Homeతెలంగాణయాదవుల ఆత్మగౌరవానికి పెద్దపీట

యాదవుల ఆత్మగౌరవానికి పెద్దపీట

- Advertisement -
  • రాజకీయాల్లో సముచిత స్థానం
  • హైదరాబాద్ అభివృద్ధిలో వీరి పాత్ర అమోఘం
  • సదర్ సమ్మేళనానికి రాష్ట్ర పండుగ హోదా: సీఎం రేవంత్

విశాలాంధ్ర – హైదరాబాద్: యాదవ సోదరుల ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సదర్ సమ్మేళనం కేవలం యాదవులకే పరిమితమైన కార్యక్రమం కాదని, ఇది తెలంగాణ ప్రజలందరి ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో బుధవారం సదర్ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన సీఎం యాదవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హైదరాబాద్ నగర చరిత్రలో యాదవుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ప్రస్తుతం గోల్కొండ కోటగా పిలుస్తున్న ప్రాంతం ఒకప్పుడు గొల్లంకొండగా ప్రసిద్ధి చెందిందని గుర్తుచేశారు. యాదవ సోదరుల సహకారం, ఆదరణతోనే హైదరాబాద్ నగరం ఇంతగా అభివృద్ధి చెందిందని చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రజలను యాదవ సోదరులు అక్కున చేర్చుకుని ఆదరించారని కొనియాడారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ సదర్ సమ్మేళనాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించాలనే ఆలోచన చేయలేదని, తమ ప్రభుత్వం యాదవ సోదరుల ఆకాంక్షలకు అనుగుణంగా సదర్ సమ్మేళనానికి రాష్ట్ర పండుగ హోదా కల్పించిందని తెలిపారు. సమ్మేళనం నిర్వహణ కోసం రూ.5 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.యాదవులకు సముచిత రాజకీయ, సామాజిక ప్రాధాన్యత కల్పించామని చెప్పారు. అనిల్ కుమార్ యాదవ్‌కు రాజ్యసభ సభ్యుడిగా, నవీన్ యాదవ్‌కు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించామని, ఈశ్వరమ్మ యాదవ్‌ను యాదగిరిగుట్ట ఆలయ బోర్డు సభ్యురాలిగా నియమించామని వివరించారు. యాదగిరిగుట్ట గోశాలలో గోవుల సంరక్షణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో యాదవులకు దక్కాల్సిన వాటా వారికి దక్కేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణను దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు. మూసీ అభివృద్ధి, మెట్రో రైలు విస్తరణ, భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ స్నేహం దేశానికి అవశ్యం: మహేశ్ కుమార్
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ … బీహార్ నుంచి వచ్చిన తేజస్వీ యాదవ్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తేజస్వీ ముఖంలో రాహుల్ గాంధీ కనిపిస్తున్నారని, ఆయన రాహుల్ గాంధీకి కవల సోదరుడిలా ఉన్నారని అన్నారు. రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ మధ్య కొనసాగుతున్న స్నేహం ఇలాగే కలకాలం నిలవాలని ఆకాంక్షించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో దేశానికి వీరిద్దరి స్నేహం ఎంతో అవసరమని అన్నారు. మాజీ గవర్నర్ బాండారు దత్తాత్రేయ, మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు