భారత పరిపాలనా వ్యవస్థలో అధికారం అంటే హోదా, హంగులు, ఆర్భాటాలు కాదని.. ప్రజలకు సేవ చేయడమే నిజమైన బాధ్యత అని తన జీవితంతో నిరూపించిన అరుదైన ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్.శంకరన్. 1934 అక్టోబర్ 22న తమిళనాడులోని సిరిగలత్తూరు గ్రామంలో జన్మించిన ఆయన, 1957 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఎంపికై 1959లో ఆంధ్రప్రదేశ్‌లో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2010 అక్టోబర్ 7న ఆయన కన్నుమూశారు. నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో నెలలో 15 రోజులకు పైగా గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేవారు. సాధారణ దుస్తులు ధరించి, సామాన్యుడిలా ప్రజల మధ్యనే తిరిగేవారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేశారు. అందుకే ఆయన ప్రజలకు కేవలం ఒక అధికారిగా కాకుండా, ఆప్తుడిగా గుర్తుండిపోయారు.
భూసంస్కరణలు.. పేదలకు భూమిపై హక్కులు : గ్రామీణ పేదల జీవితాల్లో నిజమైన మార్పు రావాలంటే వారికి భూమిపై హక్కులు కల్పించాలని శంకరన్ బలంగా విశ్వసించారు. గిరిజనుల భూములను ఆక్రమణల నుంచి రక్షించడం, భూమి లేని పేదలకు భూములు పంపిణీ చేయడం, భూ రికార్డులను సరిచేయడం వంటి వాటికి ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ప్రాంతంలో భూసంస్కరణల అమలుకు చేపట్టిన చర్యలు ఆయన ఆలోచనా విధానానికి ఉదాహరణగా నిలిచాయి. 206 గ్రామాల్లో భూరికార్డులను సరిచేయడం, పేదలకు 84,500 ఎకరాల భూమిని పంపిణీ చేయడం, గిరిజనుల నుంచి ఇతరులు ఆక్రమించిన భూములను తిరిగి వారికి అప్పగించడం వంటి ఫలితాలు నమోదయ్యాయని వివరించబడింది. భూమి అనేది కేవలం ఆస్తి కాదని, అది పేదలకు ఆత్మగౌరవం, ఆర్థిక స్వావలంబన, సామాజిక సమానత్వాన్ని అందించే సాధనమని ఆయన భావించారు.
దళిత, గిరిజన సంక్షేమానికి విశేష కృషి : ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో ఎస్.ఆర్.శంకరన్ దళితులు, గిరిజనుల అభ్యున్నతికి అనేక కీలక చర్యలు చేపట్టారు. 1976లో హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి దళిత మహాసభలు సామాజిక సంక్షేమ విధానాల రూపకల్పనలో ముఖ్యమైన ఘట్టంగా నిలిచాయి. దళితులకు విద్య, వసతి, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, గ్రామాల్లో వారి నివాస ప్రాంతాలు ఇతరులకు దూరంగా ఉండే వివక్షను తొలగించేందుకు కృషి చేశారు. ఎస్‌సీ, ఎస్‌టీ ఉప్పరణాళికల ద్వారా జనాభా నిష్పత్తికి అనుగుణంగా అభివృద్ధి నిధులు కేటాయించే విధానానికి ప్రాధాన్యం ఇచ్చారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, ఉపకార వేతనాలు, హాస్టళ్లు, పరీక్షలకు ముందు శిక్షణా కేంద్రాలు, మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, దుస్తుల పంపిణీ వంటి విద్యా కార్యక్రమాలకు ఆయన విశేష ప్రాధాన్యం ఇచ్చారు. పేద విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వారి చదువు ఆగిపోకూడదన్నది ఆయన లక్ష్యం. గిరిజన ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి కోసం సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థల (ఐటీడీఏ) బలోపేతానికి కృషి చేశారు. గిరిజనులకు విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఉపాధి అవకాశాలు అందేలా చర్యలు చేపట్టారు.
కారంచేడు బాధితులకు అండగా : 1985 జూలై 17న ప్రకాశం జిల్లాలోని కారంచేడులో జరిగిన దాడిలో ఆరుగురు దళితులు ప్రాణాలు కోల్పోయారు. అనేక కుటుంబాలు భయంతో తమ నివాసాలను వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న శంకరన్ బాధితుల వద్దకు వెళ్లి వారి కష్టాలను విన్నారు. కేవలం పరామర్శలతో సరిపెట్టకుండా, బాధితులకు 436 పక్కా ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఉపాధి అవకాశాలు, 146 ఎకరాల వ్యవసాయ భూమి, 86 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేశారు. తిమ్మసముద్రం, పెదనిండ్రకొలను వంటి ప్రాంతాల్లో దాడులకు గురైన దళిత కుటుంబాలకు కూడా సహాయం అందించారు. హైదరాబాద్‌లో చర్మకారుల జీవనోపాధికి సంబంధించిన లిడ్క్యాప్ డబ్బాలను ట్రాఫిక్ సమస్యల పేరుతో తొలగించినప్పుడు జోక్యం చేసుకుని, వాటిని తిరిగి ఏర్పాటు చేయించేందుకు చర్యలు తీసుకున్నారు. బాధితుల సమస్యలను ఫైళ్లలోని వివరాలుగా కాకుండా, మనుషుల జీవితాలకు సంబంధించిన సమస్యలుగా చూడటమే ఆయన ప్రత్యేకత.
వెట్టిచాకిరీ నిర్మూలనకు పోరాటం : తరతరాలుగా పేదలను బానిసత్వంలో ఉంచిన వెట్టిచాకిరీ వ్యవస్థను నిర్మూలించేందుకు శంకరన్ గట్టిగా కృషి చేశారు. గ్రామాల్లో పర్యటిస్తూ కార్మికులకు వారి హక్కులపై అవగాహన కల్పించారు. రుణాల పేరుతో భూస్వాముల వద్ద బంధీలుగా పనిచేస్తున్న వారిని గుర్తించి, వారికి విముక్తి కల్పించేందుకు చర్యలు చేపట్టారు. కనీస వేతన చట్టాలు, వెట్టిచాకిరీ నిర్మూలన చట్టాలు అమలయ్యేలా పట్టుదలగా పనిచేశారు. ఈ క్రమంలో ప్రభావవంతమైన భూస్వాముల నుంచి వ్యతిరేకత ఎదురైంది. అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డితో కూడా ఆయనకు విభేదాలు వచ్చాయి. అయినప్పటికీ చట్టప్రకారం పనిచేస్తున్నానని స్పష్టంగా చెప్పి తన నిబద్ధతను చాటుకున్నారు. త్రిపుర రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసినప్పటికీ, ఆయన జీవనశైలిలో ఎలాంటి మార్పు రాలేదు. నిరాడంబరంగా జీవిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేవారు. మానవ మలాన్ని చేతులతో శుభ్రం చేసి మోసుకెళ్లే అమానవీయ పనిని నిర్మూలించేందుకు కూడా శంకరన్ కృషి చేశారు. అధికారులకు లేఖలు రాస్తూ, డ్రై లాట్రిన్ల తొలగింపు, పారిశుధ్య కార్మికుల విముక్తి కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. దళిత మానవ హక్కుల కార్యకర్త బెజవాడ విల్సన్‌తో కలిసి సఫాయి కర్మచారీ ఆందోళన్ ఉద్యమానికి సహకరించారు. ఈ సమస్యను దేశవ్యాప్త చర్చలోకి తీసుకురావడానికి, బాధితులకు న్యాయం అందించడానికి తన వంతు సహాయం అందించారు.
నక్సలైట్లతో శాంతి చర్చలకు ప్రయత్నం : 1987లో తూర్పు గోదావరి జిల్లాలోని గుర్తేడు ప్రాంతంలో ప్రభుత్వ కార్యక్రమాలను పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో శంకరన్తో పాటు ఇతర అధికారులను నకస్లైట్లు కిడ్నాప్ చేశారు. శంకరన్ అధైర్యపడకుండా, తాము ప్రజల కోసం, వెనుకబడిన గిరిజనుల సంక్షేమం కోసమే పనిచేస్తున్నామని నకస్లైట్లకు స్పష్టం చేశారు. ఐఏఎస్ అధికారిగా శంకరన్ అంతకుముందే దళితులు, గిరిజనులు, వెట్టిచాకిరీ విముక్తి కోసం చేసిన పనులు నకస్లైట్లకు కూడా బాగా తెలుసు. ఆయన నిష్కళంకమైన వ్యక్తిత్వం పట్ల వారికి గౌరవం ఉంది. మధ్యవర్తుల చర్చల అనంతరం శంకరన్ , ఇతర అధికారులు సురక్షితంగా విడుదలయ్యారు. ప్రభుత్వం, నకస్లైట్ల మధ్య హింసకు బదులుగా చర్చల ద్వారా పరిష్కారం రావాలని ఆయన ఆకాంక్షించారు. 1997లో పౌరస్పందన వేదిక ఏర్పాటులో భాగస్వామిగా నిలిచి, హింసాత్మక ఘటనలను పరిశీలించేందుకు, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కృషి చేశారు. 2004లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో నక్సలైట్లతో జరిగిన శాంతి చర్చల్లోనూ ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. చర్చలు విఫలమవడం ఆయనను తీవ్రంగా బాధించింది.
నిరాడంబర జీవితం.. నిస్వార్థ సేవ : ఉన్నత పదవుల్లో పనిచేసినా శంకరన్ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ఆర్భాటాలకు చోటివ్వలేదు. సొంత ఇల్లు లేకుండా ప్రభుత్వ అతిథి గృహాల్‌లో నివసించేవారు. సచివాలయానికి నడిచి వెళ్లేవారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజల సమస్యల పరిష్కారానికి సమయం కేటాయించేవారు. తన జీతంలో ఎక్కువ శాతం పేద విద్యార్థుల చదువులకు, బాధితుల సహాయానికి వెచ్చించేవారు. పదవీ విరమణ తర్వాత వచ్చిన పెన్షన్‌ను కూడా పేదలకు సహాయం చేయడానికి ఉపయోగించారు. వ్యక్తిగత ప్రచారానికి, మీడియా హడావిడికి దూరంగా ఉండేవారు. 1992లో పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఎలాంటి పదవుల కోసం ప్రయత్నించలేదు. 2005లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని సైతం తాను అవార్డుల కోసం పనిచేయలేదని చెబుతూ సున్నితంగా తిరస్కరించారు.
ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా : 2010 అక్టోబర్ 7న ఎస్.ఆర్.శంకరన్ కన్నుమూశారు. ఆయన మరణవార్తతో పేదలు, దళిత సంఘాల నాయకులు, అధికారులు, ప్రజా ఉద్యమాల ప్రతినిధులు తీవ్ర విషాదానికి గురయ్యారు. పేదల పెన్నిధిగా, దళిత బాంధవుడిగా ఆయనకు నివాళులర్పించారు. ఆయన సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2011లో సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఎవరెస్ట్ శిఖరాన్‌ని అధిరోహించిన గిరిజన బాలిక మాలావత్ పూర్ణ 2014లో అక్కడ ఆయన చిత్రపటాన్ని ప్రదర్శించి నివాళులర్పించింది. ఆయన పేరుతో విద్యా పురస్కారాలు, పరిశోధనా కార్యక్రమాలు కూడా ఏర్పాటయ్యాయి. ఎస్.ఆర్. శంకరన్ జీవితం మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని అందిస్తుంది. అధికారం అనేది ప్రజలపై పెత్తనం చెలాయించడానికి కాదు. వారి జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఉపయోగపడాలి. చట్టాలను అమలు చేయడమే కాకుండా, వాటి ద్వారా అణగారిన వర్గాలకు న్యాయం అందించాలి. నిజాయితీ, నిరాడంబరత, నిబద్ధత, మానవత్వం కలిస్తే ఒక ప్రభుత్వ అధికారి ప్రజల గుండెల్లో ఎలా చిరస్థాయిగా నిలిచిపోగలడో ఎస్.ఆర్. శంకరన్ జీవితం నిరూపిస్తుంది. ఆయన కేవలం ఒక ఐఏఎస్ అధికారి కాదు.. ప్రజాసేవకు అంకితమైన ఒక ఆదర్శం. ఆయన ఆదర్శ వారసత్వాన్ని మన జీవితాల్లో ప్రతిబింబించడమే ఆయనకు మనం అందించగల అత్యుత్తమ నివాళి.
ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు, సెల్ : 9491659899
ప్రజాసేవకే అంకితమైన మహోన్నతుడు ఎస్‌ఆర్.శంకరన్
- Advertisement -


