అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లాటిన్ అమెరికాలో తన ఆధిపత్యం కొనసాగించడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా బ్రెజిల్ ఎన్నికల్లో లూలా నాలుగో సారి ఘన విజయం సాధించారు. అమెరికా బంటుగా వ్యవహరించిన లూలా ప్రత్యర్థి ఫ్లవియో బోల్సెనారో చిత్తుగా ఓడిపోయారు. మొదటి రౌండ్లో ఫలితం తేలకపోవడంతో రెండో రౌండ్ ఎన్నికలు నిర్వహించారు. అందులో లూలా ఘన విజయం సాధించారు. లాటిన్ అమెరికాలోని అనేక దేశాలు ట్రంప్ కొమ్ము కాస్తున్న తరుణంలో లూలా విజయం బ్రెజిల్ పైనే కాకుండా ఇతరత్రా విపరీతమైన ప్రభావం చూపుతుంది. బ్రెజిల్లో ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి మార్గం సుగమం అయింది. అయితే రాజకీయంగా చీలిపోయి ఉన్న బ్రెజిల్‌ను ఏకీకృతం చేయడం లూలాకు పెద్ద సవాలే. బ్రెజిల్ పరిపాలనా విధానాన్ని మార్చేస్తానని, నిర్ణయాలు తీసుకోవడంలో ప్రజల భాగస్వామ్యం ఉంటుంది అని లూలా వాగ్దానం చేశారు. బ్రెజిల్ ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వేళ నాలుగోసారి లూలా అధికారంలో కొనసాగబోతున్నారు. ప్రభుత్వ రుణాలు పెరిగిపోవడంవల్ల సంక్షేమ కార్యక్రమాల అమలుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. వడ్డీ రేట్లు మిన్నంటుతున్నాయి. బ్రెజిల్ కాంగ్రెస్ (పార్లమెంటు)లో లూలా గట్టి ప్రతికూలతను ఎదుర్కోక తప్పదు. ఈ నేపథ్యంలో తాను దేశవాసులందరినీ దృష్టిలో ఉంచుకుని పరిపాలన కొనసాగిస్తానని లూలా హామీ ఇచ్చారు. లూలా విజయం సంక్షేమ కార్యక్రమాలపై ఆశలు చిగురింప చేస్తోంది. ట్రంప్ కుటిల రాజకీయాలను ఎదుర్కోవడం ఎటూ తప్పదు. కానీ ప్రజల మద్దతు లభించినందువల్ల చేసిన వాగ్దానాలను నెరవేర్చగలిగితే బ్రెజిల్లో వినూత్న పరిణామం సాకారం అవుతుంది. మొత్తం అమెరికాలోనే ప్రజాస్వామ్యం మనగలిగేలా చేయగలిగే సత్తా లూలాకు వస్తుంది. మొదటి రౌండ్ ఎన్నికల్లో లూలా ప్రత్యర్థి ఫ్లవియో బోల్సనారో కన్నా 20 లక్షల ఓట్లతో వెనుకబడ్డారు. పాత పద్ధతుల్లో లూలా కొనసాగించిన ప్రచారం దీనికి ప్రధాన కారణం అనుకున్నారు. ఆన్లైన్ యుగంలో లూలా ప్రచారం పాతబడిందిగా కనిపించింది. కానీ రెండో రౌండ్ ఎన్నికలలో ప్రచార సరళి పూర్తిగా మారిపోయింది. విస్తృత జనసమీకరణ చేయగలిగారు. పేదల, కార్మిక సంఘాల, పౌర సమాజ మద్దతు కూడగట్టడంలో లూలా సఫలమయ్యారు. డిజిటల్ రూపంలో ప్రచారాన్ని సంపూర్ణంగా వినియోగించుకున్నారు. రెండో విడత ప్రచారంలో లూలా సామర్థ్యం మీద కన్నా ప్రత్యర్థి బోల్సనారో గెలిస్తే ఎదురయ్యే ముప్పు ఏమిటో బాగా ప్రచారంలో పెట్టగలిగారు. బోల్సెనారో గెలుపు రాజ్యాంగానికి, పర్యావరణానికి ఎంతటి ప్రమాదం తేగలుగుతుందో వివరించి చెప్పగలిగారు. దీనితో బొల్సెనారో పై ఓటర్లలో విముఖత పెరిగింది. బోల్సెనారో ఎంతటి నియంతగా ఉంటారో వివరించగలిగారు. రెండవ విడత ప్రచారంలో డిజిటల్ రూపంలో ప్రభావపూరితమైన ప్రచారం కొనసాగించడానికి ఆండ్రే జనోన్స్, పార్లమెంట్ సభ్యుడు ఎరికా హిల్టన్ తోడ్పాటు చాలా ఉంది. విచిత్రం ఏమిటంటే వీరిద్దరూ లూలా వర్కర్స్ పార్టీతో ఏ సంబంధమూ లేని వారే. వీరు అంతగా బలం అలెని వామపక్షానికి చెందిన వారు. కానీ లూలాకు వామపక్ష వాదిగా పేరుంది. ఆండ్రే జనోన్స్, పార్లమెంట్ సభ్యుడు ఎరికా హిల్టన్ ప్రచార సరళి ప్రజాభిప్రాయాన్ని లూలాకు అనుకూలంగా మార్చడంలో బాగా ఉపకరించింది. మొదటి రౌండ్లో లూలాకు ఓటు వేయని వారు, లేదా ఓటు హక్కు వినియోగించుకోని వారు కూడా ఈ తరహా ప్రచారంవల్ల లూలాకు అనుకూలంగా మారారు.
డిజిటల్ రూపంలో ప్రచారం రెండో రౌండ్లో లూలాకు బాగా అనుకూలించింది. వివిధ సామాజిక మాధ్యమాలలో లూలా అనుకూల ప్రచారం ఉధృతం అయింది. సామాజిక మాధ్యమాలు అందుబాటులో ఉన్న వారందరికీ లూలా ప్రచారం చేరింది. అంతర్జాతీయ సమాజంలో లూలాకు చాలా గౌరవ స్థానం ఉంది. లూలా గత మూడు విడతల పాలనలో సకల సమస్యలను పరిష్కరించలేక పోయినా ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయగలిగారు. అధిక అసమానతలు తగ్గించగలిగారు. బ్రెజిల్ ఆకలి రాజ్యాల జాబితా నుంచి బయట పడేట్టు చేయగలిగారు. శీతోష్ణ స్థితి మార్పు విషయంలో లూలా అనేక సానుకూల నిర్ణయాలు తీసుకోగలిగారు. అమెజాన్ అడవులను యదేచ్ఛగా నరకడాన్ని నిరోధించగలిగారు. దశాబ్దాల కాలం నుంచి చూస్తే ఇంత సానుకూలత ఎన్నడూ లేదు. అయితే ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో లాగే బ్రెజిల్‌లోనూ జీవన ప్రమాణాలు ఆందోళనకర స్థాయిలోనే ఉన్నాయి. వ్యవస్థీకృత నేరాలు పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా కొంత మంది బోల్సెనారో వైపు మొగ్గారు. ఈ విలోమ ధోరణులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బోల్సెనారో తరఫున అనుకూల ప్రచారం చేయడానికి వినియోగించుకున్నారు. ఇదే పద్ధతిలో అర్జెంటీనాలో మితవాది అయిన జేవియర్ మిలేయ్, ఎల్ సాల్వెడార్లో నయిబ్ ముకెలెను ప్రతిష్ఠించడంలో ట్రంప్ సఫలమయ్యారు. వీరంతా కలిసి పెరు, కొలంబియాలో మితవాదులది పై చేయి కావడానికి కారకులయ్యారు. బోల్సెనారో బ్రెజిల్లో ఉన్న విలువైన ఖనిజాలను అమెరికాకు అప్పగించడానికి సిద్ధమైన తీరును లూలా సమర్థంగా ఎండగట్టగలిగారు. నాలుగోసారి అధ్యక్ష స్థానం చేపట్టబోతున్న లూలా పొరుగున ఉన్న మితవాద ప్రభుత్వాలను, అమెరికా ఒత్తిడిని ఎదుర్కుని నిలబడగలగాల్సి ఉంటుంది. బ్రెజిల్ పార్లమెంటులో బోల్సెనారో మద్దతుదార్లు ఎక్కువ మంది ఉండడం లూలాకు పెద్ద సవాలే. ఇదివరకు రాజ్యాధినేతగా ఉన్న సమయంలో సంప్రదింపుల ద్వారా పేదల అనుకూల సంస్కరణలు ప్రవేశపెట్టడం లూలాకు సాధ్యమైంది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉంటుందన్న హామీ లేదు. 2002లో లూలా మొదటిసారి దేశాధినేత అయిన నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. పరిస్థితుల్లో విపరీతమైన మార్పు వచ్చింది. అందువల్ల లూలా విధానాలలో సమూలమైన మార్పులు అనివార్యం. అయితే లూలా మొదటిసారి అధ్యక్షడైనప్పటి నాటికంటే ఇప్పుడు బ్రెజిల్లో విద్యావంతుల సంఖ్య బాగా పెరిగిపోయింది. దీనికి లూలా అనుసరించిన విధానాలే కారణం. ఆహార భద్రత మరీ భయంకరమైన సమస్యగా ఇప్పుడు లేదు. అయితే ఎలాంటి సామాజిక భద్రతా లేకుండా పనిచేసే వారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వివిధ రంగాలకు సంబంధించిన విధానాల రూపకల్పనకు ప్రత్యేక కౌన్సిళ్లు ఉండేవి. బోల్సెనారో అధికారంలో ఉన్న సమయంలో ఇవి నిర్వీర్యమయ్యాయి. వీటిని లూలా పునరుద్ధరించినప్పటికీ వాటికి నూతనోత్తేజం కలిగించలేదు. ఇప్పుడు ఆ పని చేయక తప్పదు. ఎన్నికల ప్రచారంలో సమర్థంగా ఉపయోగించుకున్న సామాజిక మాధ్యమాలను పరిపాలనలోనూ వినియోగించుకోగలగాలి. జనంలో చీలికలను నివారించగలగాలి. ఆయన పరిపాలన ప్రభావం బ్రెజిల్‌కు ఆవల కూడా ప్రజాస్వామ్యం నెలకొనేలా చేయగలిగితే ఆయనకున్న కీర్తి ఇనుమడిస్తుంది. మొదటి రౌండ్లో ఓటమి పాలైన అభ్యర్థి రెండో రౌండ్లో విజయం సాధించడం బ్రెజిల్ చరిత్రలోనే మొదటిసారి. లూలా గెలుపులో ఆంద్రే జనోన్స్ పాత్ర తిరుగులేనిదే.
నాల్గోసారి లూలా విజయ ఢంకా
- Advertisement -


