Homeతెలంగాణకరవు సాయంలో కేంద్రం నిర్లక్ష్యం

కరవు సాయంలో కేంద్రం నిర్లక్ష్యం

- Advertisement -

క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ప్రతినిధులు సందర్శించకపోవడం దురదృష్టకరం

  • నష్టపోయిన రైతులకు న్యాయమైన పరిహారం
  • 10న కలెక్టరేట్ల వద్ద సీపీఐ ధర్నా
  • మహిళా కండక్టర్ కుటుంబానికి రూ.కోటి ఇవ్వాలి
  • పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇళ్లు
  • అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయండి: కూనంనేని

విశాలాంధ్ర`హైదరాబాద్: రాష్ట్రంలో కరవు పరిస్థితులు తీవ్రరూపం దాల్చడంతో రైతాంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు. కరవు అంచనాలు, సహాయక చర్యల్లో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని కేంద్ర వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కరవు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో సీపీఐ బృందాలు తప్ప ఎవరూ సందర్శించకపోవ డం దురదృష్టకరమన్నారు. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం 12.5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. రైతులు, వ్యవసాయ కూలీలు, పేద కుటుంబాలనూ ఆదుకునే సమగ్ర సహాయక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సీపీఐ బృందాలు మినహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు కరవు పరిశీలనకు రాలేదన్నారు. నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలని కూనంనేని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పంటల బీమా అందుబాటులోకి తేవాలన్నారు. కరవు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట సీపీఐ అధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తున్నట్టు కూనంనేని ప్రకటించారు. మండల కేంద్రాల్లో రైతులతో ఆందోళనలు నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు అందజేస్తామ న్నారు. కరవు, రైతాంగ సమస్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎందుకు స్పందిం చడం లేదని కూనంనేని ప్రశ్నించారు. రాష్ట్రానికి వచ్చిన ఆయన రైతు సమస్యలు, కరవు నివారణ చర్యలపై ఒక్క ప్రకటన కూడా చేయలేదని విమర్శించారు. ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి పోటీగా బీజేపీ నిర్వహిస్తున్న పాదయాత్ర రాజకీయ ప్రయోజనాల కోసం చేపట్టినదేనని వ్యాఖ్యానించారు. కోట్లాది ఓట్లు తొలగించారన్న ఆరోపణలపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ప్రమాదానికి గురైన ఆర్‌టీసీ మహిళా కండక్టర్‌కు మెరుగైన వైద్యం అందించడంలో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. మృతురాలి కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ ఇవ్వాలని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలకు జీవో 58 ప్రకారం ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించాలని కోరినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న సుమారు మూడు లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. అగ్రిగోల్డ్ సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసు కుని విక్రయించడం ద్వారా బాధితులకు సొమ్ము తిరిగి చెల్లించాలని కోరామన్నారు. ఈ అంశంపై సీనియర్ ఐపీఎస్ అధికారి చారుసిన్హా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి పరిశీలిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు కూనంనేని తెలిపారు. దీనిపై కూడా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, ఈ అంశాన్ని అసెంబ్లీలోనూ ప్రస్తావిస్తానని చెప్పారన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు
రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని సీపీఐ నిర్ణయించినట్లు కూనంనేని వెల్లడించారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రాంరెడ్డి సర్వోత్తమరెడ్డికి, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రామ్మోహన్‌రెడ్డికి మద్దతు ప్రకటించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టి.నరసింహ, కార్యదర్శివర్గ సభ్యులు వి.ఎస్.బోస్, రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావు, ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు