“మద్రాసు రాష్ట్రపు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, పండితుడు అయిన పి.వి.రాజమన్నారు ఇంట్లో గోడకి లెనిన్, మార్క్స్ ఆ పక్కనే గాంధీ చిత్రపటాలు తగిలించి ఉండేవట! వారి ఇంటికి వచ్చిన ఒకాయన ఆ ఫోటోలు వంక చూసి, ‘ఇద్దరు విప్లవకారులు పక్కన గాంధీ గారి బొమ్మ పెట్టారేమిటండీ?’ అని అడిగితే: రాజమన్నారు చిరునవ్వుతో, ‘గాంధీ కంటే పెద్ద విప్లవకారుడు ఎవరున్నారు? ఆయన వంటి విప్లవకారుడు ఇంతవరకు ఈ భూమి మీద పుట్టలేదు!’ అని సమాధానం ఇచ్చారట.
మా పెదన్నా వేటూరిప్రభాకర శాస్త్రిని తలచుకుంటే నాకు అదే స్ఫురిస్తుంది. మా స్వగ్రామం పెదకళ్ళేపల్లిలో ఆ రోజుల్లోనే ఆయన ఒక పెద్ద విప్లవకారుడు! మా ఊరి నాగేశ్వరస్వామి దేవాలయ ముఖద్వారం దగ్గర ఆ విప్లవం ఆరంభమైంది! లోపల ఒక బ్రాహ్మణ సంతర్పణ జరుగుతూ ఉంటే, ఒక అబ్రాహ్మణుడైన సాధువు ముఖద్వారం కంతలోనుంచి లోనికి తొంగిచూశాడట! లోపల నుండి ఒకాయన వచ్చి సంతర్పణ మైలపడిందని ఆ సాధువును తిట్టి పోశాడట. తన పదేళ్ళ వయస్సులో జరిగిన ఆ సంఘటన చూసిన తర్వాత శాస్త్రికి దేవాలయాలంటేనే విముఖత కలిగింది. ‘సాటి మనిషిని ప్రేమించలేని శివ పూజలెందుకు?’ అనే ఆలోచనా బీజం ఆనాటనే ఆయన మదిలో పడింది.
మూఢనమ్మకాలను పారదోలి, మానవతా విలువలకు నిరంతరం తన చేతలలో, మాటలలో పెద్దపీట వేసిన వేటూరి ప్రభాకర శాస్త్రి గురించి: వారి శతజయంతి సభలో వారి సోదరుడి తనయుడు వేటూరి సుందర రామ్మూర్తి చెప్పిన మాటలు ఇవి.
‘సాహిత్య చరిత్ర ఆ జాతి మనోవికాస వైభవానికి చిహ్నం’ అని గాఢంగా నమ్మిన వేటూరి ప్రభాకరశాస్త్రి 1888 ఫిబ్రవరి 7వ తేదీన కృష్ణాజిల్లా పెదకళ్ళేపల్లిలో శేషమ్మ, సుందరశాస్త్రి దంపతులకు జన్మించారు.
ప్రభాకర శాస్త్రి ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే సాగింది. తండ్రి వద్ద, మద్దూరి రామావధాని వద్ద సంస్కృతాంధ్ర భాషలు నేర్చుకున్నారు. ఉపనయనమైన తర్వాత ప్రభాకర శాస్త్రి ఆయన తండ్రి శాస్త్రాలు అభ్యసించడానికి చల్లపల్లి లోని అద్దేపల్లి సోమనాథ శాస్త్రి వద్ద చేర్పించారు. అప్పటికే తన అవధాన విద్వత్తుతో తెలుగునాట ఎంతో పేరు సంపాదించిన, చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి బందరు ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారని తెలుసుకొని, కొందరు సహాధ్యాయులతో కలిసి, తన 16 ఏళ్ళ వయసులో, వేటూరి వారు వెంకటశాస్త్రి గారి శిష్యరికం స్వీకరించారు. బందరులో విద్యాభ్యాసం చేస్తున్న కాలంలో కొండా వెంకటప్పయ్య, వల్లూరి సూర్యనారాయణరావు ఇంట నివసించారు. తెలుగులో తనకు తెలిసిందంతా వెంకట శాస్త్రి ముఖత’ విని నేర్చుకున్నదేనని, ఆ తర్వాత ప్రభాకర శాస్త్రి చెప్పుకున్నారు.
తన 19వ యేట మద్రాసు చేరి, వెస్లీ మిషన్ హైస్కూల్‌లో తెలుగు పండితునిగా రెండేళ్లు పనిచేశారు. ఆ సమయంలోనే వేపారామేశం వద్ద చరిత్ర, ఖగోళ శాస్త్రం అధ్యయనం చేశారు. 1910 లో పిసుపాటి మహాలక్ష్మమ్మతో వీరికి వివాహమైంది.
మద్రాసు ప్రాచ్యలిఖిత పుస్తకశాలకు వెళ్లి అక్కడ సహాయకునిగా చేరి ఇంగ్లీషు, కన్నడ, తమిళ భాషలు నేర్చుకున్నారు. చరిత్ర, సంస్కృతి, వాంగ్మయం, శాసనాలు, తాళపత్రాలు, కైఫీయతులు, గ్రంథాలు, సేకరించి పరిశీలించి పరిష్కరించి ముద్రించారు. ‘ఎన్నో బండ్లకు ఎత్తదగినంత సాహిత్య వాంగ్మయాన్ని శాస్త్రి సంతరించారు!’ అని ఆయన గురించి అందరూ ఆ రోజుల్లో అంటూ ఉండేవారు.
ప్రభాకర శాస్త్రి తెలుగులో అనేక కావ్యాలతో పాటు అనువాదాలు, వివరణ గ్రంథాలు కూడా రచించారు. పుస్తకాలయంలో అనేక తెలుగు గ్రంథాలను చారిత్రక ఆధారాలతో సవివరంగా పరిష్కరించి ప్రకటించారు.
శ్రీనాథుడు ప్రభాకర శాస్త్రికి నచ్చిన మహాకవి. ఆయన పద్యాలలోని రహస్య మెలకువలెన్నో ఎన్నుకొని తెలుగువారికి అందించారు. క్రీడ్ఙాó రామానికి విస్తారమైన పీఠిక రాసి దానికి వెలుగు చూపిన మహాశయులు వీరు! హరవిలాసం వీరు పరిష్కరింపగా ఆనంద ముద్రణాలయం వారు అచ్చు వేశారు. వీరు ఒక తీరునకు తెచ్చిన కాశీఖండం వావిళ్ళవారు వెలువరించారు.
‘తంజావPరి ఆంధ్ర రాజుల చరిత్రకు’కు వీరు రచించిన ముందుమాట చాలా గొప్పది. ఆంధ్ర విశ్వకళాపరిషత్తు ప్రకటించిన రంగనాథ రామాయణానికి వీరి తోడ్పాటును పెద్దలు ప్రశంసించారు.
ఈయన పిన్న వయసు శతావధాని. ‘కలికి చిలుక’ను పలికించిన కథకుడు! కడుపు తీపి, దివ్య దర్శనం, మూన్నాళ్ళ ముచ్చట, కపోత కథ వంటి ఖండకావ్యాల విరచితుడు! తెలుగు సంస్కృతీ చరిత్రను దక్షిణ దేశమంతా ఈది మరీ ఒడ్డుకు చేర్చిన సాహిత్య ఘనాపాఠి!
అన్నమాచార్య కీర్తనలు, తొలి తెలుగు రచయిత్రి తిమ్మక్క, తొలి తెలుగు శాసనము: ఇవన్నీ వీరందరూ, ఈరోజు మనకు అందుబాటులో ఉండటానికి ముఖ్యకారకుడు వేటూరి ప్రభాకర శాస్త్రే! ఆయన అనేక సంస్కృత రూపకాలను తెలుగులోకి అనువదించారు.
వేటూరి ప్రభాకరశాస్త్రి నిరాడంబర జీవి. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా జీవితం మొత్తం సాహిత్యసేవ కొరకు వినియోగించిన మహోన్నతమైన వ్యక్తి. ప్రభాకర శాస్త్రి అంటే సాహిత్య మేరు పర్వతం! ఆయన రాయని పీఠికలేదు. తరచని సాహిత్యమూ లేదు. తిరగేయని శాసనము, సేకరించని తాళపత్రమూ లేదు… దేశభక్తిలో అనుపమానమైన వారు.
వారు మాస్టర్ సి.వి.వి. శిష్యులై, యోగసాధన చేసి, ఆధ్యాత్మిక తీరాలను చూసి తన వంటి వారెందరో శిష్యులను తయారుచేసి, దీనులను ఉధ్ధరించారు.
ఆయనలో కరుణ, దయ, ప్రేమ, శాంతం, గంభీర్యం స్పష్టంగా కనిపిస్తాయి. ఆయన ముఖం చూస్తే చాలు, మానసిక ప్రశాంతి లభిస్తుందని చాలామంది ఆ రోజుల్లో చెప్పుకునేవారుట!
తెలుగు కవి, భాషా పరిశోధకుడు, చరిత్రకారుడు, రచయిత, విమర్శకుడు, రేడియో నాటక రచయిత, తెలుగు సంస్కృత పండితుడు అయిన వేటూరి ప్రభాకర శాస్త్రి 1950 ఆగస్టు 29వ తేదీన స్వర్గస్తులయ్యారు.
సెల్: 94403 18415
ప్రతిఫలాపేక్ష లేని పరిశోధకుడు
- Advertisement -


