విశాలాంధ్ర ` శంఖవరం: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి వద్ద జాతీయ రహదారిపై గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు భవానీ భక్తులు మృతి చెందారు. విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన 31 మంది భవానీ భక్తులు, 8 మంది సాధారణ భక్తులతో కలిసి తమ మొక్కులు చెల్లించేందుకు ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో బయలుదేరారు. కత్తిపూడి వద్ద వారు ప్రయాణిస్తున్న బస్సులో సాంకేతిక లోపం తలెత్తింది. భవాని భక్తులు టీ తాగేందుకు బసు దిగి రోడ్డు పక్కనే ఉన్న దుకాణంకు వెళ్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి ఏడుగురు భవాని భక్తులతో విజయవాడ దుర్గమ్మ గుడికి వెళ్తున్న స్కార్పియో వాహనం అతివేగంగా నడుచుకుంటూ వెళ్తున్న భవానీ భక్తులు, లారీ డ్రైవర్‌ను ఢీకొట్టింది. ముగ్గురు భవానీలు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలైన మరో భక్తుడిని హైవే అంబులెన్సులో ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ ఏబీజీ తిలక్, సీఐ బి.సూర్యఅప్పారావు, అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతులను సిరిగిడి ఎర్రయ్య (38), తంలింగాల సీతారాం (45), తాటిపూడి వరప్రసాద్ (40), బోనెల రమణ సత్తిబాబు (40)గా గుర్తించినట్టు డీఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతులను ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలిస్తున్నట్టు చెప్పారు. అనంతరం మృతదేహాలను వారి బంధువులకు అందజేస్తామని, తమ గ్రామాలకు తీసుకుని వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తామని పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో భవానీ దీక్షలో ఉన్న నలుగురు మృతి చెందటంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడ కనకదుర్గ దర్శనం కోసం వస్తున్న భవానీ భక్తులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం అత్యంత బాధాకరమన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపి, ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
- Advertisement -
RELATED ARTICLES


