‘తరం మారే యుగం మారే/తలరాతలు మారలేదు/సంస్కరణలు ఎన్నొచ్చిన/సంఘంలో మార్పులేదు…’ అంటూ మారని సమాజస్థితిని చూసి మార్పుకోసం పాటలను అస్త్రాలుగా మలిచి సాహితీ సృజన చేస్తున్న అభ్యుదయ రచయిత కలువకోలు మద్దిలేటి. నల్లమల నగారాగా మోగుతున్న ‘జనమంచు పల్లె’ పాటల సంపుటి ఇది.
పాట అంటే సంగీతంతో కలిసి పాడదగిన కవితా భావాలను లయాత్మకంగా వ్యక్తపరిచే సాహిత్య రూపం.పాటను, గేయం అనికూడా అంటారు. ఐతే రెండింటి మధ్య చిన్న సరిహద్దు రేఖ ఉంది. పాడబడేది పాట కాగా పాడదగినది మాత్రమే గేయం. పాటకు పల్లవి, అనుపల్లవి (ఐచ్ఛికం), చరణాలు నిర్ధిష్ట పాదాలసంఖ్యతో ఉంటాయి. ప్రతి చరణానికి ముగింపులో పల్లవి పునరా వృతం అవుతుంది. గేయంలో ఈ నిర్దిష్టత నిబంధన ఉండవచ్చు, లేకపోవచ్చు.
పాట ప్రజల భావాలు, జీవన అనుభవాలు, ఆనందం-వేదనలను, సమస్యల విముక్తి కోసం ఉవ్వెత్తున లేచే అలజడి, ఆందోళన, ఉద్యమాలను చైతన్య ప్రేరకంగా వ్యక్తపరిచే సాహిత్య ప్రక్రియ. గుణాన్ని పట్టి జనాన్ని మత్తులో నిద్రపుచ్చే పాటలు, నిద్రలేపే మేల్కొలుపు పాటలుగా చెప్పవచ్చు. ఈ మేల్కొలుపు పాటల సమాహారమే కలువకోలు మద్దిలేటి వనమంచు పల్లె పాటల సంపుటి. ప్రపంచవ్యాపితంగా వస్తున్న ప్రపంచీ కరణ,పెట్టుబడిదారీ పరిణామాల, ఫలితంగా పాలక వర్గాల స్వార్థపూరిత దోపిడీ స్వభావాల మూలంగా సమాజంలో సమస్యలు కోకొల్లలుగా పుడుతున్నాయి. నిరుద్యోగం, బీదరికం, అవినీతి, అక్రమాలు, అణచివేతలు, ప్రజాస్వామ్య హననాలు, మానభంగాలు, మర్డ్ర్లు, ఒక్కటేమిటి చుట్టూ సమస్యల సముద్రమే. ఈ నేపథ్యంలో ప్రజలు సమస్యల విముక్తి కోసం నిత్యం పెనుగు లాడుతూ ఏదో ఒక రూపంలో తమ నిరసనను,ఆందోళనను వ్యక్తపరస్తూనే ఉన్నారు. ఈ సమస్యలన్నీ వస్తువులుగా నల్లమల అడవుల అంచులో ఉన్న పల్లెలోని కలువకోలు మద్దిలేటి పాటలు చైతన్య ప్రేరకాలై నల్లమల నగారాలుగా ధ్వనిస్తున్నాయి. ఇందులో ఒక్కొకక్క సమస్యను ఒక్కొకక్క ఇతివృత్తంగా ఒక్కొకక్క బాణీలో అల్లిన పాటలు వైవిధ్యంగా సాహిత్య పరిమళాలను వెదజల్లుతాయి.
పల్లె తల్లి మాటల్లో పాటలైనరా/జనం గుండె చప్పుడులో డప్పులైనరా-అనే పాటలో, కుళ్లిపోయిన రాజ్యం, కూలీ తల్లుల శోకం, ఉద్యమాల్లో ఒరిగిన వీరులు, రైతుపడే గోసలు, పల్లెలు వదిలి పట్నం వలసపోయె వారి దయనీయ బతుకులు, ఇలా అన్నిటిని వస్తువులుగా చేసుకొని, చిలుక పలుకుల మెలకువలు నేర్చుకొని పాటలల్లినానని తన శ్రామిక వర్గ పక్షపాత నిజాయితీని చాటుకున్నాడు.
నడూ నడూ నాగులన్న/నల్లమలకు నాగులన్నా- అనే పాటలో నల్లమల సింగిడి అందాలను దృశ్యమానంచేస్తూనే, యురేనియం కొరకు దానిని విధ్వంసం చేస్తూన్నారని, ఆ ప్రయత్నాలను ప్రతిఘటించాలనే పిలుపునిస్తాడు.
అందమైన చందమామమ్మా-నా ఆడపిల్ల…/అంతులేని బాధలోయమ్మా -నా ఆడపిల్ల… అనే పాటలో పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఆడపిల్లను ఇంటిపనులు, బయటిపనులకు పరిమితంగా బానిసను చేసి పితృస్వామ్యం అణచివేస్తున్న క్రమాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు.
ఏం పాడుదురా మా పేదోళ్ల బతుకు పాట/ఏం చెప్పుదురా మా పేదోళ్ల బతుకుబాధ-అనే పాటలో, బీదరికంతో అల్లాడి పోతున్న బతుకుల దైన్యస్థితిని హృదయవిదారకంగా చిత్రించాడు.
జన్మ జన్మాల్లో అమ్మ జన్మే/అపురూపమైనది అమ్మ జన్మే… అంటూ బిడ్డ పుట్టినప్పటి నుండి ఏవిధంగా పెంచి పెద్దచేసి, తన జీవితాన్ని దారబోసి త్యాగధనురాలవుతుందో, అమ్మ గొప్పతనాన్ని గొప్పగా కీర్తించాడు.
పొద్దున బువ్వుంటే మాపున బువ్వుండదు/పూటలెట్ల గడుసునో ఫుట్‌పాత్ బతుకుల్లో…అనే పాట పట్టణాల్లో ఫుట్‌పాత్‌ల మీద బతుదెరువు కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటున్న జీవితాల్ని చిత్రిస్తూ కన్నీరు పెట్టిస్తుంది.
ఇల నీకు సాటెవ్వరు ఓఓ నాన్న…/ఇలా నీకు సాటెవ్వరో నాన్న…అనే పాటలో కుటుంబం కోసం, పిల్లల ఉన్నతి కోసం నాన్న పడే కష్టాలను, త్యాగాన్ని, గొప్పతనాన్ని చాటిచెప్పాడు.
సఫాయన్నలో మీకు సలామన్నలో…/అంటరాని రూపాలు ఆమని అందాలు…అనే పాటలో తమ జీవితాల్ని ఫణంగా పెట్టి ఊరు విసర్జించే మలినాల్ని ఎత్తిపోసి పట్టణాల్ని పరిశుభ్రంగా అందంగా ఉంచే అంటరాని రూపాలు సఫాయి కార్మికులని ఆవేదన చెందుతూ వారి మురికి జీవితాల వ్యాధులు, కన్నీటి విషాద గాధను ఎంతో హృద్యంగా చిత్రించాడు.
డ్రైవరన్నా డ్రైవరన్నా ఓ డ్రైవరన్నా/దైవానికి ప్రతిరూపం మాడ్రైవరన్నా… అనే పాటలో ప్రయాణీకులను సురక్షితంగా గమ్యానికి చేర్చే దైవ స్వరూపుడని ఆయన జీవితాన్ని చక్కగా చూపించాడు.
ఊరూరు తిరిగేటి ఓరన్నా సంచారి/ఊరుపేరు ఏదంటే ఉబికివచ్చే కన్నీరే….అనే పాట ఊరు, పేరు, ఉండడానికి గరీËడు కూడాలేని ఊరూరు తిరిగి జీవనం సాగించే సంచార కులాల విషాదభరిత బతుకు కన్నీటి గాథను, స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా ఇంకా వీరు బతుకులు మారని దుస్థితి చూపి ఆలోచింపజేస్తుంది.
బాబా నీకువందనం బాపు నీకువందనం…/బాబాసాహెబ్ మీకు వందనం….అనే పాటలో అంబేద్కర్ రాజ్యాంగంవల్ల దళిత, బడుగు, బలహీన వర్గాలకు జరిగిన న్యాయం, దాని గొప్పతనం గురించి చక్కగా చిత్రించాడు. తన వనమంచు పల్లె అందాలను, గొప్పతనాన్ని, కొల్లాపురం గొప్పతనాన్ని, జ్ఞాన పుష్పం పుస్తకం యొక్క చైతన్య దీప్తిని, నిస్వార్థానికి మారుపేరుగా నిలిచిన పౌరహక్కుల సామాన్య జీవితాల్ని, హీనంగా వచ్చినోళ్ల హీరోలుగా అందంగా తయారు చేసే మంగళి వృత్తి గురించి, రైతుల దైన్యస్థితి గురించి, లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్న కరోనా మహమ్మారి గురించి, కళాకారుల జీవితం గురించి, రాజకీయాల గురించి, కాశ్మీర్లో ఉగ్రవాదం గురించి, విద్యార్థులను తీర్చిదిద్దే పంతులమ్మ గురించి, ప్రజోద్యమాల్లో ఒరిగిన వీరుల గురించి… ఇలా విభిన్నమైన వస్తువును తీసుకొని రాసిన 45 పాటలు ఇందులో ఉన్నాయి.
వస్తువు, వస్తువుకు తగ్గ బాణీ, భాష, ప్రతీకల పొందికలో పాటలు రాస్తూ తన స్వంత గొంతును వినిపిస్తూ ఎదుగుతున్న రచయిత మద్దిలేటి. ఐతే శబ్ద, అర్థ, లయల సమన్వయం అక్కడక్కడ లోపించినా పాట, గేయం వాటి సరిహద్దు రేఖను దాటినా, కొన్ని దీర్ఘపాటలుగా పాట లక్షణాలను అతిక్రమించినా, విభిన్న జీవితాలను, వారి సమస్యలను, ఆందోళన, అలజడులను వస్తువుగా తీసుకొని రాసిన, అందరు చదవదగిన, కళాకారులు పాడదగిన చక్కని పాటల సంపుటి ఇది.
-వేల్పుల నారాయణ, 9440433475
నల్లమల నగారా ‘జనముంచు పల్లె’పాటలు
- Advertisement -


