Homeఅంతర్జాతీయంక్యూబాకు అంతర్జాతీయ మద్దతు

క్యూబాకు అంతర్జాతీయ మద్దతు

- Advertisement -

. అమెరికా దిగ్బంధనానికి వ్యతిరేకంగా 130 దేశాల ఓటు
. ఐరాసలో 34వ సారి తీర్మానం
. క్యూబా కాదు… దిగ్బంధనమే అసలు ముప్పు: డియాజ్-కానెల్

న్యూయార్క్/హవానా: క్యూబాపై అమెరికా ఆర్థిక, వాణిజ్య దిగ్బంధనాన్ని ప్రపంచ దేశాలు వ్యతిరేకించాయి. ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతూ ఐక్యరాజ్యసమితి (ఐరాస) సర్వసభ్య సమావేశం (యూఎన్జీఏ) మరోసారి తీర్మానాన్ని ఆమోదించింది. 1992 నుంచి ఇదే అంశంపై ఐరాసలో తీర్మానం చేయడం ఇది 34వసారి. ప్రస్తుతం 130 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా, 17 దేశాలు వ్యతిరేకించాయి. మరో 25 దేశాలు ఓటింగ్‌కు దూరంగా నిలిచాయి. గత ఏడాది అనుకూలంగా 165 ఓట్లు రాగా, ఈసారి ఆ సంఖ్య తగ్గింది. అమెరికా తీవ్ర దౌత్యపరమైన ఒత్తిళ్లు, బెదిరింపులు ప్రయోగించిన నేపథ్యంలో ఈ ఓటింగ్ జరిగింది. తమకు అండగా నిలిచిన దేశాలకు క్యూబా అధ్యక్షుడు మిగుల్ డియాజ్`కానెల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పరిణామాన్ని క్యూబా ప్రజల విజయంగా అభివర్ణించారు. ఓటింగ్ ఫలితాన్ని మార్చేందుకు అమెరికా బహిరంగ ఒత్తిళ్లు, బ్లాక్మెయిల్కు పాల్పడినప్పటికీ ప్రపంచ దేశాలు దిగ్బంధనానికి వ్యతిరేకించి, తమకు అండగా నిలిచాయంటూ ఆయన సామాజిక మాధ్యమంగా పేర్కొన్నారు. ‘ఆర్థికంగా ఊపిరాడనివ్వని పరిస్థితులు, బెదిరింపులు, అమెరికా ప్రభుత్వ దురాగతాల మధ్య లొంగుబాటుకు అంగీకరించని వీరోచిత క్యూబా ప్రజల విజయమిది. అబద్ధాలు, బెదిరింపులతో ఒక దేశ ప్రజలందరినీ సామూహిక శిక్షకు గురిచేయాలనుకునే శక్తులపై సత్యం సాధించిన విజయమిది. క్యూబా ముప్పు కాదు… దిగ్బంధనమే అసలు ముప్పు’ అని కానెల్ పేర్కొన్నారు. ఇదిలావుంటే, ఐరాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని లేదా ఓటింగ్‌కు దూరంగా ఉండాలని అనేక దేశాలపై అమెరికా దౌత్యపరంగా ఒత్తిడి తెచ్చినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. అమెరికా ఒత్తిళ్ల నేపథ్యంలో జర్మనీ, ఇటలీ, లాత్వియా తదితర దేశాలు తమ వైఖరిని మార్చుకున్నాయి. గత ఏడాది 165 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా, ఈసారి 130 దేశాలే మద్దతు తెలిపాయి. ఓటింగ్‌కు ముందు ఐరాసలో అమెరికా రాయబారి మైక్ వాల్ట్¨, క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగెజ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. క్యూబాపై ఆంక్షలను సమర్థించిన అమెరికా వైఖరిని క్యూబా ప్రతినిధులు వ్యతిరేకించారు. కాగా అమెరికా ఆంక్షలు, ఇంధన సరఫరాపై ఆంక్షల తీవ్రత పెరగడంతో క్యూబా ఆర్థిక, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. విద్యుత్ కోతలు, ఇంధన కొరత, ఆహారం, నీటి సరఫరాలో సమస్యలు ప్రజల దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు వంటి అత్యవసర రంగాలపైనా ఈ పరిస్థితుల ప్రభావం పడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలు ఈ ఒత్తిడిని మరింత పెంచాయని వార్తా నివేదికలు పేర్కొన్నాయి. క్యూబాపై ఆర్థిక ఆంక్షలు ఎత్తివేసి, ఆ దేశ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలన్న డిమాండ్ మరోసారి ఐరాస వేదికపై ప్రతిధ్వనించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు