ్యతిరేకిస్తూ ‘ప్రేమాశ్రమ్’ రాశాడు. మహాత్మా గాంధీజీచే ప్రభావితుడై ‘రంగభూమి’లో పారిశ్రామీకరణ కారణంగా దెబ్బతింటున్న మానవ సంబంధాలను చిత్రించాడు. ‘నిర్మలా’ నవలలో వయోభేదంతో జరిగే వివాహాల్‌లోని సమస్యలను చూపించాడు. ‘కాయాకల్Î’, ‘గబన్’, కర్మభూమి’ వంటి నవలల్లో గ్రామీణ, పట్టణ ప్రజల స్థితిగతులను, సమస్యలను కళ్లకు కట్టినట్టు చిత్రించాడు. కర్షక జీవితంలోని దైన్యాన్ని, రైతుల ఆత్మవేదనను అక్షరబద్ధం చేసిన గొప్ప నవల ‘గోదాన్’. ఇందులోని ప్రధాన పాత్ర హోరీ సన్నకారు రైతుల ప్రతినిధి. అప్పులబాధ, వెనుకబాటుదనం, నైతిక సంఘర్షణ, పెట్టుబడిదారి వర్గాల చేతుల్లో నలిగిపోయే రైతులకు ప్రతిరూపం.
ప్రేమ్చంద్ రాసిన ప్రతి కథ ఒక ఆణిముత్యం. పల్లెపట్టుల జీవిత విధానం అంతా ఆయన కథల్లో కనిపిస్తుంది. బడే ఘర్ కీ బేటీ, పూస కీ రాత్, కఫన్, పంచ పరమేశ్వర్, సవా సేర్ గేహూ, బడే భాయీ సాహబ్‌, ఈద్ గాహ్, బలిదాన్, శతరంజ్ కే ఖిలాడీ, ఈశ్వరీయ్ న్యాయ్, ఠాకుర్ కా కువా మొదలైనవి విశేష ప్రాచుర్యం పొందిన కథలు. ప్రేమ్చంద్ కేవలం సమస్యలను చిత్రించటమే కాదు, ఆ సమస్యల పరిష్కార మార్గాల వైపు కూడా సాహిత్యాన్ని నడిపించారు. ‘హంస్’, ‘జాగరణ్’ అనే పత్రికలు నెలకొల్పి హిందీ సాహిత్యానికి దారిచూపే దిక్సూచి లాంటి కథలను, సామాజిక స్పృహ గల రచనలను ప్రచురించాడు. ఆయన రాసిన ఎన్నో కథలు నాటకాలుగా, సినిమాలుగా రూపొందించారు. మరికొన్ని దూరదర్శన్లో టెలీఫిల్ములుగా ప్రసారం అయ్యాయి.
ప్రేమ్చంద్ రచనలు భారతీయ భాషలన్నింటిలోనే కాక రష్యన్, స్పానిష్, పోలిష్, చైనీస్, కొరియన్, పోర్చుగీసు, జర్మన్, ఫ్రెంచి, ఇంగ్లీష్ వంటి విదేశీభాషలలోకి అనువాదాలుగా వెళ్లాయి. ప్రేమ్చంద్‌ని విమర్శకులు ఆదర్శోన్ముఖ యథారœవాద రచయిత అని నిర్ధారించారు. ప్రేమ్చంద్ మాత్రం తనను తాను మానవతావాదినని చెప్పుకున్నాడు.
ఇక భాషాశైలి విషయానికి వస్తే ప్రేమ్చంద్ చాలా సహజమైన, వాడుక హిందీ భాషను ఉపయోగించాడు. ఆయన వాక్యాల్లో గ్రామీణ సుగంధం, నిష్కళంకమైన అభిప్రాయాలు, దేశీయ పదజాలం నిండి ఉంటాయి. ఈ భాషే ఆయన విజయ రహస్యం. తొలిసారిగా హిందీని విద్యావంతుల భాషగా కాక, ప్రజల భాషగా తీర్చిదిద్దినవాడు ప్రేమ్చందే. సంస్కృత పదభూయిష్ఠమైన పండిత గ్రాంథిక హిందీ శైలికి, పూర్తిగా విదేశీ పదజాలంతో కూడిన ఫారశీ శైలికీ మధ్యేమార్గంగా హిందూస్తానీ పలుకుబడిని ఉపయోగించాడాయన. ఈ హిందుస్తానీనే మహాత్మాగాంధీ ప్రోత్సహించారు.
ప్రేమ్చంద్ తన సాహిత్యాన్ని సామాజిక విప్లవానికి సాధనంగా ఉపయోగించాడు. అయన అసలుసిసలైన అభ్యుదయవాది. సమాజంలో అభ్యుదయ భావాలు విస్తరింపజెయ్యటం కోసం, సాంఘిక దురాచారాలు, వెనుకబాటుతనం, అన్యాయం, పీడన, దోపిడీల నిర్మూలనే ధ్యేయంగా ‘రాష్ట్రీయ్ ప్రగతిశీల్ లేఖక్ సంఘ్’ 1936లో ఏర్పడింది. ఏప్రిల్ 9-10 తేదీల్లో జరిగిన లక్నోలో జరిగిన దాని తొలి సమావేశానికి ప్రేమ్చందే అధ్యక్షత వహించాడు. సాహిత్యాన్ని సమాజాభ్యుదయ పథాన నడిపించవలసిన ఆవశ్యకతను ఆ సభలో వివరించాడు. సంఘం స్థాపనకు సహకరించటమే కాక, తన ఆరోగ్యాన్ని కూడా లక్ష్యపెట్టక ఊరూరాతిరిగి అభ్యుదయ సాహిత్య సృజన దిశగా రచయితలను ప్రోత్సహించాడు. అనారోగ్యం కారణంగా 1936, అక్టోబర్ 8వ తేదిన కేవలం 56 సం.ల వయసులోనే కన్నుమూశాడు. ఆయన ఇంకా కొన్ని దశాబ్దాలు జీవించి ఉంటే హిందీలో ఎంతో అభ్యుదయ సాహిత్యం ఆయన కలం ద్వారా వెలువడి ఉండేది. ప్రేమ్చంద్ వ్యక్తిత్వం ఎంతో ఉన్నతమైనది. అయన జీవితం చాలా సరళము, నిరాడంబరమైనది. నమ్రత, నిరహంకారం, కలుపుగోలుతనం అయన స్వభావంలో పెనవేసుకుని ఉండేవి. నవ్వు అరమరికలు లేకుండా ఉండేది. మాట తీరు సామాన్య రైతును తలపించేది.
హిందీసాహిత్యంలో శిఖరసమానుడు ప్రేమ్చంద్. హిందీ సాహిత్యం, ముఖ్యంగా హిందీ నవల-కథా సాహిత్యం తీసుకుంటే గనక “ప్రేమ్చంద్‌కి ముందు- ప్రేమ్చంద్ తరవాత’ ’అన్నంతగా ప్రభావితం చేసిన యుగకర్త ప్రేమ్చంద్. హిందీ సాహిత్యంలో ప్రేమ్చంద్ కీర్తి అజరామరంగా నిలిచి ఉంటుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు