గత శతాబ్దిలో 30వ దశకం. ఓ సాయంకాలం రాజమండ్రి స్టేషన్ నుంచి ఒక సంస్కృతాంధ్ర పండితుడు వడివడిగా బజారు వైపునకు నడిచి వెళుతున్నారు. అంతలో శ్రీరాముల సచ్చిదానంద శాస్త్రి అనే నాటక కర్త ఆయనకు ఎదురుపడి, “నేను రాసిన సావిత్రి నాటకం మైలవరం సమాజం వారు ఈ రాత్రి ప్రదర్శిస్తున్నారు. మీరు ఎలాగైనా వచ్చి చూడాలి!” అంటూ ఆయనను కోరారు.
“ఈవేళ నాకు జరుగురు పని ఉంది! అందువల్ల మరో మాటు వస్తాలెండి!” అంటూ బదులిచ్చారు ఆ పండితుడు.
అంతలోనే “ఓ…మీరేనా…ఫలానా… కవి గారు…” అంటూ సింహ గర్జన లాంటి పిలుపుతో, ఎర్ర శాలువ బుజాన వేసుకుని ఒకాయన అక్కడికి వచ్చి,” నేను చెళ్లపిళ్ల వెంకట శాస్త్రిని లెండి..!” అంటూ కొంత వెటకారంగా చెప్పారు .
శాస్త్రి కంటే వయసులో ఎంతో చిన్నవారైన పండితుడు వినయంగా,” నమస్కారం!” అన్నారు.
సమాధానంగా చెళ్లపిళ్లవారు ఆశీర్వదించలేదు సరి కదా తిట్లు లంకించుకున్నారు.
“నా పుస్తకాన్ని నువ్వు విమర్శిస్తావా!” అంటూ రంకెలు వేశారు.
ఇక లాభం లేదని పండితుడు కూడా, “ఆకాశం నుండి ఊడిపడ్డాయేమిటి మీ పుస్తకాలు?..” అంటూ ఆయన్ని ఎదుర్కొన్నారు.
“సభ చేయిస్తాను, వస్తావా?” అంటూ గర్జించారు చెళ్లపిళ్లవారు. “మగతనం ఉంటే చేయవలసిన పని అది!! Å£Œ”ద్ర జాతి మనుషుల్లాగా ఈ తిట్లు ఏమిటి?” అని పండితుడు మండిపడ్డారు.
కాలెత్తి తన కాళ్ల చెప్పు చూపించి,” ఇదేమిటో చూసావా?” అన్నారు చెళ్లపిళ్లవారు.
“సరదాగా ఉంటే…రా!” అంటూ తన ఎడంకాలు ఎత్తి చూపించారు ఆ పండితుడు.
అప్పటికే చుట్టూ చేరిన వారు, వారిని దూరంగా పంపించేశారట!
మా పెద్ద నాన్న గారయిన, గద్వాల ఆస్థాన కవి ద్విభాష్యం వెంకట్రావు మాకు ఈ విషయం బాల్యంలో చెబుతూ, “ఆ పండితుడు ఎంతో సంస్కారవంతుడు! కానీ ఏదైనా ఓ మేరకే సహిస్తాడు! అది దాటితే కొరకరాని కొయ్యే అయిపోయేవాడు!!” అంటూ వివరించేరు.
అయితే హఠాత్తుగా జరిగిన ఈ అసందర్భానికి ఆ పండితుడు కూడా తర్వాత ఎంతో చింతించారుట!! ఆ పండితుడే, సంస్కృతంలో తప్ప తెలుగులో రాయడం అంటేనే ఎంతో చిన్న చూపు చూసే రోజులలో: తెలుగులో అలతి అలతి పదాలతో, అందమైన సన్నివేశాలతో, అద్భుతమైన సంభాషణ్ల ద్వారా, ఆయా వ్యక్తులు హావభావాలను చిత్రిస్తూ అమోఘమైన తెలుగు కథలల్లి భాషకు కొత్త సొగసుల అత్తరు పరిమళాలద్దిన కథా చక్రవర్తి, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి!!
ఆత్మగౌరవాన్ని నిలుపుకునేందుకూ, తాను నమ్మిన సత్యాన్ని ఆచరించేందుకూ, ఏనాడూ ఎవరికీ తలవంచని ధీరోదాత్తుడాయన!! ఆయన రాసిన వడ్ల గింజలు, కలుపు మొక్కలు, గులాబీ అత్తరు లాంటి కథలు అన్నీ నేటికీ తెలుగు కథల తోటలో సువాసనలు వెదజల్లుతూనే ఉన్నాయి!
పండిత వంశంలో లక్ష్మీపతి సోమయాజులు, మహాలక్ష్మీ సోదెమ్మ దంపతులకు 1891 ఏప్రిల్ 23న, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం దగ్గరలోని పాలమూరు గ్రామంలో జన్మించినా… తర్వాత నివాసం రాజమహేంద్రవరమే అయింది.!
బాల్యంలో శ్రౌత స్మార్తములు అధ్యయనం చేసినా… జ్యోతిష్య శాస్త్రంలో స్కంధ త్రయం పఠించినా… దర్భా భైరాగి శాస్త్రి దగ్గర సంస్కృత కావ్యాలు వల్లెవేసినా… శ్రీపాద వారి మనసు మాత్రం అన్నివేళలా తెలుగు భాష మీదనే ఉండేది!
తెలుగు పుస్తకాలు చదువుతున్నట్లు లేదా తెలుగులో పద్యాలు కథలు రాస్తున్నట్లు కనపడితే చాలు… ఆయన తండ్రి ఆయన మీద విరుచుకు పడేవారు. ఆయనో అగ్నిోత్రావధానులు!!
ఆయనకు సంస్కృతం చదువులు తప్ప తెలుగు చదువులు సుతరాము కిట్టేవి కాదు. అయినా పట్టు వదలని విక్రమార్కుడు శాస్త్రి!! తన ఇష్టాలను మానుకోలేదు! చాటుగానైనా తెలుగు చదవడం, రాయటం మానలేదు. అంతేకాకుండా ఈ సాహితీ వ్యవసాయంలో తగిన గురువు కోసం అన్వేషణ సాగించి చివరకు వెంకట రామకృష్ణ కవులను ఆశ్రయించారు. వారు కూడా శ్రీపాద వారిని ఎంతో ప్రేమతో శిష్యునిగా స్వీకరించారు.
శ్రీపాద వారి తొలి రచన ‘వారకాంత’ అనే నాటకం. మొదటి నవల ‘మిధునానురాగము’. మొదటి కథ ‘ఇరువురం ఒక్కచోటకే పోదము’. 1924 వరకు వారి రచనలు గ్రాంథికంలోనే సాగాయి. తర్వాత వ్యవహారిక భాషలో రాయటమే కాకుండా వ్యావహారిక భాషా ఉద్యమానికి తన అండదండలందించారు ఆయన.
‘ప్రభుధ్ధాంద్ర ‘అనే పక్షపత్రిక నడపటం ప్రారంభించి, దానిని తర్వాత మాసపత్రికగా రూపుదిద్దారు. 1934 తర్వాత తన పత్రికలో కూడా పద్య రచనలను నిషేధించి కేవలం వచన రచనల ప్రచురణ మాత్రమే కొనసాగించారు. ఈ రకంగా వచన వాంగ్మయం ప్రచారంలోకి రావడానికి ప్రభుధ్ధాంద్ర చాలా ఉపకారం చేసింది.
ఇల్లు పట్టిన వెధవాడబడుచు, విమానం ఎక్కబోతూను, కలుపు మొక్కలు, అన్నంతపనీ జరిగింది, తాపీ మేస్ర్తి రామదీక్షితులు బిఏ, ఇలాంటి తవ్వాయి వస్తే,… మొదలైన అద్భుతమైన కథలు 50 కి పైగా రాశారు ఆయన. మరో 22 కథలు అలభ్యం.
ప్రేమ పాశం, నిగడ బంధం రాజరాజు మొదలైన నాటకాలను: అభిసారిక, అలంకృతి మొదలైన ఖండకావ్యాలను రాశారు.
ఆనాటి తెలుగు కుటుంబాల ఆచార వ్యవహారాలు, పల్లె ప్రజల జీవన విధానాలు, పల్లె ప్రజల పలుకుబడులు, సామెతలు ఇత్యాది విషయాలన్నీ మన కళ్లెదుట సాక్ష±త్కారింపజేసే అత్యద్భుతమైన తెలుగు కథలు అవి! తెలుగువారి కథలవి!!
శ్రీపాద వారు అష్టావధానాలు చేశారు. కళ్ఙాóవర్ధినీ నాటక సమాజం స్థాపించి, అనేక నాటకాలు ఆడారు. ఆడించారు. గంధర్వ ఫార్మసీ పేరుతో ఆయుర్వేద మందులు తయారు చేశారు. అయితే ఇవేవీ ఆయన జీవితంలో ఆర్థికంగా సహాయ పడలేదు. చివర రోజుల్లో దారిద్య్రం అనుభవించారు ఆయన.
ఆయన ఓ సందర్భంలో పురిపండా అప్పలస్వామికి రాసిన ఉత్తరం చదివితే సాహితీపరుల గుండె ద్రవించిపోతుంది. “…కాశీనాధుని నాగేశ్వరరావుకు నేను నాలుగు వేల చిల్లర బాకీ!! నా కథల పుస్తకాలు మొత్తం ఆయనకి ఇచ్చేసి, నన్ను రుణవిముక్తుడిని చేయండి… ఇంకా ఏమైనా మిగిలితే, నా భార్యకి ఇవ్వండి. మందులకు, చికిత్సకు నాకు డబ్బు కావాలి… ఈనెల ఇంటి అద్దె ఇంకా ఇవ్వలేదు… ఇలాంటి స్థితిలో నేను భారం అయిపోతున్నాను. మరో జన్మ ఎత్తి అయినా రుణం తీర్చుకుంటాను. నా భార్య నన్ను అనేక విధాల కాపాడింది కానీ దాన్ని సుఖపెట్టలేకపోయాను …నిరర్థక జన్మ అయిపోయింది నాది….” ఇలా సాగుతుందా ఉత్తరం!
‘తన జాతి వారికి సభ్యత అలవడ చేయడమూ, అది తప్పిపోకుండా చూడటము… ఇది రచయిత యొక్క ముఖ్య బాధ్యత!!…. అని నమ్మిన శ్రీపాద వారు 1961 వ సంవత్సరం ఫిబ్రవరి 25న స్వర్గస్తులయ్యారు.
సెల్: 94403 18415
చెళ్లపిళ్లనే నిలదీసిన శ్రీపాద
- Advertisement -


