Homeఅంతర్జాతీయంలూలాకు ప్రపంచ నేతల అభినందనలు

లూలాకు ప్రపంచ నేతల అభినందనలు

- Advertisement -

బ్రసీలియా: బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన వామపక్ష నేత లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వాకు ప్రపంచ దేశాల నేతల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. లాటిన్ అమెరికా దేశాలతో పాటు వివిధ దేశాల నాయకులు ఆయన విజయాన్ని ప్రజాస్వామ్యానికి దక్కిన విజయంగా అభివర్ణించారు. బ్రెజిల్తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని ప్రకటించారు.
మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ ‘ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి.. బ్రెజిల్ ప్రజలు విజయం సాధించారు. అధ్యక్షుడు లూలాకు అభినందనలు’ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. బొలీవియా అధ్యక్షుడు రోడ్రిగో పాజ్ పెరీరా స్పందిస్తూ.. బొలీవియా, బ్రెజిల్ పొరుగు దేశాలని, ఉమ్మడి చరిత్ర, సవాళ్లు వాటిని అనుసంధానిస్తున్నాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకుంటూ ప్రజలకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు కలిసి పనిచేస్తామని చెప్పారు.
పరాగ్వే అధ్యక్షుడు శాంటియాగో పెనా కూడా లూలాకు అభినందనలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో బ్రెజిల్ ప్రజలు చురుగ్గా పాల్గొనడాన్ని ప్రశంసించారు. ప్రాంతీయ సమగ్రత, అభివృద్ధి కోసం బ్రెజిల్తో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు.
అమెరికా సెనేటర్ బెర్నీ సాండర్స్‌ లూలా విజయాన్ని అసాధారణమైనదిగా అభివర్ణించారు. బ్రెజిల్ కార్మికుల హక్కులు, ప్రజాస్వామ్యం కోసం లూలా పోరాడారని, రాబోయే నాలుగేళ్లలోనూ అదే దిశగా ముందుకు సాగుతారని పేర్కొన్నారు.
కెనడా ప్రధాని మార్క్ కార్నీ లూలాకు అభినందనలు తెలుపుతూ.. ఇరు దేశాల మధ్య వాణిజ్య అవకాశాలను పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి కోసం పరస్పర సహకారాన్ని మరింత విస్తరించుకోవచ్చని పేర్కొన్నారు.
గ్వాటెమాలా అధ్యక్షుడు బెర్నార్డో అరేవాలో కూడా లూలా విజయాన్ని స్వాగతించారు. ఎన్నికల ప్రక్రియ బ్రెజిల్ ప్రజాస్వామ్య సంస్థలను మరింత బలోపేతం చేసిందని అన్నారు. అణగారిన వర్గాలకు మద్దతు ఇవ్వడం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణం వంటి ఉమ్మడి లక్ష్యాల కోసం కలిసి పనిచేస్తామని తెలిపారు. ఉరుగ్వే అధ్యక్షుడు యమండు ఓర్సీ సైతం లూలాతో మాట్లాడి అభినందనలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు