విశాలాంధ్ర-తిరుపతి : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరి కోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్ 18 రాకెట్‌ను శుక్రవారం రాత్రి 11.51 గంటలకు ప్రయోగిం చనుంది. ఇందుకు సంబంధిం చిన 24 గంటల కౌంట్‌డౌన్ గురువారం రాత్రి 11.51 గంటలకు ప్రారంభమైంది. రాకెట్ ద్వారా సుమారు 2,250 కిలోల బరువున్న ఎన్వీఎస్-03 ఉపగ్రహాన్ని భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. జీఎస్ఎల్వీ శ్రేణిలో ఇది 20వ ప్రయోగం కాగా దేశీయంగా అభివృద్ధి చేసిన ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థ ‘నావిక్’ సేవలను మరింత బలోపేతం చేయడంలో ఈ ఉపగ్రహం కీలక పాత్ర పోషించనుంది. ఉపగ్రహంలో నావిగేషన్, దూర కొలతలకు సంబంధించిన పరికరాలతోపాటు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అణు గడియారాన్ని అమర్చారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎల్ 5, ఎస్ బ్యాండ్లకు అదనంగా ఎల్ 1 బ్యాండ్ సంకేతాలను అందించేలా దీన్ని రూపొందించారు. భారత భూభాగంతో పాటు దేశ సరిహద్దుల చుట్టూ సుమారు 1,500 కిలోమీటర్ల పరిధిలో నావిగేషన్ సేవలు అందించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది. వాహనాల గమనాన్ని గుర్తించడం, సముద్ర ప్రయాణాలు, దిశానిర్దేశం, ప్రదేశాల గుర్తింపు వంటి అవసరాలకు నావిక్ సేవలు దోహదపడనున్నాయి. ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లు షార్‌లో తుది దశకు చేరుకున్నాయి. ప్రయోగం విజయవంతమైతే దేశీయ నావిగేషన్ వ్యవస్థ మరింత బలోపేతం కావడంతో పాటు అంతరిక్ష రంగంలో స్వావలంబన దిశగా భారత్ మరో ముందడుగు వేయనుందని ఇస్రో పేర్కొంది.
ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు
ఇస్రో చైర్మన్ నారాయణన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అర్చకులు, ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం శాలువా, పూలమాలతో సత్కరించి, వేద పండితులచే ఆశీర్వచనం అందించారు. జీఎస్ఎల్వీ-ఎఫ్18 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని చైర్మన్ ప్రార్థించారు. గ్రూప్ డైరెక్టర్ గోపీకృష్ణతోపాటు అధికారులు పాల్గొన్నారు.
నేడు నింగిలోకి ఎన్వీఎస్ 03
- Advertisement -


