అరుణాచల్‌లో ముఖాముఖి… చైనా స్పందన
బీజింగ్: అరుణాచల్‌ప్రదేశ్‌లో భారత బలగాలతో చైనా సైన్యం ముఖాముఖి తలపడినట్లు వచ్చిన వార్తలపై చైనా విదేశాంగ శాఖ స్పందించింది. ఇరు దేశాల మధ్య కుదిరిన సంబంధిత ఒప్పందాలు, కీలక అవగాహనలకు చైనా ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని కాపాడటంతో పాటు సరిహద్దుల్లో స్థిరత్వాన్ని కొనసాగించేందుకు సాధారణ గస్తీ, నిర్వహణ కార్యకలాపాలు చేపడుతున్నట్లు వెల్లడించింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్ సోమవారం ఈ మేరకు ప్రకటన చేశారు. సరిహద్దు సమస్యలపై భారత్‌తో దౌత్య, సైనిక మార్గాల్లో సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇరు దేశాలు పరస్పరం కుదుర్చుకున్న అవగాహనలను అమలు చేసేందుకు భారత్ కూడా సహకరించాలని, సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతను కాపాడేందుకు ఆచరణాత్మక చర్యలు తీసుకోవాలని చైనా ఆశిస్తోందని పేర్కొన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)తో ముఖాముఖి పరిస్థితులు కొనసాగుతున్నాయంటూ వచ్చిన వార్తలపై భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) శుక్రవారం స్పందించింది. ఈ అంశానికి సంబంధించిన నిర్దిష్ట వివరాల కోసం రక్షణ శాఖను సంప్రదించాలని సూచించింది. చైనా బలగాలు గతంలో అనుసరిస్తున్న గస్తీ విధానాలకు భిన్నంగా వ్యవహరించినప్పుడు భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు అప్పుడప్పుడు ఉద్రిక్తంగా మారుతున్నాయని విదేశాంగ శాఖ పేర్కొంది. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి అపోహలు, తప్పుడు అంచనాలు తలెత్తకుండా చూడటంతో పాటు, పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించేందుకు ఇరు దేశాలు ఇప్పటికే ఉన్న దౌత్య, సైనిక మార్గాలను వినియోగించుకుంటున్నాయని తెలిపింది. సరిహద్దుల నిర్వహణ మరింత మెరుగుపడేందుకు ఎల్ఏసీపై పరస్పర అవగాహన పెంపొందించుకునే అంశాలపైనా చర్చించేందుకు ఇరు దేశాలు అంగీకరించినట్లు వెల్లడించింది. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతత కొనసాగడం ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర అభివృద్ధికి అత్యంత కీలకమని భారత్ స్పష్టం చేసింది.
సరిహద్దు సమస్య పరిష్కారంపై చర్చలు
ఈ ఏడాది ఆగస్టు 25న బీజింగ్‌లో భారత్, చైనా మధ్య సరిహద్దు సమస్యపై ప్రత్యేక ప్రతినిధుల (ఎస్ఆర్) 25వ విడత చర్చలు జరిగాయి. ఇరు దేశాల నాయకులు ఇచ్చిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని, సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతతను కొనసాగించాలని ఈ సమావేశంలో రెండు దేశాలు పునరుద్ఘాటించాయి. ద్వైపాక్షిక సంబంధాలు ఆరోగ్యకరంగా, స్థిరంగా అభివృద్ధి చెందేందుకు అనుకూల వాతావరణాన్ని సృష్టించుకోవాలని నిర్ణయించాయి. సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం కొనసాగించడం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరచుకోవాలన్నది ఇరు దేశాల లక్ష్యంగా ఉంది.
భారత్‌తో ఒప్పందాలకు కట్టుబడి ఉన్నాం
- Advertisement -
RELATED ARTICLES


