. త్వరలో ప్రణాళిక
. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
విశాలాంధ్ర-హైదరాబాద్ : పోషకాహార తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం మిషన్ మోడ్‌లో పని చేస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. శక్తివంతమైన, ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణంలో అందరూ పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. సమష్టి కృషితోనే పౌష్టిక తెలంగాణ సాధ్యపడుతుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు దేశానికే ఆదర్శంగా తెలంగాణ అంగన్‌వాడీ కేంద్రాలను తీర్చిదిద్దుతామన్నారు. తెలంగాణ రైజింగ్-2047 డాక్యుమెంట్‌కు అనుగుణంగా అంగన్‌వాడీ సేవలను మరింత మెరుగుపరుస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో అంగన్‌వాడీ సేవల బలోపేతం… చిన్నారుల్లో పోషకాహార మెరుగుదల… మహిళా స్వయం సహాయక బృందాల భాగస్వామ్యం వంటి అంశాలపై రాష్ట్ర స్థాయి సమావేశం బేగంపేటలోని టూరిజం ప్లాజా వేదికగా సోమవారం ఘనంగా జరిగింది. మంత్రి సీతక్క అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పోషకారంపై పని చేస్తున్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్, సీఎఫ్‌టిఆర్‌ఐ (మైసూర్), ఎయిమ్స్, ఇక్రిసాట్, యూనిసెఫ్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రథం, ఆంధ్ర మహిళా సభ, హర్మన్, బాల రక్షభారతి వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పోషకాహారం అందించడంలో లైన్ డిపార్ట్ మెంట్లుగా వ్యవహరిస్తున్న అనేక సంక్షేమ శాఖలు, సివిల్ సప్లయిస్, విద్యా శాఖ, టీజీ ఫుడ్స్, సెర్ప్, ఐ అండ్ పీఆర్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొని తమ విలువైన అభిప్రాయాలు తెలియజేశారు. వారి అభిప్రాయాలను, అనుభవాలను, ఆలోచనలను ఆసక్తిగా విన్న మంత్రి సీతక్క వారి సూచనలతో ‘తెలంగాణ పోషకాహార ప్రణాళిక’ రూపొందిస్తున్నామని ప్రకటించారు. అంగన్‌వాడీ లబ్ధిదారులకు రోజుకు 200 మిల్లీ లీటర్ల విజయ పాలు, కిశోర బాలికలకు పోషకాలతో కూడిన పల్లీ, తృణ ధాన్య పట్టీలు, వారానికి రెండు సార్లు ఎగ్ బిర్యానీ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. పోషకాహార తెలంగాణ నిర్మాణం దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో భాగస్వామ్య పక్షాలతో సమావేశం నిర్వహించినట్లు వెల్లడిరచారు. నిపుణుల అభిప్రాయాలు, అనుభవాల ఆధారంగా పోషణ తెలంగాణా కోసం కార్యాచరణను రూపొందించి అమలు చేస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను వివరించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అంగన్‌వాడీల్లో ఎన్నో పోషకాలున్న కోడిగుడ్డు సరఫరాను నిలిపివేయగా, తెలంగాణలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, కౌమార బాలికలకు పోషకాహారం అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. నిపుణుల సలహా మేరకు అన్ని వయసుల వారికి పౌష్టికాహారం అందించే అంశం పరిశీలనలో ఉందన్నారు. అన్ని రంగాల్లో ముందంజలో ఉన్న తెలంగాణలో పోషకార లోపంతో పిల్లలు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధిగమించేందుకు విస్తృత స్థాయిలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు, మహిళా స్వయం సహాయక బృందాల సహకారాన్ని తీసుకుంటామని తెలిపారు.
అమ్మ ఒడి నుంచి చిన్నారులు అంగన్‌వాడీ బడిలో చేరేలా ప్రోత్సహించాలని కోరారు. ఈ కేంద్రాల్లో ఆహారంతో పాటు అక్షరం, ఆరోగ్యం లభిస్తుందని తల్లిదండ్రులకు తెలియజెప్పాలని సూచించారు. అలాగే నిర్మాణ సౌకర్యం లేని ప్రాంతాల్లో మొబైల్ అంగన్‌వాడీలను ప్రవేశపెట్టనున్నామని అన్నారు. నాక్, జేఎన్‌టీయూ వంటి సంస్థలు మోడల్స్ సిద్ధం చేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో వలస కూలీల పిల్లలకు పౌష్టికాహారం అందించేలా మొబైల్ అంగన్‌వాడీలు నిర్వహిస్తామన్నారు. వారానికి కనీసం రెండు సార్లు అయా ప్రాంతాల్లో పౌష్టికాహారాన్ని అందిస్తామని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాలను దత్తత తీసుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ఆసక్తిని తెలిపిన నేపథ్యంలో అవసరమైన ప్రోత్సాహక చర్యలు తీసుకుంటామని వెల్లడిరచారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణానికి ఆరోగ్యవంతమైన చిన్నారులే కీలకమని, అందుకే అంగన్‌వాడీ కేంద్రాల సేవలపై పూర్తి దృష్టి సారించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. అంగన్‌వాడీ సిబ్బంది స్పష్టమైన లక్ష్యంతో పని చేస్తేనే ఫలితాలు మెరుగ్గా వస్తాయన్నారు.
పోషన్ వాటికలో భాగంగా సీడ్స్ కిట్ ఆవిష్కరణ
ప్రత్యేకంగా పోషన్ వాటిక కార్యక్రమం కింద నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ ద్వారా ఆరు రకాల కూరగాయల విత్తనాలతో కూడిన సీడ్స్ కిట్‌ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. మొదటి విడతలో 4,500 అంగన్‌వాడీ కేంద్రాలకు ఈ విత్తనాల కిట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వీటిలో పాలకూర, తోటకూర, మెంతికూర, టమాట, వంకాయ, బెండకాయ విత్తనాలు ఉన్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో వీటిని పెంచి లబ్ధిదారులకు వండి పెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ జి.సృజన, తెలంగాణ ఫుడ్ ఎంపీ చంద్రశేఖర్ రెడ్డి, ఐ అండ్ పీఆర్ అడిషనల్ డైరెక్టర్ డీఎస్ జగన్, ఇతర శాఖల ఉన్నతాధికారులు, అనేక స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


