ఎన్నికల నీడలో కరువు సంక్షోభం ప్రభుత్వానికి కానరావడం లేదు. ఆకలి కేకలపై రాజకీయ ‘కోడ్’ బూచి వికటాట్టహాసం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు తాండవిస్తున్న వేళ, బాధ్యతాయుతమైన పాలన అందించాల్సిన ప్రభుత్వం కరువు నివారణ చర్యలను పక్కనబెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండటంతో అధికార యంత్రాంగం, పాలక పక్షాల దృష్టి మొత్తం రాజకీయ వ్యూహాలు, మున్సిపోల్స్ విజయోత్సవాలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ప్రచారాల వైపు మళ్ళి, కరువుతో అలమటిస్తున్న రైతాంగం, గ్రామీణ ప్రజల అరిగోస తీవ్ర నిర్లక్షాయూనికి గురవుతోంది. ప్రపంచ, భారతీయ వాతావరణ శాఖలు, శాస్త్రవేత్తలు ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే తీవ్రమైన ‘సూపర్ ఎల్నినో’ ప్రభావం ఉండబోతోందని స్పష్టమైన హెచ్చరికలు చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు సన్నద్ధత వహించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఎల్నినో ముప్పుపై ముందు నుంచీ కాలయాపన చేసిన ప్రభుత్వం, ఇప్పుడు స్థానిక ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (ఎన్నికల కోడ్) ఒక సాకుగా చూపి కరువు సహాయ చర్యల బాధ్యత నుండి తప్పుకోవాలని చూడటం శోచనీయం. పైగా రెండు తుపాన్లు (అర్నాబ్, మురసు) కొట్టిన దెబ్బతో కరవుకు అతివృష్టి తోడై జనం బతుకు కకావికలమైంది.
ఖరీఫ్ ఆరంభం నుండి సెప్టెంబర్ మూడో వారం వరకు రాష్ట్రంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత సెప్టెంబర్ నెలాఖరులో ఏర్పడిన వాయుగుండం కారణంగా కొన్ని ప్రాంతాల్లో కురిసిన వర్షాలను ఆసరాగా చేసుకొని, నెలల తరబడి దుర్భిక్షంలో మగ్గిన ప్రాంతాలను ప్రభుత్వం కరువు జాబితా నుండి తొలగించడానికి ప్రయత్నించింది. ప్రభుత్వ కరువు మాన్యువల్ నిబంధనల ప్రకారం జూన్, జులై నెలల్లో నమోదైన వర్షపాతం, డ్రైస్పెల్స్ ఆధారంగా ఆగస్టులోనే ముందస్తు కరువును ప్రకటించే అవకాశం ఉంది. కానీ, ప్రభుత్వం సెప్టెంబర్ చివరి వరకు మీనమేషాలు లెక్కిస్తూ, వామపక్షాలు, ప్రతిపక్షాలు, రైతు సంఘాలు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడంతో అక్టోబర్ 1న అరకొరగా కరువు మండలాలను గుర్తించింది. విచిత్రమేమిటంటే, క్షేత్రస్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్లు పంపిన వాస్తవ నివేదికలను ప్రభుత్వం పక్కనపెట్టింది. జూన్ నుండి ఆగస్టు వరకు ప్రభుత్వానికి చెందిన అధికారిక గణాంకాలనే పరిశీలిస్తే, రాష్ట్రంలో ఎంతటి తీవ్ర దుర్భిక్షం నెలకొందో తేటతెల్లమవుతుంది. రాష్ట్రంలోని మొత్తం 688 మండలాల్లో ఏకంగా 641 మండలాలు తీవ్ర వర్షాభావంతో అల్లాడిపోయాయి. ఇందులో 221 మండలాల్లో సాధారణం కంటే 60 నుండి 99 శాతం వరకు అత్యల్ప వర్షపాతం నమోదు కాగా, 420 మండలాల్లో 20 నుండి 59 శాతం వరకు వర్షాభావం ఏర్పడింది. అలాగే పంటలు ఎండిపోవడానికి కారణమయ్యే డ్రైస్పెల్స్ విషయానికొస్తే, రాష్ట్రంలో 623 మండలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇందులో 357 మండలాల్లో సింగిల్ డ్రైస్పెల్, 259 మండలాల్లో డబుల్ డ్రైస్పెల్, 7 మండలాల్లో ట్రిపుల్ డ్రైస్పెల్ నమోదయ్యాయి. ఇంతటి భయానకమైన గణాంకాలు ప్రభుత్వ రికార్డుల్లోనే ఉన్నప్పటికీ, ప్రభుత్వం మాత్రం కేవలం 21 జిల్లాల్లోని 388 మండలాలను (283 తీవ్ర కరువు, 105 మధ్యస్థ కరువు) మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించి ‘మమ’ అనిపించింది. అంటే 641 వర్షాభావ మండలాలు, 623 డ్రైస్పెల్ మండలాలు ఉంటే, అందులో సగం మండలాలకే కరువు ముద్ర వేసి మిగిలిన వాటిని గాలికొదిలేశారు. మరీ ముఖ్యంగా పార్వతీపురం మన్యం (13 వర్షాభావ, 9 డ్రైస్పెల్ మండలాలు), అల్లూరి సీతారామరాజు (10 వర్షాభావ, 8 డ్రైస్పెల్), కోనసీమ (19 వర్షాభావ, 19 డ్రైస్పెల్), పశ్చిమ గోదావరి (20 వర్షాభావ, 20 డ్రైస్పెల్), నెల్లూరు (29 వర్షాభావ, 30 డ్రైస్పెల్), తిరుపతి (27 వర్షాభావ, 23 డ్రైస్పెల్ మండలాలు) వంటి ఏడు జిల్లాల్లో ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించకపోవడం ప్రభుత్వ అశాస్త్రీయ విధానాలకు, నిర్లక్షాయూనికి నిదర్శనం.
