Homeవిశ్లేషణపెట్టుబడిదారీ రక్కసిపై తిరగబడిన తరం

పెట్టుబడిదారీ రక్కసిపై తిరగబడిన తరం

- Advertisement -

కృష్ణ కానూరి

ప్రపంచ పటంలో ఫ్రాన్స్‌ నుంచి అల్బేనియా వరకు భారత్ నుంచి లాటిన్ అమెరికా వరకు వీధులు మారుమోగుతున్నాయి. విద్యాసంస్థల నుంచి ప్రారంభమైన చిన్న నిప్పురవ్వలు నేడు బడా పెట్టుబడిదారీ వ్యవస్థలను కుదిపేసే మోజ్వల విప్లవాగ్నిలా ఎగిసిపడుతున్నాయి. ‘జీవించడానికి ఇల్లు లేదు, చదువుకోవడానికి బడులు లేవు, తిండికి డబ్బు లేదు’ అంటూ లక్షలాది మంది యువత, కార్మికులు రోడ్డెక్కారు. శ్రామిక ప్రజల నడ్డివిరుస్తున్న దోపిడీ పెట్టుబడిదారీ విధానంపై ‘జన్ జెడ్’ సంధిస్తున్న చారిత్రక ధిక్కార స్వరం! ప్రపంచీకరణ ముసుగులో చెలామణి అవుతున్న పెట్టుబడిదారీ విధానం పరాకాష్టకు చేరింది. ఒకవైపు కోట్లకు పడగలెత్తుతున్న కార్పొరేట్ దిగ్గజాలు, మరోవైపు పూట గడవక అల్లాడిపోతున్న శ్రామిక కుటుంబాలు- ఇదే నేటి ప్రపంచ ఆర్థిక అసమానతల నిజస్వరూపం. ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోతుంటే, వేతనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఈ అగాధం శ్రామిక వర్గాల జీవితాలను అంధకారంలోకి నెట్టేసింది. కార్పొరేట్ దోపిడీ గురించి మార్క్స్ నాడే హెచ్చరించినట్లుగా, ప్రాథమిక అవసరాలైన ఆహారం, వస్త్రం, వసతి అనేవి కార్పొరేట్‌ల చేతుల్లో వ్యాపార సరుకులుగా మారాయి. స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్‌ దేశాలలో ఆకాశాన్ని తాకుతున్న అద్దెలు, విపరీతంగా పెరిగిన ఆస్తి ధరల వల్ల నేటి యువత నివాసయోగ్యమైన గూడును కోల్పోతోంది. లిస్బన్ వీధుల్లో ‘హోమ్లెస్ జనరేషన్’ అంటూ యువత గుడారాలు వేసి నిరసన తెలుపుతుండటం, పెట్టుబడిదారీ వ్యవస్థ ఇస్తున్న కానుకల దివాలాకోరుతనాన్ని కళ్లకు కడుతోంది.
ప్రభుత్వ రంగం ధ్వంసం…విద్య, వైద్య ప్రైవేటీకరణ
విద్య, వైద్యం లాంటి అత్యవసర రంగాలను ప్రభుత్వాలు నిర్వీర్యం చేసి కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నాయి. ఫ్రాన్స్‌, గ్రీస్ దేశాలలో ఉపాధ్యాయుల కొరత, శిథిలావస్థకు చేరిన పాఠశాలలు, నిధుల కోత ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు. జ్ఞానాన్ని, మేధస్సును కూడా కొనుగోలు చేసే సరుకుగా మార్చిన ఈ విధానంపై విద్యార్థి లోకం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. టిక్టాక్, డిస్కార్డ్ వంటి ఆధునిక డిజిటల్ వేదికలను అనుసంధాన సాధనాలుగా మలుచుకుంటూ, నేటి జన్ జెడ్ యువత సరికొత్త పోరాట రూపాలను సృష్టిస్తోంది. పాతకాలపు రాజకీయ నాయకుల మోసపూరిత హామీలను, బద్దకించిన వ్యవస్థలను ఈ తరం ప్రశ్నిస్తోంది. వీరు కేవలం తమ సమస్యల గురించే కాకుండా, పతనమవుతున్న సామా జిక ఒప్పందాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ అణచివేత ప్రజాస్వామ్య ముసుగులో ప్రభుత్వాలు నిరంకుశంగా మారుతు న్నాయి. ఎన్నికల జాబితాల తొలగింపు, ప్రతిపక్షాల గొంతు నొక్కడం, రాష్ట్ర యంత్రాంగాన్ని అడ్డంపెట్టి నిరసనలను అణచివేయడం నిత్యకృత్యమైంది. అల్బేనియాలో అవినీతికి వ్యతిరేకంగా, భారత్‌లో విద్యావ్యవస్థ వైఫల్యాలకు, నిరుద్యోగానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటాలు పాలకుల కుర్చీలను కదిలిస్తున్నాయి. సమాజ సంపదనంతటినీ కొద్దిమంది బిలియనీర్ల చేతుల్లో బంధించి, మెజారిటీ ప్రజలను రోడ్డున పడేసిన పెట్టుబడిదారీ విధానపు వికృత స్వరూపమిది. ఈ వ్యవస్థాగత దోపిడీ కొనసాగుతున్నంత కాలం యువతకు భవిష్యత్తు ఉండదు. నేడు విద్యాకుసుమాలు, శ్రామిక హస్తాలు ఐక్యమై ఉద్యమించడమంటే అది ప్రజా విప్లవానికి నాంది. ఇవి కేవలం చట్టాల సవరణ కోసం జరుగుతున్న నిరసనలు కావు.. దగాపడిన సమాజం దోపిడీ ఆర్థిక పునాదులను బద్దలు కొట్టడానికి వేస్తున్న చారిత్రక అడుగులు!
హింస ముసుగులో కుట్రలు : ఈ శాంతియుత నిరసనల అంచున కొందరు అసాంఘిక శక్తులు, ముసుగుధారులు అల్లర్లకు పాల్పడుతుండ టాన్ని పాలక వర్గాలు, మితవాద శక్తులు వలసదారులపైకి నెట్టాలని చూస్తున్నాయి. ఇది పాలకుల కుట్రపూరిత ఎత్తుగడ. ప్రజా ఉద్యమాల దృష్టిని మళ్లించడానికి, వారి మధ్య చీలికలు తెచ్చి ఫాసిస్టు పోకడలను బలపరచడానికి పన్నే పన్నాగం ఇది.
దివాలా తీసిన పెట్టుబడిదారీ బడ్జెట్లు
‘డబ్బు లేదు, మేమేమీ చేయలేం’ అంటూ ఫ్రాన్స్‌, ఇటలీ ప్రభుత్వాలు చేతులెత్తేస్తున్నాయి. కానీ సామ్రాజ్యవాద యుద్ధాలకు, కార్పొరేట్ రాయి తీలకు వేల కోట్లు కుమ్మరించడానికి మాత్రం ప్రభుత్వాల వద్ద ధనం ఉంటున్నది. ఈ వైరుధ్యమే నేడు ప్రజల ఆగ్రహాన్ని కట్టలు తెంచుకునేలా చేస్తోంది. ప్రభుత్వాల ఈ నిస్సహాయత పెట్టుబడిదారీ విధానపు అంతిమ వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. ఐరోపా వీధుల్లో రగులుతున్న నిరసన జ్వాలలు పారిస్ నుంచి రోమ్, మాడ్రిడ్ నుంచి లిస్బన్ వరకు యూరప్ దేశాలు నేడు నిరసనల హోరుతో అట్టుడుకుతున్నాయి. పారిస్‌లో విద్యారంగ సంస్కరణలు, జీవన వ్యయ భారానికి వ్యతిరేకంగా సాగిన ప్రదర్శనల్లో వేలాది మంది ప్రజలు రోడ్డెక్కగా, పోలీసులు వందలాది మందిని అదు పులోకి తీసుకున్నారు. ఇటలీలోని మిలాన్, రోమ్, ట్యూరిస్ నగరాలలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ ప్రభుత్వం సైనిక బలగాలను మోహరించింది. స్పెయిన్, పోర్చుగల్ దేశాలలో గృహ వసతి సంక్షోభం, ఆకాశాన్నంటిన ఇంటి అద్దెలు, పెరిగిన ఈఎంఐల భారాన్ని మోయలేక యువత గూడు కోసం పోరాట బాట పట్టింది. అల్బేనియాలో లగ్జరీ ప్రాజెక్టులకు వ్యతి రేకంగా సాగుతున్న ఆందోళనలు ప్రభుత్వ భవనాలపై దాడి వరకు వెళ్లాయి. ఇవన్నీ విఫలమవుతున్న వ్యవస్థలపై ప్రజాగ్రహానికి సజీవ సాక్ష్యాలు. ప్రజల డిమాండ్లను చర్చల ద్వారా పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు, ఉక్కుపాదం మోపుతున్నాయి. మిలటరీని, పదుల వేల మంది పోలీసులను మోహరించడం, భావప్రకటన స్వేచ్ఛను కాలరాయడం, అక్రమ అరెస్టులకు పాల్పడటం వంటి చర్యల ద్వారా పాలకుల భయం బయటపడుతోంది. హింసతో ఉద్యమాలను అణచివేయవచ్చనే భ్రమలో పాలకులున్నారు కానీ, ఆలోచనలను ఎవరూ బంధించలేరు. ఫ్రాన్స్‌లో ప్రారంభమైన విప్లవ స్ఫూర్తి ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్, అల్బేనియా దాటి ఆసియా, లాటిన్ అమెరికా దేశాలకు పాకింది. ఇది కేవలం దేశీయ సమస్య కాదు, అంతర్జాతీయ పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా ప్రపంచ శ్రామిక, యువత సాధి స్తున్న అనధికారిక ఐక్యత. ఒక దేశంలో రగులుకున్న నిరసన అగ్నికణం మరో దేశానికి అంటుకోవడం ద్వారా ‘ప్రపంచ శ్రామికులారా ఏకంకండి’ అన్న నినాదం వాస్తవ రూపం దాల్చుతోంది.
దోపిడీ రహిత రాజ్యం కోసం ‘జన్ జెడ్’ పిలుపు
నేడు వీధుల్లో పిడికిలెత్తి నినదిస్తున్న ప్రతీ యువకుడి ఆర్తిలోనూ, శ్రామికుడి స్వేద చుక్కలోనూ రేపటి సమసమాజ విప్లవ కాంతి వెలుగుతోంది! ఈ పోరాటాలు ప్రజాస్వామ్య ముసుగులో ఊరేగుతున్న పాలకుల సింహాసనాలను కదిలించే తీవ్ర హెచ్చరిక. ఇది కేవలం క్షణికావేశం కాదు. సమస్త మానవాళిని బానిసలుగా మారుస్తున్న దోపిడీ వ్యవస్థపై జన్ జెడ్ స్వరం సృష్టిస్తున్న యుగమార్పిడి ధిక్కారం
సెల్ : 7981305779

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు