‘అర్నాబ్’ బీభత్సం… ప్రకృతి ప్రకోపం… తీరంలో జల విల యం…అన్నదాతల గుండెల్లో హాహాకారం… వలలు ఛిద్రం… పైర్లు నేలమట్టం… ఆక్రందనల తీరాన అభాగ్యులు…కరువుపై ‘అర్నాబ్’ పిడుగు కోలుకోలేనిది. ఒకవైపు ముఖం చాటేసిన వర్షాలు, చుక్క నీరు లేక నెర్రెలు బారిన నేలలు, కరువు కోరల్లో చిక్కుకుని అల్లాడు తున్న అన్నదాతల ఆకలికేకలు… సరిగ్గా ఇలాంటి విపత్కర తరు ణంలో ప్రకృతి మరో రూపంలో విరుచుకుపడింది. మొన్నటిదాకా తీవ్ర దుర్భిక్షంతో అల్లాడిన ఆంధ్రప్రదేశ్‌ను ఇప్పుడు ‘అర్నాబ్’ తుపాను కోలుకోలేని దెబ్బ తీసింది. కరువుతో అల్లాడిన నేలపై ఆశల చిగుళ్లు మొలకెత్తుతాయనుకుంటే, పెను తుపాను రూపంలో వచ్చిన జలప్రళయం సర్వస్వాన్నీ తుడిచిపెట్టేసింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలను అతలాకుతలం చేస్తూ అర్నాబ్ సృష్టించిన విలయతాండవం సామాన్య ప్రజల, కర్షకుల జీవన గమనాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఆకాశం చిల్లులు పడిందా అన్నట్లు కురిసిన కుండపోత వర్షాలు, గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో వీచిన తీవ్రగాలులు కోస్తా తీరాన్ని శ్మశాన నిశ్శబ్దంలోకి నెట్టేశాయి. అర్నాబ్ దాటికి ఉత్తరాంధ్ర తీరం అతలాకుతలమైంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తీరప్రాంత గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గోదావరి డెల్టాలో పచ్చటి పైర్లు సముద్రపు నీటిమట్టాన్ని తలపించేలా నీటమునిగాయి. వందలాది కిలోమీటర్ల మేర రహదారులు కొట్టుకుపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలమట్టమై,వేలాది గ్రామాలు అంధకారంలో మునిగిపోయాయి. భారీ వృక్షాలు కూలిపడి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఒక్క కోన సీమలోనే 43 వేల చెట్లు కూలిపోయాయి. అందులో 33 వేలు కొబ్బరి చెట్లే. 16వేల విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. 3,872 గ్రామాలకు కరెంటుపోయింది. విద్యుత్ సంస్థలకు రూ.17 కోట్లు నష్టం వాటిల్లింది. పూరిళ్లు నేలమట్టమవగా, రేకుల షెడ్లు గాలికి ఎగిరిపోయి వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కాకినాడ తీరంలోని యాంకరేజి పోర్టులో 1200 టన్నుల బరువుండే బార్జిలు కర్రముక్కల్లా ఎగిరిపడ్డాయంటే పెనుగాలి తీవ్రత ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాగునీరు దొరక్క, తినడా నికి తిండి లేక సహాయక శిబిరాల కోసం దీనంగా ఎదురుచూస్తున్న బాధి తుల రోదనలు గుండెల్ని పిండేస్తున్నాయి. రైతాంగం పరిస్థితి దయనీయం. ఈ ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచే తీవ్ర వర్షాభావ పరిస్థి తులు రాష్ట్రాన్ని కుంగదీశాయి. అరకొర వర్షాలతో, అప్పులు చేసి, ఎంతో వ్యయప్రయాసల కోర్చి అక్కడక్కడా వేసుకున్న వరి, పత్తి, వేరుశనగ, చెరకు వంటి పంట లను కాపాడుకోవడానికి రైతులు పడరాని పాట్లు పడ్డారు. తీరా పైరు చేతి కొచ్చే దశలో ఈ అర్నాబ్ ముంచెత్తింది. వందలాది ఎకరాల్లో పంట పొలాలు ఇసుక మేటలు వేసి చెరువులను తలపిస్తున్నాయి. ఉద్యానవన పంటలైన అరటి, బొప్పాయి, కొబ్బరి తోటలు నేలమట్టమయ్యాయి. ఏకంగా 3,08,000 హెక్టార్లలో పంటనష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. కరువు మిగిల్చిన నష్టాన్ని పూడ్చుకుందామనుకున్న అన్నదాతను ఈ తుపాను నిలువునా ముంచేసింది. పెట్టుబడులు పోయి, చేతికొచ్చిన పంట నేలపాలై, అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులకు భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తోంది. విద్యుదాఘాతం, చెట్లు, స్తంభాలు పడి 9 మంది మృతిచెందారు. మొత్తంగా అపారనష్టం… తీరని కష్టాన్ని మిగిల్చింది. ఇక ఈ జలవిలయంలో ఎవరికీ పట్టని అభాగ్యులుగా మిగిలింది కౌలురైతులు, మత్స్యకార సోదరులే. రాష్ట్రంలో సాగవుతున్న భూముల్లో అధిక శాతం కౌలు రైతుల చేతుల్లోనే ఉన్నప్పటికీ, ప్రభుత్వ రికార్డుల్లో వారికి స్థానం దక్కకపోవడం శాపంగా మారింది. భూ యజమానులకు కౌలు చెల్లించి, పైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు తెచ్చిన పెట్టుబడులన్నీ నీటిపాలయ్యాయి. పంట నష్టపరిహారం పట్టాదారుల ఖాతాల్లోకే వెళ్తుందన్న ఆందోళన వారిని నిలువునా దహిస్తోంది. అటు తీరప్రాంత మత్స్యకారుల బతుకులు మరింత ఘోరంగా ఛిద్రమయ్యాయి. పెనుగాలుల ధాటికి వేలాది మరబోట్లు, సంప్రదాయ పడవలు తీరంలో ఒకదానికొకటి ఢీకొని ధ్వంసమయ్యాయి. జీవనాధారమైన వలలు, ఇంజిన్లు సముద్రపు ఉప్పెనలో కొట్టుకుపోయాయి. లంగరు వేసిన చోటే బోట్లు మునిగిపోయి, జీవితకాల సంపాదనంతా క్షణాల్లో బుగ్గిపాలవడంతో మత్స్యకార కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. ఈ పెను విపత్తు వేళ పాలకుల ముందస్తు సన్నద్ధత ఎక్కడ అనే ప్రశ్న మారుతోందని వాతావరణ శాఖ రోజులు తరబడి హెచ్చరిస్తున్నా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. విపత్తు నిర్వహణ సంస్థల సమీక్షలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో, బలహీనంగా ఉన్న చెరువు కట్టలను, ఏటిగట్లను పటిష్టం చేయడంలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాటిలైట్ సమాచారం అందుబాటులో ఉన్న నేటి కాలంలో కూడా తుపాను తీవ్రతను అంచనా వేసి కనీస రక్షణ చర్యలు చేపట్టకపోవడం క్షమించరాని నేరం. గతంలో వచ్చిన హుద్‌హుద్, తిత్లీ వంటి తుపాన్ల విధ్వంసం నుంచి ప్రభుత్వాలు పాఠాలేమీ నేర్చుకున్నట్లుగా కనపడటం లేదు. 2014లో హుద్‌హుద్ విశాఖను అతలాకుతలం చేసినప్పుడు, ఆ తర్వాత శ్రీకాకుళాన్ని తిత్లీ దెబ్బతీసినప్పుడు యంత్రాంగం చూపిన చురుకుదనం నేడు కొరవడిన విషయం స్పష్టంగా గోచరించింది. గత అనుభవాల ఆధారంగా తీర ప్రాంతాల్లో శాశ్వత పునరావాస కేంద్రాలు, పటిష్టమైన డైనేజీ వ్యవస్థలు, భూగర్భ విద్యుత్ లైన్ల వంటి మౌలిక వసతులు నిర్మిస్తామన్న హామీలు ఏమయ్యాయి? ప్రతి తుపాను వచ్చినపðడల్లా తాత్కాలికంగా సహాయక చర్యల పేరిట హడావుడి చేయడం, ఆ తర్వాత విపత్తు నివారణ ప్రణాళికలను అటకెక్కించడం పరిపాటిగా మారింది. కేవలం అధికారులతో టెలికాన్ఫరెన్సులు, ఫోటోషూట్లతో సరిపెడితే బాధితుల కడుపు నిండదు. ప్రభుత్వం తక్షణమే మేల్కొని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలను వేగవంతం చేయాలి. మొదటిగా, జలదిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాలకు ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు, అత్యవసర మందులను డ్రోన్లు లేదా పడవల ద్వారా తక్షణమే చేరవేయాలి. అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి బ్లీచింగ్, క్లోరినేషన్ చర్యలు ముమ్మరం చేయాలి. విద్యుత్ పునరుద్ధ రణ పనులు చేపట్టి, తెగిపోయిన రహదారులకు తాత్కాలిక మరమ్మతులు చేసి రాకపోకలను పునరుద్ధరించాలి. పంట నష్టాన్ని అంచనా వేయడానికి క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే జరిపించాలి. పంట నష్టపరిహారం నేరుగా కౌలురైతు చేతికే అందేలా ప్రత్యేక నిబంధనలు రూపొందించాలి. ధ్వంసమైన మత్స్యకారుల బోట్లకు, కొట్టుకుపోయిన వలలకు తక్షణమే పూర్తిస్థాయి పరిహారం చెల్లించి, ఉచితంగా డీజిల్, జీవనోపాధి అలవెన్సులు అందించాలి. ఇళ్లు కోల్పోయిన పేదలకు తక్షణ ఆర్థిక సాయంతో పాటు పక్కా గృహాల నిర్మాణానికి పక్కా ప్రణాళిక ప్రకటించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిని కేవలం ఒక రాష్ట్ర సమస్యగా చూడకుండా, జాతీయ విపత్తుగా పరిగణించి ఉదారంగా నిధులు కేటాయించాలి. కేంద్ర బృందాల పర్యటనల పేరుతో కాలయాపన చేయకుండా ముందస్తు సహాయంగా తగినంత నిధిని విడుదల చేయాలి. ప్రకృతి వైపరీత్యాలను ఆపడం మానవమాత్రుల వల్ల కాకపోవచ్చు, కానీ సరైన ముందస్తు ప్రణాళిక, చిత్తశుద్ధితో కూడిన విపత్తు నిర్వహణ ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చు. కరువుతో కడుపు ఎండి, తుపానుతో ఇల్లు వాకిలి కోల్పోయి రోడ్డున పడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇప్పుడు కావాల్సింది దగాకోరు ప్రకటనలు కాదు… భరోసానిచ్చే చేతులు, ఆదుకునే పటిష్టమైన చర్యలు.


