బ్రెజిల్ అధ్యక్ష అభ్యర్థుల న్యాయ పోరాటం
సామాజిక మాధ్యమాల జోక్యంపై ఆరోపణలు
బ్రసీలియా: బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల వేళ అక్కడి రాజకీయాలు వేడెక్కాయి. వామపక్ష అభ్యర్థి, అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లూలా డ సిల్వాకు మిగవాదపక్ష అభ్యర్థి ఫ్లావియో బోల్సనారో మధ్య హోరాోరీ పోటీ నెలకొన్నది. ఈనెల 25న తుది విడత ఎన్నికలు జరగనున్నాయి. అయితే సామాజిక మాధ్యమాల జోక్యానికి సంబంధించి రెండు వర్గాలు పరస్పరం ఆరోపణలకు దిగాయి. తమ ప్రత్యర్థిపై అనర్హత వేటు వేయాలంటూ అటు బోల్సనారో, ఇటు లూలా వర్గీయులు డిమాండ్ చేశాయి. వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కోరాయి. ప్రచారంలో భాగంగా పరస్పరం ఆరోపణలపర్వం కొనసాగించాయి. ఇదే క్రమంలో బోల్సనారో తరపు న్యాయవాదులు మంగళవారం బ్రెజిల్ సుపీరియర్ ఎలక్టోరల్ కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ప్రచారంలో వాట్సాప్ సందేశాల విస్తృత ప్రచారం జరిగిందని, లూలా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ ప్రయోజనాలు, వివిధ పథకాల గురించి ప్రచారం చేసుకున్నట్లు పేర్కొన్నాయి. అధ్యక్షుడు లూలాతో పాటు సామాజిక సమాచార శాఖ మంత్రి సిడోనియో పాల్మెయిరాపై అనర్హత వేటుకు డిమాండ్ చేశారు. ఎనిమిదేళ్ల పాటు వారిద్దరు ఎలాంటి పదవులు చేపట్టకుండా ఆదేశాలివ్వంటూ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇదిలావుంటే, సాంకేతిక దిగ్గజం ‘మెటా’…ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటోందని లూలా తరపు ప్రచార బృందం ఆరోపించింది. బోల్సనారోను పోటీ చేయనివ్వరాదని, అనర్హుడిగా ప్రకటించాలని కోరుతున్నట్లు అధికార వర్గం వెల్లడించింది. లూలా విజయావకాశాలను దెబ్బతీసే లక్ష్యంతో మెటా ‘అల్గారిథమిక్ మానిప్యులేషన్’కు పాల్పడిందని ఆయన ఎన్నికల ప్రచార బృందానికి చెందిన ఒకరు తెలిపారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల మాతృసంస్థ మెటా… లూలాకు సంబంధించిన కంటెంట్ వ్యాప్తిని అడ్డుకుంటూ బోల్సనారోకు అనుకూలంగా వ్యవహరిస్తోందని లూలా బృందం గతంలోనూ ఆరోపణలు చేసింది. ఇద్దరు అభ్యర్థుల ప్రచార బృందాల విషయంలో మెటా ఒకేలా వ్యవహరించాలని, వివక్ష చూపడం లేదని రుజువు చేసుకోవాలని సుపీరియర్ ఎలక్టోరల్ కోర్టు ఆదేశించింది. ఆదేశాలు బేఖాతరు చేస్తే రోజుకు రెండు లక్షల డాలర్ల జరిమానా విధిస్తామని మెటాను హెచ్చరించింది. కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉన్నట్లు మెటా మంగళవారం స్పష్టం చేసింది. ఇదిలావుంటే అధ్యక్ష ఎన్నికల్లో లూలా, బోల్సనారో మధ్య గట్టి పోటీ ఉంది. తొలి విడత పోలింగ్లో బోల్సనారోకు 47 శాతం ఓట్లు రాగా, లూలాకు 45 శాతం ఓట్లు వచ్చాయి.
దీంతో తుది విడత ఉత్కంఠభరితంగా మారింది. సర్వేలు కూడా ఇద్దరి మధ్య గట్టి పోటీ నెలకొన్నట్లు తెలిపాయి. సోషల్ మీడియా ప్రభావం, ప్రచార నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు, ప్రత్యర్థుల అనర్హతకు సంబంధించిన న్యాయపోరాటాలు బ్రెజిల్ రాజకీయాల్లో కీలక చర్చనీయాంశాలుగా మారాయి.


