కృష్ణ కానూరి
మాడ్రిడ్ నగర వీధుల్లో ఆ రోజు రాలిన కన్నీటి బొట్టు, ఒక దేశపు భవిష్యత్తునే మార్చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఏడు దశాబ్దాలుగా తన ఊపిరిగా, మలుచుకున్న సొంతగూడు నుంచి 87 ఏళ్ల మారికార్మెన్ అబాస్కల్ అనే అవ్వను నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయించి వీధిలోకి తోసేసారు. ఆకాశాన్నంటిన అద్దె భారాన్ని ఆ వయోవృద్ధురాలు భరించలేకపోవడమే దానికి కారణం. ఆ ఒక్క సంఘటన స్పెయిన్ దేశపు అసమానతల అంతరాత్మను రగిల్చింది. నిశ్శబ్దంగా నలిగిపోతున్న లక్షలాది మంది గుండెల్లో దవానలాన్ని రగిల్చింది. ఒక వృద్ధురాలి ఆవేదన స్పెయిన్ వీధుల్లో కోట్లాది గొంతుల సమరభేరిగా మారింది. మాడ్రిడ్ నుంచి బార్సిలోనా, వాలెన్సియాల దాకా వీధులన్నీ మానవ మహా సముద్రా లయ్యాయి. చేతుల్లో ఇంటి తాళాలు పట్టుకుని, లోహపు చప్పుడు చేస్తూ ‘మా నగరాల తాళాలు మా చేతుల్లోనే ఉన్నాయి!’ అని నినదిస్తున్న ఆ జనసందోహం కేవలం నిరసన తెలపడం లేదు, తమ జీవించే హక్కు కోసం పోరాడుతోంది. ‘మా భవిష్యత్తు కోసం చదువుకుంటున్నాం కానీ, లగ్జరీ అపార్ట్మెంట్లలో కొవ్వొక్కిన వర్గానికి బానిసలుగా బతకడానికి కాదు’ అంటూ యువత వేస్తున్న కేకలు పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఇది కేవలం అద్దె పరిమితి కోసం జరుగుతున్న ఉద్యమం కాదు. గూడు లేక వీధి పాలవుతున్న సామాన్యుడి ఆత్మగౌరవ పోరాటం! దేశంలో ఇళ్ల కొరతను, అద్దెల సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని విదేశీ ‘రాబందు ఫండ్స్’ నగరాల్లోని ఇళ్లను విచ్చలవిడిగా కొనుగోలు చేస్తూ కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయి. బ్యాంకు ఆఫ్ స్పెయిన్ లెక్కల ప్రకారమే దాదాపు 7 లక్షల ఇళ్ల అభద్రత నెలకొంది. ఐటీ హబ్‌లు, పర్యాటక కేంద్రాల పేరుతో ఆవాసాలను రియల్ ఎస్టేట్ జూదగాళ్లు వ్యాపార సరుకుగా మార్చేశారు. సామాన్యుడి నెలకు వచ్చే సంపాదనంతా అద్దె కట్టడానికే సరిపోతుంటే, పొట్టకూటికి గతిలేని స్థితికి కష్టజీవి దిగజారిపోయాడు. ఈ కార్పొరేట్ దందాను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం కావడమే నేటి కార్మిక ఆగ్రహానికి మూలకారణం.
బార్సిలోనాలో చెలరేగిన చిచ్చు : శాంతియుతంగా ప్రారంభమైన నిరసనలు, బార్సిలోనా వీధుల్లో ఉద్రిక్తంగా మారాయి. కార్పొరేట్ సదస్సులను ముట్టడించేందుకు యత్నించిన నిరసనకారులపై పోలీసులు రబ్బరు బుల్లెట్లు, లాఠీచార్జీలతో విరుచుకుపడ్డారు. దాంతో ఆగ్రహించిన యువత వీధుల్లో చెత్తకుండీలకు నిప్పుపెట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. రాళ్ల వర్షం, పొగచూరిన వీధులు, పోలీసు సైరన్ల నడుమ బార్సిలోనా నగరం ఒక యుద్ధ రంగాన్ని తలపించింది. రోడ్లపై ప్రజలు తిరగబడటంతో ప్రధాని పెడ్రో సాంచెజ్ నేతృత్వంలోని అల్పసంఖ్యాక ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిలో పడింది. ఇళ్ళు ఖాళీ చేయించడంపై నిషేధం, అద్దెల నియంత్రణ, విదేశీ నిధులపై ఆంక్షలు విధించేలా అత్యవసర చట్టాలు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ, పార్లమెంట్లో ప్రతిపక్షాలైన కన్జర్వేటివ్ పీపుల్స్ పార్టీ, మితవాద వోక్స్, కెటలాన్ పార్టీలు చేతులు కలిపి ఈ అత్యవసర బిల్లులను ఓడించాయి. ప్రజల ఆక్రోశం ముందు నిలవలేక, పార్లమెంట్ మద్దతు కోల్పోయిన సాంచెజ్, చివరికి పార్లమెంట్‌ను రద్దు చేసి నవంబర్ 29న ముందస్తు ఎన్నికలకు వెళ్లక తప్పలేదు. స్పెయిన్ రాజకీయాలు నేడు ఒక విచిత్రమైన సంధియుగంలోకి చేరాయి. సామాన్యుడి ప్రాథమిక అవసరమైన ‘గూడు’ను పరిష్కరించడంలో విఫలమైన రాజకీయ వ్యవస్థ, ఇప్పుడు ముందస్తు ఎన్నికల పేరుతో మరో జూదానికి తెరలేపింది. ఒకవైపు సొంత లాభాల కోసం ప్రజల ఆవేదనను కాలరాసిన ప్రతిపక్షాలు, మరొకవైపు అధికారంలో ఉండి కూడా సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోలేకపోయిన అధికార పక్షం… ఈ రెండింటి నడుమ నలిగిపోతున్నది మాత్రం సగటు పౌరుడే. ఈ ప్రజా ఉద్యమంలో స్పానిష్ అంతర్యుద్ధం నాటి చారిత్రక ఉద్యమ స్ఫూర్తి పురివిప్పుకుంది. వీధుల్లో ‘ఇదిగో ఇక్కడే ఉన్నారు యాంటీ ఫాసిస్టులు!’ అంటూ మారుమోగుతున్న నినాదాలు, కేవలం అద్దెల సంక్షోభానికే పరిమితం కాలేదు. కార్పొరేట్ వర్గాలకు, మితవాద పక్ష శక్తులకు వ్యతిరేకంగా సామాన్య ప్రజా బాహుళ్యం ఉద్యమ బాట పట్టిందనడానికి ఈ స్పానిష్ విప్లవ నినాదాలే నిదర్శనం. ప్రజల ఆక్రోశం నేడు చారిత్రక పోరాట జ్ఞాపకాలను గుర్తుచేస్తోంది.
పుఎర్త్ా దెల్ సోల్లో విప్లవ శిబిరాలు.. ‘మాకు ఇళ్లు ఇచ్చేదాకా కదిలేది లేదు!’ రాజధాని మాడ్రిడ్‌లోని చారిత్రాత్మక ‘పుఎర్త్ా దెల్ సోల్’ చతురస్రం నేడు నిరసన శిబిరాలతో నిండిపోయింది. వర్షం పడుతున్నా, చలిగాలులు వీస్తున్నా వందలాది మంది యువకులు, మహిళలు, కార్మికులు అక్కడ గుడారాలు వేసుకుని ధర్నా చేస్తున్నారు. ‘మమ్మల్ని రోడ్డున పడేసిన వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడటం మా హక్కు, మాకు ఆనందం కోసం కాక, ఆత్మ గౌరవం కోసం ఇక్కడ కూర్చున్నాం’ అంటూ స్పందించిన 26 ఏళ్ల మార్కోస్ మాటలు సమకాలీన సమాజపు దౌర్భాగ్యానికి అద్దం పడుతున్నాయి.
సంక్షేమ రాజ్యమా? లేక పెట్టుబడిదారీ దందానా? అభివృద్ధి చెందిన దేశంగా, ఐరోపా సమాఖ్యలో కీలక భాగస్వామిగా ఉన్న స్పెయిన్‌లో ఉపాధి పొందుతున్న యువత, సగటు ఉద్యోగులు తమ సంపాదనలో 50 శాతానికి పైగా కేవలం అద్దెకే వెచ్చించాల్సి రావడం ఎంతవరకు సమంజసం? ఆర్థిక వృద్ధి అని గణాంకాలు చెబుతున్నా, ఆ వృద్ధి ఫలితాలు కొద్దిమంది బిలియనీర్ల ఖజానాకే చేరుతున్నాయని ఈ అద్దె సంక్షోభం నిరూపిస్తోంది. ఇల్లు అనేది వ్యాపార సరుకా? లేదా ప్రాథమిక మానవ హక్కా? అనే ప్రశ్న నేడు సమాజాన్ని తీవ్రంగా ఆలోచింపజేస్తోంది.
సార్వత్రిక సమ్మె వైపు పావులు : టెనెంట్స్ యూనియన్లు (అద్దెదారుల సంఘాలు) నేడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిస్తున్నాయి. ఈ పిలుపుతో స్పానిష్ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయే ప్రమాదం కనిపిస్తోంది. పాలకుల నిర్లక్షాయూనికి ప్రజలే సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రపంచానికి హెచ్చరిక : స్పెయిన్‌లో రగిలిన ఈ అద్దె అగ్నిజ్వాలలు భారత్ సహా ప్రపంచంలోని ప్రతి మహానగరానికి ఒక హెచ్చరిక. నివాస రంగాన్ని కేవలం రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్‌కు, విదేశీ పెట్టుబడులకు వదిలేస్తే, సొంత భూమిలోనే పౌరులు శరణార్థులుగా మారతారని ఈ సంక్షోభం చాటుతోంది. సాంకేతికత, ఆకాశహర్మాయూల వెనుక నలిగిపోతున్న మానవ సంబంధాలు, సామాన్యుడి కనీస అవసరాలను విస్మరిస్తే ఏ ప్రజాస్వామ్యమైనా ప్రజా తిరుగుబాటు ముందు తలవంచక తప్పదని ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయి. పట్టణ వికాసం పేరిట పౌరుల నివాస హక్కును కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడితే, అది సామాజిక విప్లవానికి దారితీస్తుందని ఈ సంఘటన హెచ్చరిస్తోంది.
ఈ చైతన్యం వ్యవస్థను మార్చగలదా ? 87 ఏళ్ల మారికార్మెన్ అబాస్కల్ కన్నీటితో మొదలైన ఈ ఉద్యమం, నేడు ఒక దేశపు ముందస్తు ఎన్నికలకు కారణమైంది, వ్యవస్థ పునాదులనే కదిలించింది. ఓట్ల రాజకీయం ముగియవచ్చు, కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావచ్చు. కానీ వీధుల్లో రగిలిన ఈ ప్రజాచైతన్యం, తమ హక్కుల కోసం సాగిస్తున్న ఈ పోరాటం నిలిచిపోదు. ‘ఇల్లు లేని చోట శాంతి లేదు’ అన్న స్పానిష్ వీధుల నినాదం, నేడు ప్రపంచవ్యాప్తంగా సామాన్యుడికి ఆవాస హక్కును గుర్తు చేసే ఒక విప్లవ సందేశం!
సెల్ : 7981305779


