Homeవిశ్లేషణఈ దగా ఆగనిదీ!

ఈ దగా ఆగనిదీ!

- Advertisement -

అజయ్బాబు కూన

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విలసిల్లుతున్న భారతదేశంలో పౌరుడికి రాజ్యాంగం ప్రసాదించిన అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన ఆయుధం ఓటు హక్కు. పాలకుల భాగ్యరేఖలను నిర్ణయించేది, నిరంకుశ పోకడలను నిలువరించేది ఈ ఒక్క ఓటే. అలాంటి ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కునే అక్రమంగా, ఏకపక్షంగా కొల్లగొట్టే కుట్రలు సాగుతుండటం అత్యంత ఆందోళనకరం. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ జరుగుతున్న తీరు చూస్తుంటే, ఎన్నికల నిర్వహణ వ్యవస్థ పారదర్శకతనే ప్రశ్నార్థకం చేస్తున్నది. అర్హులైన పౌరులను కంటికి రెప్పలా కాపాడి ఓటు హక్కును కల్పించాల్సిన భారత ఎన్నికల సంఘం (ఈసీఐ), అందుకు భిన్నంగా లక్షలాది ఓట్లను వివాదాస్పద రీతిలో గంపగుత్తగా తొలగిస్తుండటం రాజ్యాంగ విలువలకే గొడ్డలిపెట్టు.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర విస్మయాన్ని కలిగిస్తున్నాయి. అక్టోబర్ 14 నాటికి రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,75,69,896 అని ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ముసాయిదా జాబితా విడుదల అనంతరం ఏకంగా 44,89,512 ఓట్లను తొలగించడం, అభ్యంతరాల స్వీకరణ అనంతరం మరో 3,31,052 ఓట్లను తీసివేయడం సామాన్యమైన విషయం కాదు. దాదాపు నలభై ఎనిమిది లక్షల ఓట్లను జాబితా నుంచి తొలగించారంటే దాని తీవ్రత ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి భారీ స్థాయిలో తొలగింపులు జరగడానికి గల ప్రాతిపదిక ఏమిటో ఎన్నికల యంత్రాంగం నిగ్గుతేల్చలేకపోతున్నది. మరోవైపు కేవలం 7,62,766 మంది కొత్త ఓటర్లను మాత్రమే చేర్చినట్లు ప్రకటించారు. అసలు కొత్త ఓట్ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? వాటిలో ఎన్నింటిని ఎందుకు తిరస్కరించారు? తిరస్కరణకు అధికారులిచ్చిన నిర్దిష్ట కారణాలేమిటి? అన్న ప్రశ్నలకు నేటికీ స్పష్టమైన సమాధానం లేదు. క్షేత్రస్థాయిలో రాజకీయ దురుద్దేశాలతో ఫారం7ను విస్తృతంగా దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సజీవంగా ఉన్న, నియోజకవర్గాల్లోనే నివాసముంటున్న ఓటర్ల పేర్లను కూడా ‘వలస వెళ్లారని’, ‘మరణించారని’ లేదా ‘రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని’ దొంగ ఫిర్యాదులతో తొలగిస్తున్నారని ప్రధాన రాజకీయ పక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అధికారులు స్వయంగా విచారణ చేయకుండా, ఈఆర్‌వోలు బల్క్ ఎంట్రీల ద్వారా ఓట్లను తొలగించారన్న ఫిర్యాదులు తీవ్రమైనవి. దీనిపై ఏపీలోని ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ‘ఏ ఒక్క అర్హుడూ ఓటు కోల్పోకూడదు’ అని ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వల్లించే నీతిసూక్తులు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి తప్ప ఆచరణలో అందుకు పూర్తి విరుద్ధమైన వాతావరణం నెలకొంది. పూర్తి జాబితాలను రాజకీయ పార్టీలకు, పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్లకు (బీఎల్‌ఏ) బహిరంగంగా అందించకుండా దాగుడుమూతలు ఆడటం వ్యవస్థాగత లొంగుబాటును స్పష్టం చేస్తోంది. ఈ జాఢ్యం కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాలేదు... సరిహద్దు రాష్ట్రమైన తెలంగాణలోనూ ఇదే తరహా సంక్షోభం కొనసాగుతోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో జీవిస్తున్న పేదలు, బలహీన వర్గాలు, అసంఘటిత కార్మికుల ఓట్లు గల్లంతవుతున్నాయి. ఆధునికీకరణ, డీడూప్లికేషన్, సాఫ్ట్‌వేర్ శుద్ధీకరణ పేరుతో సామాన్యుల ఓటు హక్కుపై దాడి జరుగుతోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఇదే విధమైన విచ్చలవిడి తొలగింపులు చోటుచేసుకోవడం వల్లే వ్యవహారం దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గడప తొక్కాల్సి వచ్చింది. గతంలోనూ అనేక సందర్భాల్లో సుప్రీం కోర్టు ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత లోపించడంపై తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ, అధికార యంత్రాంగంలో మార్పు రాకపోవడం విచారకరం. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం వైఖరి అత్యంత వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ నేతృత్వంలోని కమిషన్ అధికార పక్షాల రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు బలంగా వినబడుతున్నాయి. విపక్షాల బలం ఉన్న ప్రాంతాలను, నిర్దిష్ట వర్గాల ఓటర్లను లక్ష్యంగా చేసుకుని పథకం ప్రకారం ఓట్లను గల్లంతు చేస్తున్నారన్న ఆరోపణలు నిరాధారమైనవి కావు. ఎన్నికల సంఘం విశ్వసనీయత అడుగంటుతుండటంతో సీఈసీకి వ్యతిరేకంగా రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు, పౌర సమాజం దేశవ్యాప్తంగా ఆందోళన బాట పట్టాయి. రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోవాల్సిన ఎన్నికల సంఘం, పాలకుల రాజకీయ ప్రయోజనాలకు మోకరిల్లితే అది ప్రజాస్వామ్య సౌధాన్ని కూల్చివేసినట్లే అవుతుంది.
ఎస్‌ఐఆర్ ప్రక్రియ ద్వారా కోట్లాది మంది ఓట్లను తొలగించారు. ముఖ్యంగా డూప్లికేట్, మరణించిన లేదా శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్ల ప్రక్షాళన పేరిట చేపట్టిన ఈ కసరత్తులో లక్షలాది మంది అర్హులైన పౌరుల పేర్లు కూడా గల్లంతయ్యాయనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటివరకు దేశంలో రెండు ప్రధాన దశలతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎస్‌ఐఆర్ వివరాలు, నమోదైన భారీ తొలగింపుల వివరాల్లోకి వెళితే దిగ్భ్రాంతికాక తప్పదు. రెండు దశల్లో 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో కలిపి సుమారు 5.18 కోట్ల ఓట్లు (మొత్తం ఓటర్లలో దాదాపు 10.2%) తొలగించారు. ఆంధ్రప్రదేశ్‌లో 48.2 లక్షలకు పైగా ఓట్లు తొలగింపునకు గురికాగా, వీటికి విరుద్ధంగా చేర్చిన కొత్త ఓట్లు కేవలం 7.62 లక్షలు మాత్రమే. తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్మల్కాజిగిరి పరిధిలో తీవ్రస్థాయిలో ఓట్లు గల్లంతయ్యాయి. తెలంగాణవ్యాప్తంగా గుర్తించిన ‘ఏఎస్‌డీడీ’ (యాబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్) ఓట్లలో సుమారు 60% ఈ పట్టణ ప్రాంతాల నుంచే ఉన్నాయి. నోటీసులు ఇవ్వకుండానే బల్క్ తొలగింపులు జరిగాయని హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. రాజకీయ కారణాలతోపాటు క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా కంప్యూటర్ అల్గారిథమ్ల ఆధారంగా తార్కిక వ్యత్యాసాల పేరిట సామాన్యుల పేర్లను తొలగించడం, ఎలాంటి ప్రత్యక్ష విచారణ లేకుండానే ప్రత్యర్థి వర్గాల పేర్లను తొలగించడానికి పెద్దయెత్తున ఫారం7 సమర్పించడం, ఇంటింటి సర్వే చేయకుండా సామూహిక భవనాల్లో క్యాంపులు నిర్వహించి, అందుబాటులో లేని వారిని ఏకపక్షంగా ‘వలస వెళ్లినవారు/మరణించినవారు’గా నమోదు చేయడం వంటి కారణాలూ లేకపోలేదు. మొత్తంగా యూపీలో 2.05 కోట్లు, పశ్చిమ బెంగాల్‌లో 83.86 లక్షలు, తమిళనాడులో 74 లక్షలు, గుజరాత్‌లో 68 లక్షలు, బీహార్‌లో 47 లక్షలు, మధ్యప్రదేశ్‌లో 34.25 లక్షలు, రాజస్థాన్‌లో 31 లక్షలు, ఛత్తీస్‌గఢ్‌లో 25 లక్షలు, కేరళలో 9 లక్షలు, గోవాలో 1.28 లక్షలు, పుదుచ్చేరిలో 77 వేలు, అండమాన్నికోబార్ దీవుల్లో 52 వేలు, లక్షద్వీప్‌లో 206 ఓట్లను తొలగించినట్లు ఎన్నికల సంఘం అధికారిక డేటానే చెపుతున్నది. ఓటర్ల జాబితా పారదర్శకంగా, నిష్పాక్షికంగా లేకపోతే జరిగే ఎన్నికలకు విలువ ఉండదు. కాబట్టి, ఎన్నికల సంఘం మొండివైఖరి వీడాలి. ఆంధ్రప్రదేశ్‌తో సహా దేశవ్యాప్తంగా ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన ఈ ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను తక్షణమే తాత్కాలికంగా నిలిపివేయాలి. తొలగించిన ప్రతి ఓటుకు సంబంధించిన వివరాలను, కారణాలను పోలింగ్ కేంద్రాల వారీగా పబ్లిక్ డొమైన్లో ఉంచాలి. ఈ విషయంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నట్లు? అక్రమంగా ఫారం7 నమోదు చేసినవారిపై, నిర్లక్ష్యంగా బల్క్ తొలగింపులు చేపట్టిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. కోట్లాది మంది పౌరుల గొంతుకైన ఓటు హక్కును కాపాడటానికి రాజ్యాంగ సంస్థలు, న్యాయస్థానాలు యుద్ధప్రాతిపదికన స్పందించాలి. పౌరుల విశ్వాసాన్ని చూరగొనలేని ఎన్నికల వ్యవస్థ చివరకు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే సాధనంగా మాత్రమే మిగిలిపోవాలా? ఇంకెన్నాళ్లీ దగా?

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు