Homeవిశ్లేషణకథల పూలవనం

కథల పూలవనం

- Advertisement -

పేజీల నిండా పరుచుకున్న ప్రేమలు… పువ్వులు… తీవెలు… మధ్య మధ్యలో దీవెనలు. ఓ పేజీలో “విదియ నాటి చందమామ” మరికొన్ని పేజీలు తిప్పేసరికి “దశమి చందమామ”గా రూపాంతరం చెందుతాడు. ఈ కథలు చదువుతూంటే గమ్మత్తుగా వేళ్లకి పూల పరిమళం అంటుకుంటుంది. ఆ పరిమళం గుండెకి చేరి “ముందు తెలిసెనా ప్రభూ…ఈ మందిర మిటులుంచేనా” అని పాడుకోవాలనిపిస్తుంది. ప్రేమ కథలన్నారు వాడ్రేవు వీరలక్ష్మీదేవి వీటిని. నిజానికి ఇవన్నీ కడియం పూల నర్సరీలు. “పూలం డోయ్ పూలు” అని సాయంత్రం వేళ కొందరు వ్యాపారులు వీధుల్లో తిరుగు తారు. వాడ్రేవారమ్మాయి రాసిన ఈ కథల్ని చదివాక “ప్రేమ పూల కథలం డోయ్” అంటూ భుజాన సంచుల్లోకి ఎత్తుకుని వీధుల్లో తిరగాలి. ఆ మధ్య ప్రేమ కథలంటే నాకు నచ్చవన్నాను. ప్రేమ వెనుక మోసం గురించే నా బెంగంతా. అందుకే అలా అన్నాను. ఈ కథల్లో మోసం, దగా, వంచనా వంటి మాటలే లేవు. ఉన్నదంతా కేవలం ప్రేమలు మాత్రమే. “నేను నిన్ను ప్రేమిస్తున్నాను… నీకేం సంబంధం” అంటాడు జర్మన్ మహా రచయిత గోథే. ఈ పూల రుతువు నిండా ఉన్నది అదే. నా పేరు అపర్ణ అన్నారు ఓ కథలో… ఆ కథ చదివాక నేను పేరు మార్చుకుంటున్నాను. నా పేరు రాజారాం. నిజానికి ప్రతి కథ పూర్తి అయ్యాక నేను పేర్లు మార్చుకుంటూనే ఉన్నాను ప్రేమ రాహిత్యపు జీవితంలో. “దయచేసి వినండి” ఓ కథ.ఇందులో తల్లీ, కొడుకుల మధ్య రైలు పట్టాల్లాంటి ప్రేమ ఉంది. కానీ, ఇందులోనే ఓ క్రౌర్యం కూడా ఉంది. రైల్లో వెళ్తున్న జానకిని ఆ గార్డు చేయి పట్టుకుంటాడు. ఆ తర్వాత ఇంకేం చేస్తాడు. ఏం చేయడు. చేయలేడు. రైలు కదా…! ఇది జానకికి ఓ ధైర్యం. కానీ… చేయి పట్టుకున్నాడు కదా…! ఈ ఒక్క సంఘటనే రెండేళ్ల పాటు జానకిని నిద్రకి దూరం చేసింది. ఎవరికైనా చెప్పాలి. ఎలాగైనా చెప్పుకోవాలి. చెప్పాలంటే ఓ అవమానంగా అనిపించింది. చివరికి పాఠకుడికి చెబుతూనే గీతకి చెప్పింది జానకి. ఇందులో ప్రేమ ఎక్కడుంది. ఇది ప్రేమకథల్లో ఒక కథ ఎందుకయ్యింది? ఎందుకయ్యిందంటే…. రెండేళ్ల మనోవేదనని గీతతో పంచుకుంది కనుక. కథ చివర్లో “పెద్ద బరువు దిగినట్టుందే నీకు చెప్పుకుంటే” అంది జానకి. తర్వాత వాక్యం…“ఆవలింతలు వస్తున్నాయి” జానకికి. బరువు దిగాక ఆవలింతలు రావడమే గీత మీద జానకికి ఉన్న ప్రేమకి ప్రతిరూపం. కథల్లో కవిత్వం పలికించడమంటే నాకు చాలా ఇష్టం. అందుకే నాకు రా.వి.శాస్త్రి, పతంజలి, బీనాదేవి నచ్చినంతగా ఇతర పెద్ద రచయితలు నచ్చరు. నా ఇష్ట రచయితల జాబితాలోకి ఇదిగో ఇప్పుడు వాడ్రేవు వీరలక్ష్మీదేవి కూడా చేరారు. ఎందుకు చేరారంటే….“ఎప్పుడైనా కాశీరత్నం పూల తీగ చూశావా..! ఆ తీగ దేనినైనా అల్లుకోవడం కాదు… అలముకుంటుంది… ఆ పాదు మొత్తం పెద్ద ఆకుపచ్చని సాలెగూడులా ఉంది.” ఈ వాక్యాలని వచనం అని ఎలా అంటాం? నేను అనను. అనలేను. ఇలాంటి వాక్యాలు ఈ పూల రుతువు కథా సంపుటిలో లెక్కలేనన్ని దొరుకుతాయి. “జాజులు పూచే వేళ” ఈ మధ్యనే ఓ పత్రిక ఆదివారం అనుబంధంలో వచ్చిన కథ. ఎగువ మధ్య తరగతి జీవితాలను కాగితాల మీద పరచిన కథ. రెండు జంటల మధ్య ప్రేమ లేని దాంపత్య జీవితపు చీకటి వాసన ఈ కథ. నేను ఇది వరకు చాలాసార్లు చెప్పాను. అయినా మళ్లీ మళ్లీ చెప్పాలనిపించే మాట. కావ్యధర్మం గురించి కాళిదాసు అంటాడు. ఏ సృజనైనా చివరిలో ఎలా ముగుస్తుందో కావ్యం ప్రారంభంలోనే కాసింత చెప్పాలి అని. అదే కావ్యధర్మం. ఈ జాజులు పూచే వేళ కథ నూటికి రెండు వందల శాతం కావ్యధర్మాన్ని పాటించి రాసిన కథ. ఈ కథ ఇలా ప్రారంభమవుతుంది… “రెండు నెలల్లో కుక్కర్ పేలడం ఇది రెండోసారి”. అనిత కామ్గా బెడ్ రూంలోకి వెళ్లిపోయింది. అలా అనిత బెడ్రూంలోకి వెళ్లిపోవడం రఘువీర్‌కి ఏమో కాని భాగ్యలక్ష్మీకి మాత్రం చిర్రెత్తుకొచ్చింది. ఇక్కడే కథ ముగింపు చాలా వరకూ పాఠకులకు అర్థం అవుతుంది. అర్థం అవుతున్నా కథ చదవాలనుకోవడమే రచయిత విజయం. ఈ కథ చివర్లో భాగ్యలక్ష్మీ వంటి పని వాళ్లకి “ఇష్టం గురించి తెలుసు కాని అది లేకపోవడం గురించి తెలియదు” అని ముగుస్తుంది. ఈ పూల రుతువు కథా సంకలనంలో పన్నెండు కథలు న్నాయి. ఒక్కో కథ ఒక్కో పువ్వు పూసినట్లుగా ఉన్నాయి. ఈ కథలు చదివాక వాడ్రేవు వీరలక్ష్మీదేవి వాక్యంలానే నేను… “వేయి పులకింతల కొండవాగునయ్యాను”.
(శనివారం కాకినాడలో వాడ్రేవు వీరలక్ష్మీదేవి పూల రుతువు కథా సంకలనం ఆవిష్కరణ)
సీనియర్ జర్నలిస్ట్, 99120 19929

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు