నందిరాజు రాధాకృష్ణ
ప్రజాస్వామ్యంలో మీడియా కేవలం వార్తలను అందించే సమాచార సాధనం మాత్రమే కాదు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి. అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నించే అస్త్రం. ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే దీపస్తంభం. పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండేలా చేసే ప్రజాస్వామ్య ప్రహరీ. అటువంటి పవిత్ర బాధ్యతను నిర్వహించాల్సిన మీడియా ఆర్థిక ప్రయోజనాలకు, రాజకీయ అధికారానికి తలవంచితే ప్రజాస్వామ్యానికి కలిగే నష్టం అపారమైనది. ఒకప్పుడు పత్రికా సంపాదకీయమంటే ప్రజాభిప్రాయానికి దిక్సూచి. వార్తా విశ్లేషణమంటే వాస్తవాల పరిశీలనకు గీటురాయి. పాలకుల విధానాల్లో లోపాలుంటే నిర్భయంగా ఎత్తి చూపడం, ప్రజల గొంతుకగా నిలవడం పత్రికల ప్రతిష్ఠకు నిదర్శనం. కానీ నేడు కొన్ని మీడియా సంస్థల వ్యవహారశైలి చూస్తుంటే, ప్రజాపక్షాన నిలవాల్సిన కలం ఎవరి ప్రయోజనాలకు అనుగుణంగా కదులుతోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆర్థిక ప్రయోజనాల సంకెళ్లలో స్వేచ్ఛ : ప్రింట్ మీడియాకు ప్రకటనల ఆదాయం, పెట్టుబడులు, నిర్వహణ వ్యయాలు కీలకం. ఎలక్ట్రానిక్ మీడియాకు రేటింగులు, ప్రకటనల మార్కెట్, వ్యాపార ప్రయోజనాలు ప్రధానమవుతున్నాయి. సోషల్ మీడియాలో వీక్షణలు, అనుచరుల సంఖ్య, వైరల్ ప్రచారం, డిజిటల్ ఆదాయం కంటెంట్ స్వభావాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ వాణిజ్య అవసరాలు సహజమైనవే. అయితే ఆదాయ సమీకరణమే అంతిమ లక్ష్యంగా మారి, వార్తల నిజానిజాలు ద్వితీయ ప్రాధాన్యానికి చేరితేనే అసలు ప్రమాదం మొదలవుతుంది. ప్రకటనల కోసం వార్తలను అనుకూలంగా మలచడం, వ్యాపార ప్రయోజనాలకు విరుద్ధమైన అంశాలను విస్మరించడం, విమర్శనాత్మక కథనాలను అణచివేయడం వంటి ధోరణులు మీడియా విశ్వసనీయతను దెబ్బతీస్తాయి. వార్తకు విలువ దాని ప్రజాప్రయోజనంలో ఉండాలి. దాని వెనుక ఉన్న ఆర్థిక లాభంలో కాదు.
అధికారానికి అనుకూలమైతేనే వార్తా ? : రాజకీయ అధికారానికి దగ్గరగా ఉండటం ద్వారా ప్రకటనలు, గుర్తింపు, ప్రాప్యత, ఇతర ప్రయోజనాలు పొందాలనే ఆకాంక్ష కొన్ని సంస్థల సంపాదకీయ స్వతంత్ర తను బలహీనపరచవచ్చు. అధికార పక్షం తప్పులను ప్రశ్నించకుండా, ప్రతిపక్షం లోపాలను మాత్రమే భూతద్దంలో చూపడం: ఒక నాయకుడి ప్రతి ప్రకటనను విశేషంగా ప్రచారం చేస్తూ, ప్రజా సమస్యలకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటి పద్ధతులు పక్షపాత ఆరోపణలకు దారి తీస్తాయి. అయితే ప్రభుత్వాన్ని విమర్శించడం మాత్రమే స్వతంత్ర జర్నలిజం కాదు. ప్రభుత్వ చర్య లను వాస్తవాల ఆధారంగా పరిశీలించడం, ప్రతిపక్ష ఆరో పణలను కూడా ధ్రువీకరించడం, అన్ని రాజకీయ పక్షాలనూ ఒకే ప్రమాణంతో ప్రశ్నించడం నిష్పాక్షికత. అధికారానికి అనుకూలంగా ఉన్నా, వ్యతిరేకంగా ఉన్నా వాస్తవాన్ని వాస్తవంగా చెప్పగలిగినప్పుడే మీడియా గౌరవాన్ని నిలబెట్టుకోగలదు.
