. భూకంప నిరోధకంగా నిర్మాణాలు
. ధ్వని, వాయు కాలుష్య రహితం
. పచ్చదనానికి ప్రాధాన్యం
. విరివిగా సోలార్ ప్యానల్స్ వినియోగం
. పకడ్బందీగా పర్యావరణ నిబంధనల అమలు
విశాలాంధ్ర-సచివాలయం:రాజధానిలో నిర్మాణాలు, అభివృద్ధికి సంబంధించి పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన శిక్ష తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నియమ, నిబంధనలు అమల్లోకి తేనుంది. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా రాజధానిలో భవన నిర్మాణాలు, రహదారులు, వంతెనలు., ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతి అంశంలో పర్యావరణ అనుమతుల పర్యవేక్షణకు సాంకేతికతను సంస్థలు అమలు చేయనున్నాయి. విపత్తుల నిర్వహణలో భాగంగా రాజధాని నగర ప్రాంతాన్ని భూకంప నిరోధక జోన్-3 పరిధిగా ఇప్పటికే గుర్తించారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని భూకంప ప్రతిపస్పందన నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వం కన్సల్టెన్సీలను ఆదేశించింది. చట్టాల్లోని సైస్మిక్ జోన్-3 భవననిర్మాణ రూపకల్పన అవసరాన్ని గుర్తించటంతో పాటు లైసెన్స్ కలిగిన నిర్మాణరంగ ఇంజినీర్ల నుంచి స్థిరత్వ, భూకంప, వాయు నిరోధక ధృవీకరణ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. నిర్మాణ దశలో పర్యావరణ సమస్యలను నిలువరించేందుకు ఉపశమన చర్యలను కూడా నిపుణులు నిర్ధారించాల్సి ఉంటుంది. సింగపూర్ మాస్టర్ ప్లాన్, ప్రపంచ బ్యాంక్ ప్రతిపాదనల మేరకు రాజధానిలో 30 శాతం పచ్చదనానికి కేటాయించాల్సి ఉంటుంది. దీంతో పాటు భవనాలు, మౌలిక సదుపాయాలు వర్షపు, వరదనీటి నిర్వహణ, డ్రైనేజీ, విద్యుత్ అన్నీ పర్యావరణ హితంగా ఉండేలా నగర నిర్మాణానికి అనువుగా ఉండేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలను రాజధాని అమరావతి నగర చట్టాలను సమ్మిళితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అమరావతిలో ప్రతి నిర్మాణంలో పర్యావరణ నిబంధన తప్పనిసరి కానుంది. జలవనరులకు సంబంధించి వర్షపునీటి సేకరణ, నిర్మాణాల స్థితిగతులను నిర్ధారించాల్సి ఉంటుంది. భారీ వర్షాలను పరిగణనలోకి తీసుకోవటం ద్వారా వర్షపునీటి నిల్వ, వినియోగ వ్యవస్థలను అందుబాటు లోకి తేనున్నారు. కొన్ని దశాబ్దాలుగా రాజధాని నగరంలో వర్షపాతం నమోదు వివరాలను ఇప్పటికే అధికారులు నిశిత పరిశీలన జరిపారు.
భవన నిర్మాణ అనుమతిని ఆమోదించే సమయంలోనే ధృవీకరించిన నిపుణుల నుండి ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ ను జతపరచాలి. ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా ఫ్లైయాష్ ఇటుకలు, పీపీసీ సిమెంట్ కాంక్రీటుతో సహా లోతట్టు ప్రాంతాలు, రోడ్లు, సమాంతర కట్టలు, వరదప్రభావిత ప్రాంతాలను గుర్తించి ప్లాట్ ఫామ్ ఎత్తును పెంచేందుకు కూడా అధికారిక ధృవీకరణ అవసరమవుతుంది. జీవావరణ, వారసత్వంలో భాగంగా రాజధాని అమరావతి పరిసరాల్లో ఉన్న అన్ని పురావస్తు, సాంస్కృతిక, పర్యావరణ పరంగా సున్నిత ప్రాంతాలైన నదీ ముఖద్వారాలు, మడ అడవులు, రాతి ప్రదేశాలు, గుహలకు ఎలాంటి విఘాతం కలిగించే విధంగా నిర్మాణాలు చేపట్టరాదు. ఉండవల్లి గుహల రక్షణలో భాగంగా ఆ ప్రాంతంలో 100 నుంచి 300 మీటర్లలోపు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు అనుమతించరు. దీన్ని ప్రత్యేక జోన్ గా పరిగణిస్తారు. పురావస్తు చట్టం 1958కు విరుద్ధంగా ఎలాంటి అభివృద్ధి కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉండదు. గ్రీన్ బెల్ట్ అభివృద్ధిలో భాగంగా గ్రీన్ కారిడార్లు, అవెన్యూ ప్లాంటేషన్, తోటల పెంపకం. పచ్చదనం పై సీఆర్డీఏ సలహా కమిటీ మార్గదర్శకాలకు అనుగుణగా డెవలపర్లు బహిరంగ ప్రదేశాలతో పాటు భారీ వృక్షాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. గ్రీనరీలో భాగంగా స్థానిక వృక్షజాతుల వైవిధ్యాన్ని ప్రభావితం చేయరాదు. కార్బన్ నిల్వలను పెంపొందించేందుకు బహిరంగ ప్రదేశాల్లో వాయు కాలుష్య కారకాలను సింక్ లలుగా పనిచేసేలా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. రవాణా సమయంతో పాటు నిల్వచేసిన ఖనిజాలు, ఇసుక, సిమెంట్ వంటి మెటీరియల్ కు టార్పాలిన్ కవరింగ్ తప్పనిసరి. దుమ్ము, ధూళి ఉత్పత్తికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో తరచు నీటిని చల్లటంతో పాటు ఈ పరికరాల నుంచి వెలువడే వాయు ఉద్గారాలు డిజైన్ స్పెసిఫికేషన్లలో నిర్వహించేలా క్రమం తప్పకుండా సర్వీస్ చేయించాలి. యంత్రాలపై ఇన్సులేటింగ్ క్యాస్ లు, శబ్ద నియంత్రణ, కంప్రెసర్, జనరేటర్ ధ్వని, వాయు కాలుష్య నియంత్రణకు రబ్బర్, సీసం షీట్లు వినియోగించాలి. రాజధాని నిర్మాణంలో భాగంగా పలు కాంట్రాక్టు సంస్థలు ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో కార్మిక శిబిరాల్లో పేరుకుపోయిన బురదను తొలగించి, నిర్మాణాల నుంచి వెలువడే ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన పరికరాల వినియోగంపై ధృవీకరణ పొందాలి. కార్మికులకు ఇన్లెట్, ఔట్లెట్ మస్టర్లు, ఇయర్మఫ్న్ అందించాలని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. రాత్రి సమయంలో శబ్ద కాలుష్యాన్ని నియంత్రించాల్సి ఉంటుంది. రాజధానిలో ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా బల్క్ జనరేటర్లు వాణిజ్య సముదాయాలతో పాటు 50 కుటుంబాల ప్రాంగణంలో ప్రాసెస్ చేసేందుకు తగిన సేంద్రీయ వ్యర్ధాల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకోవాలి. సీఎఫ్ షరతుల్లో భాగంగా 50 నివాస యూనిట్లు, సంస్థాగత, వాణిజ్య ప్రాజెక్టులు కలిగిన అన్ని భవనాల్లో డ్యూయల్ ప్లంబింగ్తో మంచినీరు, శుద్ధిచేసిన వ్యర్థ జలాల రవాణాకు ప్రత్యేక వ్యవస్థను డెవలపర్లు ప్రత్యేక నిల్వ ట్యాంకులను ఏర్పాటు చేసుకోవాలి. శుద్ధిచేసిన మురుగునీటిని అదే ప్రాంగణంలో వన సంరక్షణకు ఉపయోగించేలా నిబందనలు రూపొందించారు. భూమి పొరల్లో 30 సెంటీమీటర్ల లోతు వరకు సంరక్షించి ఉద్యానవనాల ప్రయోజనాలకు వినియోగించుకోవాలి. ఈ మేరకు ధృవీకరణ సర్టిఫికెట్ తప్పనిసరి, వాహనాలకు తగినంత పార్కింగ్ ప్రదేశాన్ని కేటాయించి పర్యావరణ నిబంధనలు పాటించాలి. జలవనరులు, రైల్వేలు, విద్యుత్ లైన్లు, విమానాశ్రయం, చమురు, గ్యాస్, పైపులైన్లు, వారసత్వ నిర్మాణాలు, ఈఐఏ నోటిఫికేషన్ సమీపంలో అభివృద్ధి కార్యకలాపాల పరిమితిపై పూర్తి స్థాయిలో ఆధ్యయనం చేయనున్నారు. ఇందులో భాగంగా భవన నిర్మాణ నిబంధనలను కూడా సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జలవనరులకు సంబంధించి వర్షపునీటి సేకరణ నిర్మాణం, ప్లాట్ పరిమాణంతో నిమిత్తం లేకుండా అన్ని భవనాలకు వర్తిస్తుంది. రాజధాని నగరం, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ప్రాంతంలో అభివృద్ధికి సంబంధించిన దరఖాస్తులు ఐజీబీసీ, ఈసీబీసీ, జీఆర్‌ఐహెచ్‌ఎ, ఎడ్జ్ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. 200 చదరపు మీటర్లు అంతకంటే ఎక్కువ ఉన్న ప్లాట్లలో నివాస, వాణిజ్య, సంస్థాగత అభివృద్ధి, పునర్వినియోగానికి నీటి నిల్వ ట్యాంకుల ఏర్పాటు తప్పనిసరనే నిబంధన అమల్లోకి రానుంది. రోజుకు కనీసం 15 వేల లీటర్లు లేదా అంతకమించి నీటిని విడుదలచేసే అన్ని భవనాలు, 25 నివాస యూనిట్లు, అంతకంటే ఎక్కువ ప్రాంగాణాలు ఉంటే వ్యర్థ జలాల రీ సైక్లింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. రీ సైక్లింగ్ చేసిన నీటిని ఉద్యానవనాలు, ఫషింగ్ ప్రయోజనాలకు వినియోగించాలి. ఇందుకు ఎంప్యానెల్ నిపుణుల అనుమతి పొందాలి. ధ్వని, వాయు కాలుష్య నియంత్రణలో భాగంగా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాలి. కేంద్రప్రభుత్వ అధీకృత ఏజెన్సీల నుంచి డీజీ సెట్లకు అనుమతి తీసుకోవాలి. పర్యావరణ హితమైన సౌర విద్యుత్ వినియోగంలో భాగంగా సోలార్ హీటర్ల స్థాపనతో పాటు భవనాల పైకప్పు పైభాగంలో మూడోవంతు స్థలాన్ని కేటాయించడం ద్వారా సోలార్ ప్యానల్లను ఏర్పాటు చేసుకునే వీలు కలుగుతుంది. 300 చదరపు మీటర్ల కంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న వ్యక్తిగత నివాస భవనాలు మినహా మిగిలిన అన్ని భవనాలకు ఈ నిబంధన తప్పనిసరి కానుంది.