రాష్ట్రంలోని నగర, పురపాలికలు, జిల్లా, మండల ప్రజా పరిషత్తులు, గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అక్టోబర్ 14న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఇప్పటివరకు మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాయి. రెండు రోజుల్లో ప్రాదేశిక ఎన్నికలు పూర్తవుతాయి. సర్పంచ్ ఎన్నికలకు ఇంకా సమయముంది. మొత్తంగా ఈ ఎన్నికల ప్రక్రియ డిసెంబర్ 2 వరకు కొనసాగుతుండటంతో అప్పటి వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుంది. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే, ప్రభుత్వం కరువు బాధితులకు చేయాల్సిన సహాయక చర్యలను నిలిపివేసేందుకు ‘కోడ్ బూచి’ని ముందుకు తెస్తోందనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. చట్టపరంగా, నిబంధనల ప్రకారం ఎన్నికల కోడ్ అనేది కరువు, తుపానులు, వరదల వంటి విపత్తుల సమయంలో బాధితులకు అందించే అత్యవసర సహాయ చర్యలకు ఎలాంటి అడ్డంకి కాదని నిపుణులు, ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తాగునీటి ఎద్దడి నివారణ, పశువులకు పశుగ్రాసం సరఫరా, తాగునీటి తొట్టెల ఏర్పాటు, వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పథకం కింద కూలి పనుల కల్పన వంటి నిరంతర సంక్షేమ పనులకు ఎన్నికల కోడ్ వల్ల ఎలాంటి ఆటంకమూ ఉండదు. పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పెంపు, ప్రత్యేక కరువు ప్యాకేజీల ప్రకటన లేదా కొత్తగా కరువు మండలాల గుర్తింపు వంటి ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి ప్రభుత్వం ఎన్నికల సంఘం అనుమతి కోరడానికి అవకాశముంది. గతంలోనూ అనేక సందర్భాల్లో ఎన్నికల సంఘం అనుమతితో విపత్తు సహాయాలను పంపిణీ చేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ, ఈ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోకుండా, ఎన్నికల కోడ్ సాకుగా చూపి బాధితులకు సహాయాన్ని ఎగ్గొట్టాలని ప్రభుత్వం చూస్తోందన్న ఆరోపణలు బలపడుతున్నాయి.
కేంద్ర నిధుల సాధనలో జాప్యం సొంత నిధుల కేటాయింపులో వైఫల్యం : కరువు తీవ్రతపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర నివేదిక పంపకపోవడం తీవ్రమైన లోపం. కేంద్ర బృందాలు వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, నిధులు మంజూరు చేసే వరకు వేచి చూడకుండా, రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో తక్షణ సహాయక చర్యలు ప్రారంభించాల్సి ఉంది. కానీ, ప్రభుత్వం ఆ దిశగా రూపాయి కూడా కేటాయించకపోవడం గమనార్హం. మరోవైపు అధికార కూటమిలోని పార్టీల పెద్దలు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే ధ్యేయంగా సీట్ల పంపకాలు, గెలుపు గుర్రాల వేట, రాజకీయ వ్యూహాల్లో మునిగిపోయారు. వీలైనన్ని ఎక్కువ స్థానాలు తమ ఖాతాలో వేసుకోవడానికి పావులు కదుపుతూ, కరువు సృష్టించిన భయానక వాతావరణం నుండి ప్రజల దృష్టిని మళ్లించే ఎత్తుగడలు వేస్తున్నారు. రాజకీయాలు, ఎన్నికల వేడుకలు తాత్కాలికం… కానీ కరువు తెచ్చే ఆకలి చావులు, రైతాంగ అప్పుల ఊబి, గ్రామీణ వలసలు కోలుకోలేని దెబ్బ తీస్తాయి. ఎన్నికల ప్రక్రియ ముగిసే డిసెంబర్ 2 వరకు కరువు బాధితులను నిరీక్షించమనడం అన్యాయం. ప్రభుత్వం తక్షణమే స్పందించి క్రింది చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. వాస్తవ వర్షాభావం, డ్రైస్పెల్స్ నమోదైన 641 మండలాలను శాస్త్రీయంగా పునఃపరిశీలించి, కరువు మండలాలుగా గుర్తించాలి. ఎన్నికల సంఘం అనుమతి కోరి, పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ప్రత్యేక కరువు ప్యాకేజీలను విడుదల చేయాలి. తాగునీటి కొరత ఉన్న గ్రామాలకు నీటి రవాణా, పశుగ్రాస కేంద్రాలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటుచేయాలి. ఉపాధి హామీ పనులను వేగవంతం చేసి, గ్రామీణ కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వానికి వెంటనే సమగ్ర కరువు నివేదికను పంపి సహాయాన్ని అభ్యర్థించాలి. ఓట్ల వేటలో పడి ఓటర్ల ఆకలి కేకలను విస్మరించడం ప్రజాస్వామ్యానికి మచ్చ. ఎన్నికల కోడ్ పేరుతో బాధ్యతల నుండి పారిపోకుండా, ప్రభుత్వం తక్షణమే కరువు సహాయక చర్యలను వేగవంతం చేయాల్సిన తరుణమిది.
ఆకలికేకలపై ‘కోడ్’ బూచి!
- Advertisement -


