నగేష్ బూర్తి
ఓటు… అది కేవలం ఒక బటన్ను నొక్కే చర్య కాదు. ఐదేళ్లకోసారి ప్రభుత్వాలను ఎన్నుకునే సాధనం కాదు. దేశ భవిష్యత్తును నిర్ణయించే ప్రజాశక్తి. రాజ్యాంగం పౌరుడికి అందించిన సమానత్వపు హామీ. అధికారాన్ని ప్రశ్నించే ఆయుధం. పాలకులను మార్చగల శక్తి. అందుకే నేడు దేశవ్యాప్తంగా సర్ చుట్టూ జరుగుతున్న చర్చ ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన పరిపాలనా వివాదం కాదు. ఓటు హక్కు భద్రత, ఎన్నికల సంఘం విశ్వసనీ యత, ప్రజాస్వామ్య సంస్థల స్వతంత్రతకు సంబంధించిన కీలక ప్రశ్నగా మారింది. ఒకవైపు ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడం ప్రజాస్వామ్య పరిరక్షణకు అవసరమని ఎన్నికల సంఘం, అధికార బీజేపీ వాదిస్తున్నాయి. మరోవైపు అర్హులైన పౌరుల పేర్లు తొలగిపోతే అది ప్రజాస్వామ్యానికి తీవ్రమైన నష్టమని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ రెండు వాదనల మధ్య నిలిచిన అసలు ప్రశ్న ఒక్కటే… నిజమైన ఓటరుకు తన ఓటు హక్కుపై భరోసా ఉందా?
ఓటు హక్కు… పోరాటాల నుంచి పుట్టిన ప్రజాస్వామ్య శక్తి: బ్రిటిష్ పాలనలో భారతీయులందరికీ సమానమైన ఓటు హక్కు లేదు. ఆస్తి, ఆదాయం, పన్నుల చెల్లింపు, విద్య వంటి అర్హతల ఆధారంగా కొద్దిమందికే ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉండేది. 1909, 1919, 1935 నాటి రాజ్యాంగ సంస్కరణల ద్వారా ఎన్నికల వ్యవస్థ విస్తరించిన ప్పటికీ, సార్వత్రిక వయోజన ఓటు హక్కు అప్పట్లో అందుబాటులోకి రాలేదు. స్వాతంత్య్రోద్యమ కాలంలో సమాన రాజకీయ హక్కుల కోసం అనేక మంది నాయ కులు గళమెత్తారు. 1928 నెహ్రూ నివేదిక, 1931 కరాచీ కాంగ్రెస్ తీర్మానం వంటి పరిణామాలు స్వతంత్ర భారత దేశంలో పౌరులందరికీ సమాన రాజకీయ హక్కులు ఉండాలనే ఆకాంక్షను బలపరిచాయి. స్వతంత్ర భారత రాజ్యాంగం ఆ ఆకాంక్షకు చట్టబద్ధమైన రూపం ఇచ్చింది. రాజ్యాంగంలోని 326వ అధికరణం ప్రకారం లోకస్భ, రాష్ట్ర శాసనసభల ఎన్నికలకు సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించారు. ప్రారంభంలో కనీస ఓటు వయస్సు 21 సంవత్సరాలు కాగా, 61వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని 18 సంవత్సరాలకు తగ్గించారు. ఈ మార్పు 1989లో అమల్లోకి వచ్చింది. ఈ పరిణామం భారత ప్రజాస్వామ్య చరిత్రలో కీలక మలుపు. పేదవాడైనా, ధన వంతుడైనా… మహిళైనా, పురుషుడైనా, ఏ కులానికి, మతానికి, ప్రాంతానికి చెందినవాడైనా చట్టపరమైన అర్హతలు నెరవేర్చిన ప్రతి పౌరుడికి సమాన ఓటు హక్కు ఉండాలన్నదే ప్రజాస్వామ్య సూత్రం. అయితే, రాజ్యాంగం హక్కును కల్పించడం ఒక దశ మాత్రమే. ఆ హక్కును ప్రతి అర్హుడూ వాస్తవంగా వినియోగించుకునేలా చూడటం మరో కీలక బాధ్యత.
సర్ ఎందుకు వివాదాస్పదమైంది…?
ఓటర్ల జాబితాలో మరణించినవారి పేర్లు ఉండటం, ఒకే వ్యక్తికి ఒకటికంటే ఎక్కువ చోట్ల నమోదులు ఉండటం, శాశ్వతంగా నివాసం మార్చినవారి వివరాలు నవీకరించకపోవడం వంటి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఓటర్ల జాబితాను సమగ్రంగా సవరించాలనే లక్ష్యాన్ని సూత్రప్రాయంగా తప్పుపట్టలేం. కానీ సవరణ ప్రక్రియలో అనుసరించే పద్ధతులే ప్రజా స్వామ్యానికి పరీక్షగా మారతాయి. నిజంగా మరణించినవారి పేర్లు తొలగించబడుతు న్నాయా..? లేక జీవించి ఉన్న ఓటర్ల పేర్లు కూడా పొరపాటున తొలగిపోతున్నాయా..? తాత్కాలికంగా వలస వెళ్లిన కార్మికుడు తన స్వస్థలంలో ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందా..? పేదలు, వృద్ధులు, నిరక్షరాస్యులు, అట్టడుగు వర్గాల ప్రజలు అవసరమైన పత్రాలను సమర్పించలేక ఇబ్బందులు పడుతున్నారా? ఇవన్నీ రాజకీయ ఆరోపణలుగా కొట్టిపారేయాల్సిన ప్రశ్నలు కావు. పారదర్శకమైన సమాచారం, స్వతంత్ర పరిశీలన, సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కారంతో సమాధానం చెప్పాల్సిన అంశాలు. అయితే, సర్ ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లు తొలగించారనే వాదనతో సహా ప్రచారంలో ఉన్న సంఖ్యలను అధికారికంగా నిర్ధారించకుండా వాస్తవాలుగా స్వీకరించడం సరికాదు. అందుకే ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ముసాయిదా జాబితాలు, తుది జాబితాలు, తొలగింపుల కారణాలు, అభ్యంతరాలు, తిరిగి చేర్చిన పేర్ల వివరాలు ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండాలి.
ప్రతిపక్షాల ఆరోపణలు… బీజేపీ సమర్థన: సర్ ప్రక్రియపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలతో పాటు కాక్రోచ్ జనతాపార్టీ ప్రతినిదులు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోతున్నాయని, పేదలు, వలస కార్మికులు, వెనుకబడిన వర్గాలు నష్టపోయే ప్రమాదం ఉందని ఆరోపిస్తున్నాయి. ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత ఉండాలని, ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు, బీజేపీ ఈ ఆరోపణలను ఖండిస్తోంది. మరణించినవారి పేర్లు, డూప్లికేట్ నమో దులు, శాశ్వతంగా నివాసం మార్చినవారి వివరాలను సరిచేయడం స్వచ్ఛమైన ఓటర్ల జాబితా కోసం అవసరమని వాదిస్తోంది. ఓటమి భయంతో ప్రతిపక్షాలు రాజ్యాంగ సంస్థలపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయని విమర్శిస్తోంది. ఈ రెండు పక్షాల వాదనల్లో రాజకీయ ప్రయోజనాలు ఉండవచ్చు. కానీ ప్రజా స్వామ్యానికి అవసరమైనది రాజకీయ ప్రకటనల పోటీ కాదు.
ఎన్నికల సంఘం… నిష్పక్షపాతమే అసలైన బలం: భారత ఎన్నికల సంఘం ఒక సాధారణ ప్రభుత్వ విభాగం కాదు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిం చాల్సిన రాజ్యాంగ సంస్థ. ప్రజలు ఎన్నికల ఫలితాలను అంగీకరించడానికి ఎన్నికల ప్రక్రియపై విశ్వాసం ఉండటం అత్యవసరం. ఈసీ తీసుకునే ప్రతి నిర్ణయం చట్టబద్ధంగా ఉండటంతో పాటు ప్రజలకు అర్థమయ్యేలా వివరించ బడాలి. ఓటరు పేరు తొలగించాల్సి వస్తే దానికి కారణం ఏమిటో తెలియాలి. సంబంధిత ఓటరుకు అభ్యంతరం చెప్పే అవకాశం ఉండాలి. తప్పుగా తొలగించిన పేరు తిరిగి చేర్చేందుకు సరళమైన వ్యవస్థ ఉండాలి. ఫిర్యాదులకు గడువులోగా సమాధానాలు ఇవ్వాలి. ఎన్నికల కమిషనర్ల మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు లేదా డేటా నిర్వహణలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని కేవలం ఖండనలతో ముగించడం సరిపోదు. సంబంధిత రికార్డులు, నిర్ణయ ప్రక్రియ, చట్టపరమైన ఆధారాలను సాధ్యమైన మేరకు ప్రజల ముందుంచడం సంస్థపై విశ్వాసాన్ని పెంచుతుంది. కానీ ఆ విశ్వాసాన్ని పెంచుకోవటానికి ఆ ఎన్నికల కమిషనర్ సిద్ధంగా ఉన్నట్లు కనిపించటం లేదు.
జనగణన వేరు… ఓటర్ల జాబితా సవరణ వేరు: ఈ వివాదంలో మరో ముఖ్యమైన అంశం జనాభా లెక్కలు. జనగణన ద్వారా దేశ జనాభా, సామాజిక, ఆర్థిక పరిస్థితు లకు సంబంధించిన విస్తృత సమాచారం సేకరిస్తారు. ఓటర్ల జాబితాను ఎన్నికల చట్టాల ప్రకారం ఎన్నికల సంఘం తయారు చేసి సవరిస్తుంది. జన గణనలో ఉంటే ఓటరుగా తీసుకోవాల్సిన అవసరం లేదు అనే అభిప్రా యాన్ని వ్యక్తీకరిస్తోంది ఎన్నికల కమిషన్. ఎందుకంటే జనాభకు ఓటరు నమోదుకు మధ్య ఉన్న తేడా చాలా ఉంది.
ఎవరా 16 కోట్ల మంది…? ఇక్కడే అసలైన అనుమానాలు వస్తున్నాయి. తొలగించిన 13 కోట్ల మంది చనిపోయిన వారని. బంగ్లాదేశీయులు అని చాలా మాటలు బీజేపీ నేతలు కార్యకర్తలు చెబుతున్నారు. కానీ భారతదేశం జనాభా 148 కోట్లు. వీరిలో 18 ఏళ్లు నిండినవారు 101 కోట్ల మందికి పైగా ఉన్నారు. కానీ దేశంలో 85 కోట్ల మందికే ఓట్లు ఉన్నాయి. తీసేసిన 13 కోట్లతో కలిపి మొత్తం 16 కోట్ల మందికి ఓట్లు లేవు. ఈ 16 కోట్ల మంది ఎవరూ అనే ప్రశ్న ఉద్భవించింది. 16 కోట్ల మంది అంటే 16 శాతం పైగానే ఓట్లు లేవు. కానీ ఈ దేశంలో గెలుపు ఓటములను నిర్ణయించేది కేవలం 2 నుంచి 10 శాతం లోపే అంటే 16 కోట్ల మందికి ఓట్లు లేవంటే నిజంగా ఇప్పుడు జరిగబోయే ఎన్నికలు ప్రజా స్వామ్య బద్దం కాదు అని అర్థం అవుతుంది. కొంతమందికి హక్కు ప్రకారం వచ్చిన ఓటు లేకుండా చేసి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధానంలో ఎన్నికలు నిర్వహించటం అప్రజాస్వామ్యం. అర్హులైన అందరికీ ఓటు హక్కు కల్పించలేకపోవటం ఎన్నికల కమిషన్ చేతకాని తనం. లేదు వాళ్లందరూ నిజంగానే అనర్హులు అని ఎన్నికల కమిషన్ నిర్ధారిస్తే వారంతా ఈ దేశ పౌరులు కాదు అని అర్థం. అలాంటప్పుడు వారందరూ ఈ దేశ ఓటర్లు కానపుడు వారంతా ఇక్కడ ఎందుకు ఉన్నారో తేల్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. వారు నిజమైన భారతీయ పౌరులైతే ఓటు హక్కు ఇవ్వాలి లేదా ఆ 16 కోట్ల మందిలో విదేశీయులు ఎవరూ ఎందుకు ఇక్కడ ఉన్నారూ వారి సంగతి ఏమిటో కేంద్ర హోంశాఖ గణాంకాలతో పాటు సమాధానం చెప్పాలి. వారంతా రోహింగ్యాలు అయితే అరెస్టు చేయాలి లేదా వారి దేశాలకు పంపాలి లేదూ భారతీయులైతే వారికి ఎన్నికల కమిషన్ ఓటు హక్కు ఇవ్వాలి. జనాభ లెక్కలకు, ఓటు హక్కుకు కేవలం ఒకటి రెండు శాతం తేడా ఉంటే ఫర్వాలేదు. కానీ 16 శాతం పైగానే తేడా ఉంటే అది ప్రజాస్వామ్య ఎన్నిక కాదు అని అర్థం చేసుకోవాలి. ఈ గణాంకాలపై అటు ఎన్నికల కమిషన్ కానీ, కేంద్రం కానీ స్పందించకుండా అరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలపై విరుచుకుపడటం నియంతృత్వవాదులకు ఈ తీరు అద్దం పడుతుంది. ప్రతిపక్షాలపై నియంతల్లా విరుచుకుపడుతున్న పాలకులు ఒక నిజం తెలుసుకోవాలి. ప్రజల హక్కులను హరించిన నియంతలు కుక్క చావు చచ్చారు. చరిత్ర పునరావృతం కాకుండా చూసుకుని ప్రజల ఓటు హక్కును తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత కేంద్రంతో పాటు ఎన్నికల కమిషన్ లపై ఉంది. లేని పక్షంలో చరిత్రలో నియంతలకు పట్టిన గతే పడుతుంది.
సీనియర్ జర్నలిస్ట్, 7702262666
ఎవరా 16 కోట్ల మంది… ?
- Advertisement -