సంచలనమే వార్తగా.. వైరలే విజయంగా : ఎలక్ట్రానిక్ మీడియా పోటీలో కొన్ని సందర్భాల్లో అరుపులు, ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు చర్చల స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. విశ్లేషణకు బదులు వాగ్వాదం, వాస్తవ పరిశీలనకు బదులు ఊహాగానాలు, ప్రజా సమస్యలకు బదులు వ్యక్తుల మధ్య ఘర్షణలు తెరపైకి వస్తున్నాయి. సోషల్ మీడియాలో పరిస్థితి మరింత సంక్లిష్టం. నిర్ధారణ కాని సమాచారం, పాత వీడియోలకు కొత్త సందర్భాలు ఆపాదించడం, అసత్య ప్రచారం, వ్యక్తిత్వ హననం వేగంగా వ్యాపించే ప్రమాదం ఉంది.అయితే అన్ని పత్రికలూ, అన్ని టీవీ ఛానళ్లూ, సోషల్ మీడియా వేదికలన్నీ ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయని చెప్పడం కాదు. నిబద్ధతతో పనిచేస్తున్న సంస్థలు, వాస్తవ నిర్ధారణకు ప్రాధాన్యం ఇస్తున్న జర్నలిస్టులు ఇప్పటికీ ఉన్నారు. వారి కృషిని గుర్తించడం కూడా సమాజ బాధ్యతే.
ప్రజల విశ్వాసమే మీడియాకు అసలైన పెట్టుబడి : ఆర్థిక బలం సంస్థను నిలబెట్టవచ్చు. రాజకీయ పలుకుబడి తాత్కాలిక ప్రయోజనాలను అందించవచ్చు. కానీ ప్రజల విశ్వాసం కోల్పోయిన మీడియా సంస్థకు దీర్ఘకాలికంగా నిలదొక్కుకోవడం కష్టం. వార్తల్లో పక్షపాతం కనిపించినప్పుడు, నిజాలను దాచిపెడుతున్నారనే అనుమానం కలిగినప్పుడు, పాఠకులు, ప్రేక్షకులు ప్రత్యామ్నాయ సమాచార మార్గాలను ఆశ్రయిస్తారు. అప్పుడు మీడియా సంస్థలపై మాత్రమే కాదు, జర్నలిజం వృత్తిపైనే అపనమ్మకం పెరుగుతుంది. ఈ సంక్షోభానికి పరిష్కారం సంపాదకీయ స్వాతంత్రాయూన్ని కాపాడటం, యాజమాన్య ప్రయోజనాలను పారదర్శకంగా వెల్లడించడం, వార్తలను ప్రకటనల నుంచి స్పష్టంగా వేరు చేయడం, తప్పులను బహిరంగంగా సరిదిద్దడం, డిజిటల్ సమాచారాన్ని ధృవీకరించిన తర్వాతే ప్రచురించడం. జర్నలిస్టుల వృత్తిపరమైన భద్రత, స్వతంత్ర మీడియా సంస్థల ఆర్థిక స్థిరత్వం కూడా అంతే ముఖ్యం. మీడియా స్వేచ్ఛ అంటే బాధ్యతలేని స్వేచ్ఛ కాదు. అధికారానికి విధేయత చూపడమూ కాదు. అది వాస్తవాల పట్ల నిబద్ధత, ప్రజల పట్ల జవాబుదారీతనం, అధికారాన్ని ప్రశ్నించే ధైర్యం కలగలిసిన వృత్తి ధర్మం.ప్రజాస్వామ్యంలో మీడియా తన పాత్రను మరచిపోతే, ప్రజలే దాని విశ్వసనీయతకు తీర్పు చెబుతారు. ఆర్థిక ప్రయోజనాల కోసం కలాన్ని తాకట్టు పెట్టినా, అధికార అనుగ్రహం కోసం ప్రశ్నించే గొంతును మూగబరిచినా, కొంతకాలం లాభాలు దక్కవచ్చు. కానీ చివరకు మిగిలేది అపహాస్యం, అపనమ్మకం, ప్రతిష్ఠకు తీరని నష్టం. కలం ఎవరి చేతిలో ఉందన్నది కాదు ముఖ్యం. అది ఎవరి పక్షాన నిలుస్తుందన్నదే ముఖ్యం. మీడియా అధికారానికి ప్రతిధ్వనిగా మారితే తన ప్రత్యేకతను కోల్పోతుంది. ప్రజల గొంతుకగా నిలిస్తేనే ప్రజాస్వామ్యానికి నిజమైన నాలుగో స్తంభంగా చరిత్రలో నిలిచిపోతుంది.
సీనియర్ జర్నలిస్ట్, సెల్ : 98481 28215


