- రైతుల సమక్షంలోనే సమగ్ర భూ సర్వే
- ‘22ఏ’ సమస్యలపై చొరవ చూపాలి
- రెవెన్యూ-అటవీ సరిహద్దు వివాదాలకూ పరిష్కారం: మంత్రి పొంగులేటి
విశాలాంధ్ర – హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల ప్రయోజనాల కోసమే భూముల రీసర్వే చేపడుతున్నా మని, భూ సమస్యల పరిష్కారానికి వారి సమక్షంలోనే రీసర్వే జరగాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. రీసర్వే గ్రామాల్లో ప్రతిరోజు తహసీల్దార్లు పర్యటించాలని, ఆర్డీవో, అదనపు కలెక్టర్లు, కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించడమేగాక కనీసం వారానికో రోజు రీసర్వే గ్రామాలకు వెళ్లాలని స్పష్టం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి భూ సర్వే, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, హౌసింగ్ అంశాలపై రంగారెడ్డి జిల్లా ఇంచార్జి మంత్రి డి. శ్రీధర్ బాబుతో కలిసి మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్లో బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ … ఏడాదిలోగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అంగుళం భూమిని సమగ్రంగా సర్వే చేసి, భూ యజమాను లకు పూర్తి భద్రతతో కూడిన వివాదరహిత భూములను అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. భూమి ఉన్న ప్రతి రైతుకు ఆధార్‌కార్డు తరహాలో వారి భూమికి సంబంధించిన సమగ్ర, భద్రతతో కూడిన రికార్డులు, పాస్‌బుక్కులు అందించాలన్నది సంకల్పమని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని చట్టంలో నిర్దేశించిన విధంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన రెవెన్యూ గ్రామాల్లో మొదటి విడతగా వేగవంతంగా చేపట్టనున్నట్లు వెల్లడించారు. నేరుగా జిల్లాలకు వచ్చి స్థానిక ప్రజాప్రతినిధులు, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారులతో సమావేశమై సమస్యలను సమీక్షిస్తున్నట్లు చెప్పారు. సమస్యలను స్పష్టంగా తెలియజేస్తే అక్కడికక్కడే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా సమస్యలను తప్పుదోవ పట్టించి ప్రజలను ఇబ్బందులకు గురిచేసే అధికారులపై తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దాదాపు 125 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో మరోసారి ఇంత విస్తృత స్థాయిలో సమగ్ర భూ సర్వే చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ సర్వే ద్వారా రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సరిహద్దు వివాదాలు, పట్టా భూములకు సంబంధించిన సమస్యలు, భూముల హద్దులపై నెలకొన్న వివాదాలు వంటి అంశాలను కూడా గుర్తించి పరిష్కరిం చేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. రీసర్వే విజయవంతం కావడానికి అధికారులు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. 22ఏ కు సంబంధించిన సమస్య ల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, మనోహర్ రెడ్డి, అరికేపూడి గాంధీ, బండారు లక్ష్మారెడ్డి, ఈర్లపల్లి శంకర్, మర్రి రాజశేఖర రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


