. 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమిగా తెలంగాణ
. ‘శ్రీమద్ భాగవతం’ ఫిల్మ్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి
విశాలాంధ్ర – హైదరాబాద్: దేశంలోనే రామోజీ ఫిల్మ్ సిటీ ఒక యూనిక్ ఫిల్మ్ సిటీ అని, అది తెలంగాణలో ఉండటం మనకు గర్వకారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ‘‘శ్రీమద్ భాగవతం పార్ట్-1’’ ఫిల్మ్ ప్రాజెక్ట్‌ను సోమవారం ప్రారంభించారు. సాగర్ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ఆకాష్ సాగర్ చోప్రా నిర్మాణ సారథ్యంలో ‘‘శ్రీమద్ భాగవతం పార్ట్-1’’తెరకెక్కిస్తున్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం మాట్లాడుతూ… శ్రీమద్ భాగవతం సినిమా తీయాలన్న ఆలోచన వచ్చినందుకు సినిమా బృందాన్ని అభినందించారు. నలభై ఏళ్ల క్రితం రామాయణం సీరియల్‌ను అందరికీ చేరువ చేసిందని, కోవిడ్ కాలంలో మరలా రామాయణం సీరియల్ ను ప్రసాచం చేసి ప్రపంచ రికార్డు సృష్టించిందన్నారు. 2035 లోగా తెలంగాణను ఒక ట్రిలియన్ ఎకానమిగాను, 2047 నాటికి మూడు ట్రిలియన్ ఎకానమిగా తీర్చిదిద్దాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడిరచారు. ఇందుకోసం 2047 విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసుకుంటున్నామని చెప్పారు. దీనిలో సినిమా రంగానికి ఒక ప్రత్యేక చాప్టర్ ఉంటుందని వివరించారు. ఆనాడు రామానంద్ సాగర్ తీసిన రామాయణం సీరియల్ ఎంత ప్రజాదరణ పొందిందో శ్రీమద్ భాగవతం పార్ట్-1 సినిమా అంత హిట్ అవుతుందని ఆకాంక్షించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రంగారెడ్డి పాల్గొన్నారు.


