Homeవిశ్లేషణనిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం టీవీ సుబ్బయ్య

నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం టీవీ సుబ్బయ్య

- Advertisement -

కాగితాల రాజశేఖర్

మనిషి గొప్పతనాన్ని అతను అధిరోహించిన పదవులు, సంపాదించిన సంపద, అనుభవించిన హోదాలు నిర్ణయించవు. తాను నమ్మిన విలువల కోసం ఎంత నిబద్ధతతో జీవించాడు, సమాజానికి ఎంత ఉపయోగపడ్డాడు, తన ఆలో చనలతో ఎంతమందిని చైతన్యపరిచాడు అన్నదే అసలైన కొలమానం. కొందరు వ్యక్తులు తమ జీవితకాలంలో పెద్దగా ప్రచారంలో లేకపోయినా, తమ ఆచ రణతో, అక్షరాలతో సమాజంపై చెరగని ముద్ర వేస్తారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో సీనియర్ జర్నలిస్టు, నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు టీవీ.సుబ్బయ్య ఒకరు. ఆయన జీవితం నిరాడంబరతకు నిర్వచనం. ఆయన రచనలు సామా జిక బాధ్యతకు ప్రతిబింబం. పర్యావరణ విధ్వంసం మానవాళి భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమిస్తుందని ముందుగానే హెచ్చరించిన అధ్యయనశీలి. ప్రకాశం జిల్లా మోక్షగుండం గ్రామంలో జన్మించిన టీవీ.సుబ్బయ్య విద్యార్థి దశ నుంచే అభ్యుదయ భావాల పట్ల ఆకర్షితులయ్యారు. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, మాజీ శాసనసభ్యుడు పూలసుబ్బయ్య జీవితం, ప్రజా ఉద్యమాల పట్ల నిబద్ధత టీవీ సుబ్బయ్యకు స్ఫూర్తినిచ్చాయి. ఆ స్ఫూర్తి టీవీ.సుబ్బయ్య జీవితాంతం కొనసాగింది. కమ్యూనిస్టు భావజాలాన్ని రాజకీయ సిద్ధాంతంగా కాకుండా, వ్యక్తిగత జీవితాన్ని నడిపించే నైతిక విలువగా స్వీకరించారు.
విశాలాంధ్ర దినపత్రికలో ఉపసంపాదకునిగా…
1976లో విశాలాంధ్ర దినపత్రికలో ఉపసంపాదకునిగా చేరడంతో టీవీ సుబ్బయ్య పాత్రికేయ ప్రస్థానం ప్రారంభమైంది. అది ఆయన జీవితంలో కీలకమైన మలుపు. అప్పటికే అభ్యుదయ భావాలతో ప్రభావితమైన ఆయనకు విశాలాంధ్ర ఒక ఉద్యోగ సంస్థగా మాత్రమే కాకుండా, తన ఆలోచనలను ఆచ రణలో పెట్టేందుకు అనువైన వేదికగా నిలిచింది. విశాలాంధ్రలో పనిచేయడాన్ని ఒక విప్లవ కర్తవ్యంగా భావించిన పాత్రికేయుల తరానికి టీవీ సుబ్బయ్య ప్రాతి నిధ్యం వహించారు. అనంతరం ఆయన ఆంధ్రజ్యోతి దినపత్రికలో పన్నెండేళ్ల పాటు పని చేశారు. అక్కడ కూడా తన పాత్రికేయ నైపుణ్యాన్ని, అధ్యయనశీల తను, వృత్తి పట్ల అంకితభావాన్ని కొనసాగించారు. ఆ తరువాత తిరిగి విశా లాంధ్రలో చేరారు. ఈ పునరాగమనం ఒక ఉద్యోగ మార్పు మాత్రమే కాదు. తన భావజాలానికి, తాను నమ్మిన విలువలకు దగ్గరగా ఉండాలనే ఆకాంక్షకు ప్రతీక. జర్నలిజం అంటే కేవలం జరిగిన సంఘ టనలను వార్తలుగా అందిం చడం కాదని భావించారు. సంఘటనల వెనుక ఉన్న కారణాలను అన్వేషించడం, సమస్యల మూలాలను విశ్లేషించడం, పాలకుల విధానాలను ప్రశ్నిం చడం, ప్రజలకు వాస్తవాలను తెలియజేయడం పాత్రి కేయుడి బాధ్యత అని విశ్వసించారు. ఆయన రచనల్లో సంచలనాల కంటే సత్యాన్వేషణకు, వ్యక్తుల కంటే సమస్యలకు, ప్రచారం కంటే ప్రజాప్రయోజనాలకు ప్రాధాన్యత కనిపిస్తుంది. టీవీ.సుబ్బయ్య రచనా జీవితంలో ప్రస్తావించాల్సిన అంశం పర్యావరణ పరిరక్షణ. అభివృద్ధి పేరుతో ప్రకృతిపై జరుగుతున్న దాడి, అడవుల విధ్వంసం, వాయు కాలుష్యం, భూతాపం, సహజ వనరుల దోపిడీ వంటి సమస్యలను ఆయన లోతుగా అధ్యయనం చేశారు. ప్రకృతి విధ్వంసానికి మూల్యం చెల్లించేది ప్రధానంగా సామాన్య ప్రజలేనని, పేదలు, శ్రమజీవులు, బలహీనవర్గాలేనని తన రచనల ద్వారా వివరించారు. అమెరికన్ భూగర్భ రసాయన శాస్త్రవేత్త వాలెస్ బ్రోకర్ 1975లో ‘గ్లోబల్ వార్మింగ్’ అనే పదబంధాన్ని శాస్త్రీయ చర్చలో విస్తృతంగా పరిచయం చేస్తూ, మానవ కార్యకలాపాల వల్ల వాతావరణంలో పెరుగుతున్న కార్బన్ డయాక్సైడ్ భూమి ఉష్ణోగ్రతలను గణనీయంగా పెంచుతుందని హెచ్చరించారు. అప్పటి నుంచి భూతాపం, వాతావరణ మార్పులపై ప్రపంచ వ్యాప్తంగా చర్చలు విస్తరించాయి. ఐక్య రాజ్యసమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ సమావేశాలు జరిగాయి. వివిధ దేశాలు కాలుష్య నియంత్రణకు, కరÒన ఉద్గారాల తగ్గింపునకు అనేక నిర’ యాలు తీసుకున్నాయి. అయితే అంతర్జాతీయ స్థాయిలో ప్రకటించిన లక్ష్యాలకు, వాటి అమలుకు మధ్య కొనసాగుతున్న అంతరాన్ని టీవీ సుబ్బయ్య నిశితంగా పరిశీలించారు. ప్రపంచ దేశాల పర్యావరణ విధానాలు, వాటి పరిమితులు, ఆర్థిక ప్రయో జనాల ప్రభావం, భవిష్యత్తులో మానవాళి ఎదుర్కోబోయే ప్రమా దాలను తన వ్యాసాల్లో విశ్లేషించారు. ఈ వ్యాసాల సంకలనంగా 2013లో ‘గ్లోబల్ వార్మింగ్’ పుస్తకం వెలువడింది. భూతాపం అనే శాస్త్రీయ సమస్యను సామాన్య పాఠకులకు అర్థ మయ్యే రీతిలో వివరించేందుకు ఆయన చేసిన కృషికి ఈ పుస్తకం నిదర్శనం. పర్యావరణ ప్రమాదాలపై ఆయన రాసిన వ్యాసాలు రెండు పుస్తకాలుగా వెలువడటం విశేషం. ఆయన వ్యక్తిత్వంలో విశిష్ట మైన అంశం ఆయన నిరాడంబర జీవితం. తనకు తెలిసిన విషయాలను ఇతరులతో పంచుకోవడంలో, సమాజానికి ఉప యోగపడే అంశాలపై రాయడంలోనే సంతృప్తి పొందారు. ఆయన వ్యక్తిగత జీవితంలో ఎంత సాధారణంగా ఉండేవారో, ఆలోచనల్లో అంత విశాలంగా ఉండే వారు. టీవీ.సుబ్బయ్య ఆదర్శప్రాయమైన జీవిత ప్రస్థానంలో ఆయన కుటుంబ సభ్యుల సహకారం ఎంతో కీలకమైనది. నేటి పాత్రికేయ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. సమాచార సాంకేతిక పరిజ్ఞానం విస్తరించినా, వాస్తవాలను నిర్ధారించే బాధ్యత పెరిగింది. వార్తల కంటే సంచలనాలకు, విశ్లేషణ కంటే ప్రచారానికి, ప్రజా సమస్యల కంటే వ్యక్తుల చుట్టూ తిరిగే చర్చలకు ప్రాధాన్యత పెరుగుతున్న పరిస్థితులు ఆందో ళన కలిగిస్తున్నాయి. ఇలాంటి సమయంలో టీవీ సుబ్బయ్య వంటి పాత్రికేయుల జీవితం మనకు విలువైన పాఠాలను నేర్పుతుంది. పాత్రికేయుడికి అధ్యయనం, సమాజం పట్ల స్పృహ, ప్రజల పట్ల బాధ్యత అవసరం. అధికారాన్ని ప్రశ్నించే ధైర్యం అవసరం. కలం ఒక ఆయుధ మైతే, దానిని ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగిం చాలన్నది సుబ్బయ్య జీవితం అందించే సందేశం. ఐదు దశాబ్దాల పాత్రికేయ ప్రస్థానంలో తనదైన ముద్ర వేసిన టీవీ సుబ్బయ్య అక్టోబర్ 18న కన్ను మూశారు. ప్రజా సమస్యలపై నిరంతరం స్పందించిన కలం శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంది. పర్యావరణ విధ్వంసంపై ఆయన చేసిన హెచ్చరికలు, ప్రజాపక్ష జర్నలిజం పట్ల ఆయన చూపిన నిబద్ధత, వ్యక్తిగత జీవితంలో పాటించిన నిరాడంబరత ఆయ నను గుర్తుచేస్తూనే ఉంటాయి.టీవీ.సుబ్బయ్య చిరస్మరణీయ పాత్రికేయుడు. ఆయనకు జోహార్లు! (2026 నవంబర్ 4వ తేదీ సాయంత్రం విజయవాడలోని చంద్రం బిల్డింగ్స్‌లో విశాలాంధ్ర దినపత్రిక సంపాదక మండలి నిర్వహిస్తున్న టీవీ సుబ్బయ్య సంస్మరణ సభ సందర్భంగా)

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు